గ్రేటర్లో 22 నియోజకవర్గాలు పెరుగుతాయా ?
x

గ్రేటర్లో 22 నియోజకవర్గాలు పెరుగుతాయా ?

పార్టీల అంచనాల ప్రకారం ఇపుడున్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 179కి పెరుగుతుంది.


గడచిన 24గంటలుగా యావత్ తెలంగాణలో హాట్‌టాపిక్ ఏమిటంటే తొందరలోనే అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య పెరగటం. నియోజకవర్గాల సంఖ్యపెరిగే విషయమై అన్నీపార్టీల్లోనే విస్తృతమైన చర్చ జరుగుతోంది. పార్టీల అంచనాల ప్రకారం ఇపుడున్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 179కి పెరుగుతుంది. అలాగే 17 పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య 25 లేదా 26కి పెరుగుతుంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రప్రభుత్వం డిసైడ్ చేసింది. దీని ఆధారంగా ప్రతిరాష్ట్రంలోను 50శాతం సీట్లను పెంచటానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర హోంశాఖ అమిత్ షా ప్రకటించారు. దాంతో అన్నీ పార్టీల నేతలు పెరగబోయే నియోజకవర్గాల సంఖ్యపై లెక్కలు వేసుకుంటున్నారు.

ఈ నేపధ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలను తీసుకుంటే అదనంగా 22 నియోజకవర్గాలు పెరిగే అవకాశాలున్నట్లు సమాచారం. 2011 జనగణన ప్రకారం రాష్ట్రంలోని జనాభా సుమారు 3.52 కోట్లు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలోని జనాభా సగటున 1.93 లక్షలు. దీనికి కాస్త అటుఇటుగా పదిశాతం ఉండేలా పునర్విభజన జరిగే అవకాశాలున్నాయని సమాచారం. అప్పుడు హైదరాబాద్ జిల్లాలో పాటు సరిహద్దు జిల్లాల్లో కూడా అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి.

పైన చెప్పిన జిల్లాలను చూస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్ జిల్లా జనాభా 39.43 లక్షలు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం సగటు జనాభా చూస్తే హైదరాబాద్ జిల్లాలో 20 అసెంబ్లీ సీట్లుండాలి. కాని ఇపుడున్నది 15 సీట్లు మాత్రమే. అంటే పునర్విభజన తర్వాత హైదరాబాద్ జిల్లాలో అదనంగా ఐదు సీట్లు పెరుగుతాయని అనుకోవాలి. అలాగే మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా జనాభా 24.60 లక్షలు. జిల్లాలో 13 నియోజకవర్గాలకు అవకాశాలున్నాయి. ఇపుడున్న ఐదు నియోజకవర్గాలకు అదనంగా 8 నియోజకవర్గాలు పెరగబోతున్నాయని లెక్కలు కడుతున్నారు.

రంగారెడ్డి జిల్లా జనాభా 24.46 లక్షలు. జనాభా లెక్కల ఆధారంగా ఈ జిల్లాలో 13 నియోజకవర్గాలు వస్తాయి. అంటే ఇపుడున్న 8 నియోజకవర్గాలకు అదనంగా ఐదు నియోజకవర్గాలు ఏర్పడతాయని అంచనా వేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో ప్రస్తుతమున్న అసెంబ్లీ స్ధానాలకు అదనంగా మరో నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లాలో అదనంగా 3 నియోజకవర్గాలు ఏర్పడుతాయని తెలుస్తుంది. పై లెక్కలను గమనిస్తే కొత్తగా 22 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయని పార్టీల నేతలు లెక్కలు గడుతున్నారు. రాష్ట్రం మొత్తంమీద పెరుగుతాయని అనుకుంటున్న 60 నియోజకవర్గాలకు 22 నియోజకవర్గాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే పెరగబోతున్నాయి.

కొత్తగా ఏర్పాటవబోయే నియోజకవర్గాలు బంజారాహిల్స్, గచ్చిబౌలి, మియాపూర్, హిమాయత్ నగర్, శంషాబాద్, చందానగర్, నార్సింగి, బాచుపల్లి, కాప్రా, బోడుప్పల్, కీసర, బాలానగర్ పేర్లతో కొత్త నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరి రాజకీయపార్టీలతో కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహించబోయే సమావేశంలో ఎన్ని నియోజకవర్గాలు ఫైనల్ అవుతాయి, కొత్తగా ఏర్పాటవబోయే నియోజకవర్గాలు ఏవన్న విషయమై చర్చలు జోరుగా సాగుతున్నాయి. చివరకు ఏమవుతుందో చూడాలి.

Read More
Next Story