
కేసీఆర్ బ్రాండ్ వాల్యూ మున్సిపల్ ఎన్నికల్లో తేలిపోతుందా ?
ఒక్కడివల్లే తెలంగాణ వచ్చిందని కేటీఆర్, హరీష్ లాంటి వాళ్ళు చెప్పటం అతిశయోక్తనే చెప్పాలి
మున్సిపల్ ఎన్నికలు అంటే జనాల్లో పార్టీలకు ఉన్న ఆదరణతో పాటు పోటీచేస్తున్న అభ్యర్ధుల వ్యక్తిత్వం కూడా చాలా కీలకం. ఎందుకంటే ఈ ఎన్నికలు పార్టీ బ్యానర్ మీదే జరుగుతాయి కాబట్టి. మున్సిపల్ ఎన్నిలను రాజకీయ పార్టీల బలం, ప్రజల మనోభావాలు, భవిష్యత్ రాష్ట్ర రాజకీయ దిశను సూచించే ఎన్నకలుగా చెప్పుకోవచ్చు. ఇంతటి కీలకమైన ఎన్నికల్లో కేసీఆర్ పాత్ర నిజంగా కీలకమా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. (KCR)కేసీఆర్ ను బీఆర్ఎస్ కీలకనేతలు (KTR)కేటీఆర్, హరీష్(Harish) జాతిపితగా అభివర్ణిస్తుంటే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రులు ఎద్దేవాచేస్తున్నారు. చావునోట్లో తలపెట్టి తెలంగాణను సాధించిన గొప్పయోధుడని బీఆర్ఎస్ నేతలు అంటుంటే, రేవంత్(Revanth) అండ్ కో తెలంగాణ ఏర్పాటు కేసీఆరే ఒక్కడి వల్లే కాలేదు,(Sonia Gandhi) సోనియమ్మ,రాహూల్ గాంధీ అనుకోబట్టి, లక్షలమంది ఉద్యమాలు చేయడం, కొదరు ఆత్మబలిదానాలకు చలించిన సోనియాగాంధీ నిర్ణయంవల్లే తెలంగాణ సాకారమైందని కౌంటర్లు వేస్తున్నారు.
కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన నేతగా, రాష్ట్ర సాధనలో ప్రధాన పాత్రధారి అనటంలో సందేహంలేదు. అంతేకాని తన ఒక్కడివల్లే తెలంగాణ వచ్చిందని కేటీఆర్, హరీష్ లాంటి వాళ్ళు చెప్పటం అతిశయోక్తనే చెప్పాలి. ఉద్యమంలో 1200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. లక్షలాదిమంది జనాలు ఉద్యమంలో పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎవరు ఎన్నిచెప్పుకున్నా ఉద్యమ నాయకత్వం వేరు ఎన్నికల ప్రభావం వేరు. ఈ విషయం 2014లో జరిగిన మొదటి ఎన్నికలోనే తేలిపోయింది.
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలో బీఆర్ఎస్ గెలిచింది కేవలం 64 సీట్లు మాత్రమే. కేసీఆర్ పేరుచెప్పినా ఈమధ్యనే జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో జనాలు బీఆర్ఎస్ కు ఓట్లేయలేదు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఎక్కువగా రోడ్లు, డ్రైనేజీలు, నీటి సమస్యలు, స్థానిక అభివృద్ధి వంటి అంశాల ఆధారంగానే ఓట్లేస్తారు. అందుకే కేసీఆర్ ప్రభావం మున్సిపల్ ఎన్నికల్లో ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి.
నిజానికి కేసీఆర్ ఇప్పటికీ తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద బ్రాండే. గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణాల్లోనూ ఆయనకు ఉద్యమనేతగా పెద్ద గుర్తింపే ఉంది. అయితే గతంలో ఉన్న సంపూర్ణ ఆధిపత్యం తెలంగాణపై ఇప్పటికీ ఉందా అంటే లేదనే చెప్పాలి. కాంగ్రెస్ అధికారంలోకి రావటం, బీజేపీ బలోపేతం లాంటి అంశాలు బీఆర్ఎస్ కు గట్టిపోటీని ఇస్తున్నాయి.
మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ కీలకమా అంటే, బీఆర్ఎస్ కు అధినేతే పెద్ద బ్రాండ్. కానీ స్థానిక స్థాయిలో అభ్యర్థుల బలం, పార్టీ క్యాడర్, ప్రజాసమస్యల పరిష్కారం లాంటి అంశాలే ఎక్కవ ప్రభావాన్ని చూపుతాయి. కేవలం కేసీఆర్ పేరు చెప్పి అభ్యర్ధులు గెలిచే పరిస్థితి లేదు. పైగా కేసీఆర్ ఎన్నికల్లో ప్రచారం చేయటం కూడా అనుమానమే. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కూడా కేసీఆర్ ప్రచారం చేస్తారని కేటీఆర్ చెప్పినా చివరకు అధినేత ఫామ్ హౌస్ దాటి రాలేదు. చివరకు బీఆర్ఎస్ అభ్యర్ధిని గెలిపించమని ఒక్కసారి కూడా ఓటర్లను అడగలేదు.
ఇక కేసీఆర్ జాతిపిత అవుతారా? అన్న మాట రాజకీయ ప్రచారంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం. జాతిపిత అన్న పదం చరిత్రలో మహాత్మాగాంధీకి మాత్రమే పరిమితమైంది. తెలంగాణ ఉద్యమచరిత్రలో కేసీఆర్ కీలక నాయకుడని మాత్రమే చెప్పాలి. అలాంటి కేసీఆర్ ను జాతిపిత స్థాయికి కేటీఆర్, హరీష్ తీసుకెళ్లడంలో జనాలకు బలవంతంగా ట్యాగ్ తగిలించాలన్న ప్రయత్నమే కనబడుతోంది. ప్రజలు ఎవరు కేసీఆర్ ను జాతిపితగా అనుకుంటున్నట్లు లేరు. ఈ విషయాన్నే రేవంత్ సూటిగా ప్రశ్నించారు.
దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎలాంటి పదవులు కోరుకోలేదని గుర్తుచేశారు. అధికారంలో ఉన్నపుడు చేసిన తప్పుడు పనులకు ఇపుడు కేసులు పెట్టకూడదు, విచారించకూడదంటే ఎలాగని ఎద్దేవా చేశారు.
తెలంగాణ సాధించిన తర్వాత అప్పుడు కేసీఆర్ పాలన ఎలా ఉంది? అభివృద్ధి జరిగిందా జరిగిందా? యువతకు ఉద్యోగాలు వచ్చాయా? పట్టణాల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయా? ఇపుడు రేవంత్ పాలన ఎలాగుందనే విషయాన్ని జనాలు విశ్లేషించుకుంటున్నారు. తొమ్మిదిన్నరేళ్ళ కేసీఆర్ పాలనను రెండేళ్ళ రేవంత్ పాలనతో జనాలు పోల్చి చూసుకుంటున్నారు. ఇద్దరి పాలనలో ఎవరిది మెరుగు అని జనాలు అనుకుంటే వాళ్ళకే ఓట్లేస్తారు.
కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ పాత్ర ముఖ్యమే, కానీ తన పేరు, మొహం చూసి జనాలు బీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపిస్తారు, రేవంత్ పాలనపై జనాలంతా తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని కేటీఆర్, హరీష్ మీడియాలో చెప్పుకుంటే సరిపోదు. కేసీఆర్ బలమేమిటో, బలహీనతలు ఏమిటో జనాలకు బాగా తెలుసు. కాబట్టి బీఆర్ఎస్ జాతిపిత బ్రాండ్ వాల్యూ మున్సిపల్ ఎన్నికల్లో తేలిపోతుంది.
పెద్ద ప్రభావం ఉండదు: సాయి ప్రసాద్
‘కర్మ హిట్స్ బ్యాక్’ అన్న కల్వకుంట్ల కవిత ట్వీట్ ను రిటైర్డ్ ఐటీ అధికారి సాయి ప్రసాద్ శాస్త్రి గుర్తుచేశారు. ‘‘మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘స్ధానికఎన్నికల్లో ఎక్కువగా సమస్యలు, వాటి పరిష్కారాలు, అందుబాటులో ఉండే వ్యక్తుల మీద ఆధారపడే జనాలు ఓట్లేస్తారు’’ అని చెప్పారు. ‘‘కాబట్టి రెండేళ్ళ రేవంత్ రెడ్డి పాలనలో సమస్యలు, వాటి పరిష్కారాలను కేసీఆర్ పాలనతో పోల్చిచూసుకుని ఓట్లేస్తారు’’ అని తెలిపారు. ‘‘బీఆర్ఎస్ కు కేసీఆర్ వల్ల సీట్లు గెలవటం కన్నా మంత్రుల అవినీతి, కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటల వల్లే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశముంది’’ అని శాస్త్రి అభిప్రాయపడ్డారు.

