
సంగారెడ్డి లో మళ్ళీ ప్రచారం చేయను: జగ్గా రెడ్డి
రాహుల్ గాంధీ నాకోసం ప్రచారం చేసిన ప్రజలు నన్ను గెలిపించలేదు అంటున్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్
రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి తన కోసం ప్రచారం చేసినా సంగారెడ్డి లో ప్రజలు ఓడించారని యిక ఎప్పటికీ అక్కడి నుంచి పోటీ చేయనని తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జగ్గా రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. సంగారెడ్డి లో పేదలు తన వైపు వున్నా మేధావులు తనను కొంత మంది తనను ఓడించారని అన్నారు.
రాహుల్ గాంధీ తన భుజంపై చేయి వేసి తనను గెలిపించమని ప్రజలకు పిలుపు ఇచ్చినా తనను ఓడించటాన్ని ఎప్పటికీ మరిచిపోనని అన్నారు. తన భార్య పోటీచేసినా తాను సంగారెడ్డి లో ప్రచారం చేయనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికలు జరిగి రెండు సంవత్సరాల తరువాత ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేయటం చర్చనీయాంశం అయ్యింది. ఇప్పటికే తాను యిక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయనని పోయిన ఏడు దసరా సంబరాల్లో ప్రకటించారు. తన భార్య లేదా తన అనుచరుడు చేర్యాల ఆంజనేయులు తన స్థానంలో పోటీ చేస్తారని చెప్పారు.
2023 అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడిన తరువాత అన్ని పార్టీలు తమ అగ్ర నాయకత్వాన్ని ప్రచారంలోకి దించాయి. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ సంగారెడ్డి, అందోల్, కామారెడ్డి లో ప్రచారం చేశారు. బీజేపీ తరపున ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, ముఖ్య మంత్రులు యోగి ఆదిత్యనాథ్ తదితరులు ప్రచారం చేశారు.
నవంబర్ 2022 లోనూ తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించిన తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వున్న జగ్గా రెడ్డి 2023 ఎన్నికల్లో తన ఆలోచన మార్చుకుని పోటీ చేశారు. తనకు అవకాశం యిస్తే ఇతర రాష్ట్రాలలో పార్టీ కోసం ప్రచారం చేస్తానని తన తల్లిదండ్రుల పేరు మీద ట్రస్ట్ స్థాపించి పేదలకు విద్య వైద్యం అందిస్తానని చెప్పారు. తన భార్యకు టికెట్ ఇస్తే తన గెలుపు కోసం కృషి చేస్తానని అప్పుడు ప్రకటించారు.
తన ధ్యాస అంతా రాహుల్ భారత్ జోడో యాత్రను విజయవంతం చేయటం మీదే వుందని ఆ సమయంలో ప్రకటించిన ఆయన వార్తల్లో ఎలా నిలవాలో తెలిసిన నాయకుడిగా పేరుపడ్డారు.

