
కవితకు సంతోషం నిలుస్తుందా ? 16 టెన్షన్ పెరిగిపోతోందా ?
సీబీఐ వాదన విన్నతర్వాత కేజ్రీవాల్, సోసిడియా, కవితతో పాటు మిగిలిన 20మందికి హైకోర్టు నోటీసులు జారీచేసింది.
ఇపుడీ విషయంలోనే కల్వకుంట్ల కవిత అయోమయంలో పడిపోయుంటారు. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులను రౌస్ అవెన్యు కోర్టు కొట్టేసినా, హైకోర్టు టేకప్ చేసింది. లిక్కర్ కేసులో మనీల్యాండరింగ్ జరిగిందనేందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నా సీబీఐ కోర్టు(రౌస్ అవెన్యుకోర్టు) పరిగణలోకి తీసుకోలేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హైకోర్టులో బలంగా వాదించారు. దాంతో లాయర్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియా, కవితతో పాటు మరో 20మందికి నోటీసులు జారీచేసింది.
లిక్కర్ స్కామ్ లో నిందితులకు వ్యతిరేకంగా సీబీఐ ఎలాంటి ఆధారాలను చూపించలేకపోయిందని అందరిపైన నమోదైన కేసులను ప్రత్యేక కోర్టు ఫిబ్రవరి 27వ తేదీన కొట్టేసిన విషయం తెలిసిందే. సీబీఐ కోర్టు 23మందిపైన కేసులను కొట్టేసిన వెంటనే సీబీఐ హైకోర్టులో పిటీషన్ దాఖలుచేసింది. నిందితులకు వ్యతిరేకంగా తాముచూపించిన సాక్ష్యాలను రౌస్ అవెన్యు కోర్టు పరిగణలోకి తీసుకోకుండా కొట్టేయటం తప్పంటూ సీబీఐ హైకోర్టులో పిటీషన్ వేసింది. ఆ పిటీషన్ ను సోమవారం హైకోర్టు టేకప్ చేసింది. సీబీఐ వాదన విన్నతర్వాత కేజ్రీవాల్, సోసిడియా, కవితతో పాటు మిగిలిన 20మందికి హైకోర్టు నోటీసులు జారీచేసింది.
దీనివల్ల ఏమైందంటే అందరితో పాటు కవిత కూడా మళ్ళీ హైకోర్టులో తాను నిర్దోషినని నిరూపించుకోవాల్సిందే. వీళ్ళందరిపైనా సీబీఐ, ఈడీలు మనీల్యాండరింగ్ కేసులను కూడా నమోదుచేసున్నాయి. అయితే సీబీఐ వాదనను రౌస్ అవెన్యు కోర్టు పట్టించుకోకుండా కేసులను కొట్టేసింది. కేసులను కొట్టేయటమే కాకుండా దర్యాప్తుసంస్ధతో పాటు దర్యాప్తు అధికారిపైన కూడా రౌజ్ అవెన్యు కోర్టు జడ్జి జితేంద్ర ప్రతాప్ సింగ్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేయటం దేశంలో సంచలనంగా మారింది.
అందుకనే సీబీఐ, ఈడీలు గట్టిపట్టుతో హైకోర్టులో పిటీషన్లు దాఖలుచేశాయి. నిందితులు మనీల్యాండరింగ్ కు పాల్పడ్డారు అనేందుకు అన్నీ సాక్ష్యాలను తాము చార్జిషీటులోనే పొందుపరిచినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విచారణలో చెప్పారు. మద్యం విధానంలో తమకు అనుకూలమైన నిబంధనలు విధించినందుకు నిందితులు ‘ఆప్’ పార్టీకి చెందిన విజయ్ నాయర్ కు రు. 100 కోట్లు చెల్లించినట్లు ఆధారాలను అందించినట్లు చెప్పారు. ఈ రు. 100 కోట్లలో రు. 44.50 కోట్లను హవాలో రూపంలో అందగా దాన్నే గోవాఎన్నికల్లో పార్టీ ఖర్చు చేసిందన్నారు. తాము ఆధారాలతో చూపించిన ఏ సాక్ష్యాన్నీ ట్రయల్ కోర్టు అసలు పరిగణలోకే తీసుకోలేదన్నారు.
కేసులో డబ్బును చేతులు మార్చిన దినేష్ అరోడా లాంటి వారు అప్రూవర్లుగా మారిన విషయాన్ని, డబ్బులు ఎవరెవరికి ఏ విధంగా చేతులు మారాయి అన్న ఆధారాలను చూపించినా ట్రయల్ కోర్టు పట్టించుకోలేదన్నారు. అశోక్ కౌశిక్ అనే వ్యక్తి తానే డబ్బును రెండుసంచుల్లో మోసుకుని వెళ్ళి నిందుతుల అడ్రస్సులకు అందించినట్లు స్వయంగా చెప్పినా ఆసాక్ష్యాన్ని కూడా ట్రయల్ కోర్టు పట్టించుకోలేదని తుషార్ చెప్పారు. తుషార్ వాదనలు విన్న హైకోర్టు జస్టిస్ సూర్యకాంత్ శర్మ ధర్మాసనం కేసులోని నిందుతులందరికీ నోటీసులు జారీచేయాలని ఆదేశించారు. కేసు విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేశారు. అప్పటిలోగా నిందుతులందరు నోటీసులకు జవాబులు పంపాలని కూడా ఆదేశించారు.
తాజాపరిణామంతో కవిత సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదని అర్ధమవుతోంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో నిందితులు మనీల్యాండరింగుకు పాల్పడ్డారని ఆరోపించిన సీబీఐ, ఈడీలు అందుకు తాము సాక్ష్యాలను కూడా అందించినట్లు జస్టిస్ కు చెప్పారు. ఈ సాక్ష్యాలను పరిశీలించిన తర్వాతే ధర్మాసనం నిందితులందరికీ నోటీసులు జారీకీ ఆదేశించింది. అంటే ట్రయల్ కోర్టు కొట్టేసిన కేసును హైకోర్టు టేకప్ చేసిందంటే సీబీఐ, ఈడీ లాయర్ వాదనతో ఏకీభవించినట్లుగానే అనుకోవాలి. కాబట్టి నిందితులందరు కేసులో మళ్ళీ హైకోర్టు మెట్లు ఎక్కక తప్పదు. 16వ తేదీ విచారణలో జస్టిస్ సూర్యకాంతశర్మ ఏమంటారో చూడాల్సిందే.

