వెలమ-రెడ్ల పట్టునుంచి బిసిల చేతికి జగిత్యాల ఎపుడొస్తుంది?
x
కాంగ్రెస్ లో జగిత్యాల లొల్లి. టి. జీవన్ రెడ్డి(ఎడమ), డాక్టర్ సంజయ్ కుమార్

వెలమ-రెడ్ల పట్టునుంచి బిసిల చేతికి జగిత్యాల ఎపుడొస్తుంది?

జీవన్ రెడ్డి పోతే మాకు పోయేదేమీ లేదు . సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ మాతో వున్నాడని రేవంత్ భరోసా!


ఇటీవల ఏర్పడిన జగిత్యాల జిల్లా ప్రాంతం దశాబ్దాలుగా వెలమ రెడ్డి రాజకీయాల మధ్య వెనకబడిన కులాలు నలిగి పోతున్నాయి. ఇక్కడ పార్టీ టికెట్ ఇస్తే బీసీలు తప్పకుండా గెలుస్తారు. కాని టికెట్ రాకుండా రాజకీయాలు చేస్తారు. టికెట్ వచ్చాక సొంత పార్టీ అభ్యర్థిని ఓడించే రాజకీయాలు చేస్తారు. అయినా బీసీలు టికెట్ ఇచ్చాక గెలుచుకుంటూ వచ్చారు.

జగిత్యాల నియోజక వర్గ రాజకీయాల్లో 1969 ‘జై తెలంగాణ’ ఉద్యమం ఒక మలుపు. బీసీ విద్యార్థులు బాగా చైతన్య వంతులయ్యారు. నిజానికి 1953 లోనే మెట్ పెల్లి నుండి గంగుల భూమయ్య (పద్మశాలి సామాజిక వర్గం) వెలమలను ఎదిరించి ఎమ్మెల్లేగా గెలిచారు. వెలమల పట్టున్న బుగ్గారం అనే నియోజక వర్గం నుండి బీసీలైన అంబల్ల రాజారాణ, కడకుంట్ల గంగారాం, శికారి విశ్వనాధం టీడీపి టికెట్ పై గెలిచారు. జగిత్యాల నియోజక వర్గం నుండి బీసీలైన గొడిసెల రాజేశం గౌడ్, ఎల్ రమణ టి జీవన్ రెడ్డి పై గెలుస్తూ వచ్చారు. రాయికల్ వాస్తవ్యులైన వేముల పెరుమాళ్లు బలమైన బీసీ నాయకులు ఎమ్మెల్యే కావలసిన వారు. కాలేదు. కోరుట్ల నుండి అంబల్ల భాగ్యమ్మ, జగిత్యాల మున్సిపాలిటీ చైర్మన్ గా పుప్పాల ఆశాలు విజయ వంతంగా ప్రజల ప్రశంసలు అందుకున్నారు. అంతకు చాలా ముందు జగిత్యాల మునిసిపాలిటీ చైర్మన్ గా జోగయ్య గౌడ్ పని చేసారు. మేజర్ గ్రామ పంచాయతీలైన ధర్మపురిలో , బీసీలు…చీపురుశెట్టి కిష్టయ్య, మల్యాలలో మిట్టపెల్లి సుదర్శన్, బలమైన సర్పంచులుగా పని చేసారు. ఇలా ఆయా కాలాల్లో ఎమ్మెల్లేగా పోటీ చేసి గెలిచే విధంగా ఎదుగుతూ వచ్చారు.
రాష్ట్ర రాజకీయాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి రాజకీయ నాయకులు 1969 లో తెలంగాణ కోసం శాసన సభ్యత్వానికి రాజీనామా చేసారు. తరువాత డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రాజకీయం పెరిగింది. బీసీ రాజకీయం రాష్ట్ర స్థాయి నాయకత్వ మద్దతు లేక వెనకబడింది.
రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పడానికి బాలా గౌడ్, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారల శక్తి చాల లేదు. కమంగా . వెలమ,రెడ్డి రాజకీయాల బలం పెరిగి బీసీ నాయకత్వం వెనక బడింది.
మధ్యలో నక్సలైట్ల ఉద్యమం వచ్చింది. ఎన్నికలను బహిష్కరించాలన్నారు. దాంతో ఉద్యమంలో చైతన్య వంతులైన నాయకులు పోటీ చేయకుండా పోయింది. ఎన్నికలను బహిష్కరించడంతో వెలమలు రెడ్లు ఆడుకున్నంత ఆట పాడుకున్నంత పాటగా అగ్ర కుల నాయకత్వానికి ఎదురు లేకుండా పోయింది
1962 లో తన కులం వారైన పద్మశాలీలే ఎక్కువ ఉన్నారని కస్తూరి లక్ష్మణ్ జగిత్యాల లో పోటీ చేస్తే ఓడిపోయారు. ఆ దిగులుతో ఆత్మ హత్య చేసుకున్నాడు.
1981లో జీవన్ రెడ్డి మల్యాల పంచాయతి సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నిక యువతరానికి ఉత్తేజం. ఆ ఎన్నికతో పాత తరానికి ఫుల్ స్టాఫ్ పడింది. 1983లో ఎన్టీ ఆర్ టిడిపిలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎక్సైజ్ మంత్రి అయ్యారు. మొదటి తప్పటడుగు వేసి నాదెండ్ల భాస్కర రావును సమర్థించారు. 1985 ఎన్నికల్లో జీవన్ రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేయగా బీసీ సామాజిక వర్గం నుండి టిడిపీ తరఫున జి రాజేశం గౌడ్ గెలిచి న్యాయ శాఖ మంత్రి అయ్యారు.
ఆ తరువాత 1994 లో జీవన్ రెడ్డిపై టీడీపి తరఫున ఎల్ రమణ గెలిచి మంత్రి అయ్యారు. జిగిత్యాలకు రెండు కిలోమీటర్ల దూరంలో అంతర్గామ రాజేశం గౌడ్ స్వగ్గామం. అక్కడి సుద్దాల దేవయ్య ఎస్సీ నియోజక వర్గం నుంచి గెలిచి మంత్రి.
ప్రస్తుత ఎమ్మెల్యే వెలమ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సంజయ్ ది కూడ అంతర్గాం సొంత ఊరు. మెుదట జగిత్యాల లో వెలమ రాజకీయాలు. దాన్ని జీవన్ రెడ్డి బ్రేక్ చేసారు. జీవన్ రెడ్డి గారి 'రెడ్డి' రాజకీయాలను బీసీ కార్డుతో రాజేశం గౌడ్, ఎల్ రమణ బ్రేక్ చేశారు. రాష్ట్ర స్థాయికి ఎదిగారు. కాని జగిత్యాలలో వారిపై జీవన్ రెడ్డి ఓడుతూ గెలుస్తూ వస్తున్నారు. ఇలా దశాబ్దాల కాలంలో వెలమలు పోయి రెడ్డి , బీసీల రాజకీయాలు వచ్చాయి. దానికి టిడిపి అండ. కెసిఆర్ తిరిగి వెలమ రాజకీయాలు ముందుకు తెచ్చారు.
కల్వకుంట్ల కవిత మద్దతుతో వెలమకులానికి చెందిన డాక్టర్ సంజయ్ కుమార్ గెలిచారు. రెండుసార్లు గెలవడంతో జీవన్ రెడ్డి రాజకీయాలు, బీసీ రాజకీయాలు వెనక్కి నెట్టి వేయబడి వెలమ రాజకీయం ముందుకు వచ్చింది. డబల్ బెడ్రూం పథకం లబ్ది దారుల ఓట్లతో రెండవసారి డాక్టర్ సంజయ్ గెలిచాడు.
బీసీలు రాజకీయంగా ఎదిగి వచ్చినప్పటికీ జీవన్ రెడ్డి పై చేయి సాధించారు. జీవన్ రెడ్డి పై ‘మలి తెలంగాణ’ ఉద్యమ చైతన్యంతో సంజయ్ గెలిచారు. టీఆర్ ఎస్ లోకి రమ్మని అవకాశం ఇచ్చినా ఎల్ రమణ రాలేదు. నాకు అన్నీ చేసిన టీడీపీని ఏమని వదలాలి అన్నాడు. అలా బీసీ రాజకీయం స్థానంలో తిరిగి వెలమ రాజకీయం రావడానికి ఎల్ రమణ కారకుడయ్యారు. అలా బీసీ రాజకీయాల వేకెన్సీని వెలమ డాక్టర్ సంజయ్ పూరించారు. ఎల్ రమణ బీసీల నుండి ఎదిగటివచ్చి రాజకీయంగాత నిలదొక్కుకోలేక పోయారు.
జీవన్ రెడ్డి బలహీనత
కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి తాను తప్ప యువతరం నాయకులను తయారు చేయ లేక పోయారు. ఆదెబ్బతో అంతదాక కాంగ్రెస్ లో వున్న నాయకులు కూడా కనుమరుగయ్యారు. అయితే జీవన్ రెడ్డి తప్ప కాంగ్రెస్ దిక్కెవరు అనే భావం తీసుకువచ్చి తన చాతుర్యంతో రాజకీయాల్లో పట్టు సాధించారు. అందుకే నువ్వు పార్టీ దాటి పోవద్దు అనే బలిమాలేందుకు కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి ఇంటి చుట్టూర తిరుగుతున్నారు.
జగిత్యాల నుండి మావోయిస్టు నాయకులు గణపతి/ ముప్పాళ్ల లక్ష్మణ్ రావు జిల్లా దాటి , రాష్ట్రం దాటి జాతీయ స్థాయిలో ఎదిగారు. అలిశెట్టి ప్రభాకర్ వంటి రచయితలు జగిత్యాల వదిలి రాష్ట్ర స్థాయికి ఎదిగారు. కానీ,జీవన్ రెడ్డి ప్రధాన లోపం ఏమంటే జగిత్యాల దాటి ఎదగమంటే ఎదగరు.
నలభయి ఏళ్ల నుంచి కాంగ్రెస్ ఉన్నా తాను తప్ప మరొకరిని ఎవరినీ నాయకులుగా ఎదిగించింది లేదు. . కేవలం తను చెప్తే వినే వారిని మువ్సిపల్ చైర్మన్లుగా చేసాడు. సర్పంచులుగా చేసాడు. టిడిపి నుండి తనతో పాటు కాంగ్రెస్ రమ్మంటే రాని వారి మీద పగ ప్రతీకారం ఆయన్ని ఫ్యాక్షనిస్టుగా నిలిపాయి. అందుకే నా మర్యాద కరువయిందని అరుస్తున్నాడు.
రాజేశం గౌడ్ గెలిచి న్యాయ శాఖ మంత్రిగా అటు తరువాత కరీం నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా పని చేశారు. సుద్దాల దేవయ్య కూడా ఎమ్మెల్యే గా, జిల్లా పరిషత్ చైర్మన్గా ఎస్సీల నుండి ఎదిగారు. బుగ్గారం నియోజక వర్గం పేరు మారి సవరించిన పరిధులతో ధర్మపురి నియోజక వర్గంగా ఏర్పడి ఎస్సీ రిజర్వేషన్ అయింది. దాంతో ఆ మేరకు వెలమల రాజకీయం బలం తగ్గింది. ధర్మ పురినుండి కొప్పుల ఈశ్వర్టీ ఆర్ ఎస్ తరఫున గెలిచి మంత్రి అయ్యారు. ఇపుడు అడ్లూరి లక్ష్మణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
‘మలి తెలంగాణ’ ఉద్యమంలో కోరుట్ల, మెట్ పెల్లి లో బలమైన బీసీల రాజకీయాలను వెనక్కి నెట్టి వెలమ రాజకీయాలు తోసుకొని వచ్చాయి. బీసీలకు టికెట్లు రాకుండా చేయడం, టికెట్ వచ్చినా గెలువ కుండా చేసి వెలమలనే గెలిపించుకోవడం వెలమలు మొదటి నుండి అనుసరిస్తున్న పాలసీ. ఎర్ర జెండాతో గెలిచినాయన ఆ నియోజక వర్గం దాటగానే కమలం కాషాయ జెండాలతో ప్రచారం చేసిన ఈ ప్రాంత వెలమల రాజకీయాలది.
జీవన్ రెడ్డి కష్టాలు ఏమిటి?
ఇపుడు జీవన్ రెడ్డి రాజకీయాల్లో ఒంటరి అయ్యారు. జూనియర్ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధ్యక్షుడు కావడాన్ని జీవన్ రెడ్డి బలంగా వ్యతిరేకించారు. అది రేవంత్ మనసులో వుంది. జానారెడ్డి కొడుకును తీసుకుని జానారెడ్డి ని వెనక్కి నెట్టి కూడా రేవంత్ జానారెడ్డి ని సంతృప్తి పరిచారు.
జీవన్ రెడ్డి పిల్లలు రాజకీయాల్లోకి రాలేదు. ఇపుడు కేంద్ర రాష్ట్ర అధిష్టానంతో తాడో పేడో తేల్చుతుందా నుకుంటున్నారు. ఈ 75 ఏళ్ల వయసులో యువ నాయకుడిలా ప్రవర్తిస్తున్నారు. జీవన్ రెడ్డి ప్రజల మనిషి. ఎన్నో అడ్డంకులను దాటి స్వయంగా ఎదిగిన నాయకుడు. జీవన్ రెడ్డి పోతే మాకు పోయేదేమీ లేదు . సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ మాతో వున్నాడని రేవంత్ భరోసా! అలా అనుకోవద్దు.
ఈ ఆవుల కొట్లాటలో బీసీల కాళ్లు విరిగినట్టవుతున్నాయి. బీసీలు తిరిగి ఎదగాలి. ఇపుడు బీసీ చైతన్యం పెరిగింది. మూడో సారి డాక్టర్ సంజయ్ కుమార్ గెలుపు సందేహాస్పదం . ఇపుడు మూడు వర్గాలను సంఘర్షణ లేకుండా సమన్వయం చేయడం రావాలి. జీవన్ రెడ్డి ని బుజ్జగించి ఆర్టీసీ చైర్మన్,ఫుడ్ కమిషన్ చైర్మన్ , కాడా చైర్మన్ వంటి ప్రతిష్ట గల సంస్థకు చైర్మన్ ను చేయాలి. జగిత్యాల రాజకీయాలనుండి రిటైర్మెంటు తీసుకోవాలి. అపుడు బీసీ రాజకీయాలకు దారి సుగమం అవుతుంది. మలి తెలంగాణ ఉద్యమంలో కోల్పోయిన బీసీల అవకాశాలు పోటీ చేసి గెలిచి అందుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో డాక్టర్ సంజయ్ కుమార్ కూడాఏదో ఒక సంస్థకు చైర్మన్ కావడం ద్వారా జగిత్యాల్లో నూతన తరం రాజకీయాలకు అవకాశం ఇచ్చిన వారవుతారు . రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి పరస్పర గౌరవంతో పాతవి మరిచి కలిసి పోవాలి. అందుకు జీవన్ రెడ్డి పట్టు వీడాలి. మంకు , పట్టుదలకు పోయి నాకన్నా జూనియర్ , నా కన్నా జూనియర్.. అని బెట్టు పోయిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం కోల్పోయారని గుర్తు చేసుకోవడం అవసరం. 1969 లో తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసాక 1972 నుండి మారిన పరిస్థితుల్లో చెన్నారెడ్డి తో , ఉమా శంకర్ దీక్షిత్ తో, పివీతో, , టంగుటూరి అంజయ్యతో కాస్త బెట్టు సడలిస్తే కొండా లక్ష్మణ్ బాపూజీ కేంద్ర మంత్రిగా, గవర్నర్‌గా పదవీ విరమణ చేసి వుండేవారు. జీవన్ రెడ్డి ఈ చరిత్ర నుండి నేర్చుకోవాల్సి వుంది.


Read More
Next Story