
డీలిమిటేషన్ పై రేవంత్ ఫార్ములా వర్కవుట్ అవుతుందా ?
కేంద్రం నుంచి దక్షిణాది రాష్ట్రాల నిధుల వాట దామాషాలో సీట్ల పెంపు జరగాలని రేవంత్ ప్రతిపాదిస్తున్నారు.
నియోజకవర్గాల పునర్విభజన ద్వారా పార్లమెంట్, అసెంబ్లీల సీట్ల సంఖ్య పెంపు పెద్ద వివాదమవుతోంది. సీట్ల పుంపు విషయంలో 50 స్లాబ్ ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఉత్తరాధి, ధక్షిణాది రాష్ట్రాలనే తేడాలేకుండా 50శాతం స్లాబ్ విధానంతో సీట్లను పెంచబోతున్నట్లు అమిత్ షా చేసిన ప్రకటనను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తప్పుపడుతున్నారు. రెండురోజుల క్రితం ఢిల్లీలో జరిగిన సీడబ్య్లూసీ సమావేశంలో కూడా అమిత్ షా ప్రకటించిన సూత్రాన్ని తప్పుపడుతు తీర్మానంచేశారు. తర్వాత జరిగిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడుతు ‘‘దేశ ఆర్ధికప్రగతికి దక్షిణాది రాష్ట్రాల వాట దామాషాలో సీట్ల పెంపు జరగాలి’’ అనే పరిష్కారాన్ని సూచించారు. సీట్ల పెంపుకు రేవంత్ సూచించిన పరిష్కారమార్గం సరైనదేనా అనే చర్చ జరుగుతోంది.
ఇదే విషయమై తెలంగాణ ఫెడరల్ మేథావులతో మాట్లాడినపుడు రేవంత్ పరిష్కార సూచన ఆచరణయోగ్యం కాదన్న విషయం తేలిపోయింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘ఆర్ధిక అంశాలను దృష్టిలో పెట్టుకుని చట్టసభల్లో సీట్లపెంపు సాధ్యంకాదు’’ అన్నారు. ‘‘ఆర్ధిక అంశాలను ఫైనాన్స్ కమిషన్, నీతిఅయోగ్ చూసుకుంటాయి’’ అని అన్నారు. ‘‘ఉత్తర, ధక్షిణాది రాష్ట్రాల మధ్య సీట్ల సంఖ్యలో తేడా అన్నది ఎప్పటికీ ఉంటుంది’’ అని స్పష్టంచేశారు. ‘‘సీట్లసంఖ్యలో ఉత్తర, ధక్షిణాది రాష్ట్రాల మధ్య తేడాను సర్దుబాటుచేయటం ఎప్పటికీ సాధ్యంకాదు’’ అన్నారు. ఎందుకంటే ‘‘ధక్షిణాదిలో నాలుగు రాష్ట్రాలుంటే ఉత్తరాధిలో ఎన్ని రాష్ట్రాలున్నాయో అందరికీ తెలిసిందే’’ అని చెప్పారు. ‘‘ఉత్తర, ధక్షిణాది రాష్ట్రాల సంఖ్యలోనే ఇంత తేడా వున్నపుడు సీట్ల సంఖ్యలో తేడాలుండటాన్ని తప్పుపట్టాల్సిన అవసరంలేదు’’ అన్నారు.
పోరాటం చేయాల్సిందే: శర్మ
‘‘2011 జనాభా లెక్కల ఆధారంగా కేంద్రప్రభుత్వం డీలిమిటేషన్ చేస్తే చట్టసభల సీట్లలో దక్షిణాది రాష్ట్రాల షేర్ తగ్గిపోతుంది’’ అని ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ఇదే విషయాన్ని దక్షిణాది సీఎంలకు తాను చాలాకాలం క్రితమే లేఖలు రాశాను’’ అని చెప్పారు. ‘‘పార్లమెంటులోని సీట్ల ఆధారంగా 50శాతం సీట్లను ప్రోరేటా పద్దతిలో పెంచుతామని అమిత్ షా చెప్పారు’’ అని గుర్తుచేశారు. ఇంతకన్నా మంచి మార్గంలేదు అని కూడా అన్నారు. అయితే ప్రోరేటా పద్దతిని అమలుచేయటంలో కేంద్రప్రభుత్వంలో చిత్తశుద్దిని శర్మ అనుమానించారు. ఈ విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్, ముఖ్యమంత్రి రేవంత్ కేంద్రప్రభుత్వ చిత్తశుద్దిని అనుమానిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.
‘‘సీట్ల సంఖ్యలో అంతరాలు తగ్గాలంటే దక్షిణాది రాష్ట్రాలు ఏకతాటిపైకి వచ్చి ఉద్యమం మొదలుపెట్టడం ఒకటే మార్గం’’ అని శర్మ సూచించారు. ఎందుకంటే, ‘‘మోదీ ప్రభుత్వం ఫెడరల్ వ్యవస్ధను బాగా బలహీనం చేసింది’’ అని మండిపడ్డారు. ‘‘మనకు న్యాయబద్ధంగా దక్కాల్సిన వాటికోసం కూడా రాష్ట్రాలు పోరాటాలు చేయాల్సి రావటం చాలా దురదృష్టకరం’’ అని అన్నారు. ‘‘రాజీవ్ గాంధీ నాయకత్వంలో కేంద్రప్రభుత్వాన్ని గతంలో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు అడ్డుకున్నట్లే ఇపుడు కూడా అడ్డుకోవటం ఒకటే మార్గం’’ అని స్పష్టంచేశారు. అప్పట్లో ఎన్టీఆర్ నాయకత్వంలో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు, పార్టీలు ఏకమైన విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి పోరాటాన్ని ఇపుడు కూడా చేయకతప్పదు అని కూడా అన్నారు.
ఎంపీల వాటా 25శాతంకు పెరగాలి : కూరపాటి
‘‘పార్లమెంటు సీట్లలో దక్షిణాది రాష్ట్రాల వాట ఇపుడు 19శాతం మాత్రమే’’ అని కాకతీయ యూనివర్సిటి పొలిటికల్ సైన్స్ రిటైర్డ్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకుడు కూరపాటి వెంకటనారాయణ తెలిపారు. ‘‘పార్లమెంటు సీట్లలో ఉత్తరాధి రాష్ట్రాల డామినేషన్ వాటా అన్నది మొదటినుండి ఎక్కువగానే ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే’’ అని గుర్తుచేశారు. ‘‘19శాతం ఎంపీల వాటాతో పోల్చుకుంటే కేంద్రమంత్రివర్గంలో దక్షిణాది రాష్ట్రాల వాట 8శాతం మాత్రమే’’ అని తెలిపారు. ‘‘ఎంపీల సంఖ్యతో పాటు కేంద్రమంత్రివర్గంలో మంత్రుల సంఖ్య కూడా తక్కువ కాబట్టే నరేంద్రమోదీ ధక్షిణాది రాష్ట్రాలను పట్టించుకోవటంలేదు’’ అని ఆరోపించారు. ఇదే సమయంలో ‘‘ఆర్ధికఅంశాల ఆధారంగా సీట్లపెంపుపై రేవంత్ చెప్పిన ఫార్ములాకు రీజనింగ్ లేదు’’ అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ‘‘పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల వాటాను 19నుండి 25శాతంకు పెంచే విషయాన్ని కేంద్రప్రభుత్వం ఆలోచించాలి’’ అని సూచించారు.
ఎంపీల వాట 19శాతం నుండి 25శాతానికి పెంచాల్సిన అవసరాన్ని కూడా ప్రొఫెసర్ వివరించారు. ప్రొఫెసర్ ఏమంటారంటే జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని ఉత్తరాధిరాష్ట్రాలతో పోల్చితే ధక్షిణాది రాష్ట్రాలే సమర్ధవంతంగా అమలుచేసిన విషయాన్ని గుర్తుచేశారు. ‘‘జనాభా నియంత్రణను అప్పట్లో స్ట్రిక్ట్ గా అమలుచేసిన కారణంగానే కదా ఇపుడు ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చినపుడు దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోయింది’’ అని చెప్పారు. ‘‘కుటుంబనియంత్రణ కార్యక్రమాన్ని స్ట్రిక్ట్ గా అమలుచేసినందుకు ఇపుడు ‘ఇన్సెంటివ్’ రూపంలో పార్లమెంటులో దక్షిణాధిరాష్ట్రాల ఎంపీలను కేంద్రప్రభుత్వం 19 నుండి 25 శాతానికి పెంచాలి’’ అని డిమాండ్ చేశారు.
రేవంత్ సూచన బాగానే ఉంది : మోహన్ రావు
‘‘పార్లమెంటు సీట్ల పెంపు విషయంలో రేవంత్ రెడ్డి చేసిన సూచన బాగానే ఉంది’’ అని ఆంధ్రా యూనివర్సిటి పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ దొంగజనక మోహన్ రావు చెప్పారు. ‘‘సీట్ల పెంపు విషయంలో రేవంత్ చెప్పిన పరిష్కారం సబబుగానే ఉందని తనకు అనిపిస్తోంది’’ అని చెప్పారు. ‘‘ఉత్తరాధి రాష్ట్రాల్లో సీట్ల పెంపుతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల వాటా ఆధారంగా సీట్లు పెంచటం బాగానే ఉంటుంది’’ అని అన్నారు. దేశఆర్ధిక ప్రగతిలో ధక్షిణాది రాష్ట్రాల వాటా దామాషాలో సీట్ల పెంపుకు రేవంత్ చేసిన సూచనను తాను సమర్ధిస్తున్నట్లు ప్రొఫెసర్ మోహన్ రావు చెప్పారు.
ప్రత్యేక సమావేశాల్లో ఏమి తేలుతుందో ?
మహిళలకు 33శాతం రిజర్వేషన్లు, డీలిమిటేషన్ కోసం ఈనెల 16,17,18 తేదీల్లో కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మహిళా రిజర్వేషన్ బిల్లును ఓకేచేసిన కాంగ్రెస్ పార్టీ డీలిమిటేషన్ బిల్లుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు, పార్టీలు డీలిమిటేషన్ అంశంపై ఏకతాటిపైకి ఇప్పటివరకు రాలేదు. అందుకనే ఈనెల 15వ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ఇండియా కూటమితో పాటు నాన్ బీజేపీ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఆ సమావేశానికి ఎన్నిపార్టీలు హజరవుతాయి, ఎలాంటి సూచనలు, సలహాలు ఇస్తాయో చూడాల్సిందే.

