
రేవంత్ ‘కెనడీ స్కూలు’ పాఠాలు తెలంగాణలో పనికొస్తాయా ?
ఐదురోజుల కోర్సుకు హాజరైన తర్వాత డిపార్ట్ మెంట్ నిర్వహించిన పరీక్షలో పాసవ్వటంతో రేవంత్ కు యూనివర్సిటీ సర్టిఫికేట్ ప్రధానం చేసింది
అమెరికాలోని కెనడీ స్కూల్ ఆప్ గవర్నమెంట్ లో నాయకత్వ లక్షణాలపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సర్టిఫికేట్ కోర్స్ పూర్తిచేశారు. భారత కాలమానం ప్రకారం రేవంత్(Revanth)శుక్రవారం ఉదయం అమెరికాలో సర్టిఫికేట్ అందుకున్నాడు. అమెరికాలోని ప్రఖ్యాత(Harvard University) హార్వర్డ్ యూనివర్సిటిలోని కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్(Kennedy School) లో ‘లీడర్ షిప్ ఫర్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ’ అనే కోర్సుకు రేవంత్ హాజరయ్యాడు. ఐదురోజుల కోర్సుకు హాజరైన తర్వాత డిపార్ట్ మెంట్ నిర్వహించిన పరీక్షలో పాసవ్వటంతో రేవంత్ కు యూనివర్సిటీ సర్టిఫికేట్ ప్రధానం చేసింది. ఐదురోజుల తరగతుల్లో ఏరోజు క్లాసుకు సంబంధించిన అసైన్ మెంట్లను ఆరోజే పూర్తిచేసి మరుసటిరోజు ప్రొఫెసర్లకు చూపించాలి.
అలాంటి అసైన్మెంట్లను కూడా రేవంత్ పూర్తిచేసి ఫైనల్ పరీక్ష రాసి పాసయ్యాడు. అందుకనే సర్టిఫికేట్ ప్రధానం జరిగింది. ఈ సర్టిఫికేట్ ను అందుకోవటం ద్వారా రేవంత్ దేశంలో చరిత్ర సృష్టించాడు. ఎలాగంటే దేశం మొత్తంమీద ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో మరో నేత ఎవరూ హార్వర్డ్ యూనివర్సిటీలో ఇలాంటి సర్టిఫికేట్ కోర్స్ చేయలేదు. తాను సర్టిఫికేట్ అందుకున్న విషయాన్ని స్వయంగా రేవంత్ తనే ట్విట్టర్ ఖాతాలో పోస్టుచేశాడు. 20 దేశాల నుండి వచ్చిన 60 మంది విద్యార్దులతో కలిసి తరగతులకు హాజరై, అసైన్మెంట్లు పూర్తిచేసి, పరీక్ష రాసి సర్టిఫికేట్ అందుకోవటం ఎంతో సంతోషంగా ఉందని రేవంత్ ఆనందం వ్యక్తంచేశారు.
టీచర్లు, సహచర విద్యార్ధుల ద్వారా ఐదురోజుల్లో నాయకత్వ లక్షణాలపై చాలా విషయాలు నేర్చుకున్నట్లు రేవంత్ చెప్పాడు. ఐదు రోజుల తరగతులు ప్రధానంగా ‘21వ శతాబ్దపు నాయకత్వం-అస్తవ్యస్తత-సంఘర్షణ-ధైర్యం’ అనే అంశాలే కీలకంగా ప్రొఫెసర్లు క్లాసులు చెప్పారు. హార్వర్డ్ లో ప్రొఫెసర్లు చెప్పిన చదువు అచ్చంగా ఇపుడు తెలంగాణలో ప్రతిరోజు రేవంత్ అన్వయించుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతిపక్షాల నుండి ప్రతిరోజు రేవంత్ కు నాయకత్వానికి పరీక్షలు ఎదురవుతునే ఉన్నాయి. ప్రతిపక్షాలు సృష్టిస్తున్న గందరగోళం నుండి రేవంత్ ధైర్యంగా ఎలాగ బయటపడతాడు, ప్రతికూల పరిస్ధితులను ఎలా మ్యానేజ్ చేస్తాడు ?
ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే విదేశాల్లో లేదా బాగా అభివృద్ధిచెందిన దేశాల్లో రాజకీయాల్లాగ ఉండదు ఇండియన్ పాలిటిక్స్. చాలాదేశాల్లో రాజకీయాలు, చర్చలు అధికార, ప్రతిపక్షాల మధ్య విధానపరమైన అంశాల వారీగా జరుగుతాయి. కాని మనదేశంలో అందుకు పూర్తిగా రివర్సుగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతిచిన్న విషయానికి పెద్దగా రాద్దాంతం చేయటం, ఆరోపణలు, ప్రత్యారోపణలతో రెచ్చిపోతుంటాయి. టెలిఫోన్ ట్యాపింగులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారులు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు నోటీసిలిచ్చిన అంశంపై బీఆర్ఎస్ నేతలు ఎంతగా రాద్దాంతం చేస్తున్నారో చూస్తున్నదే. కాబట్టి అస్తవ్యస్తంగా ఉన్న రాజకీయ వ్యవస్తతో ఘర్షణాత్మక వైఖరితో కాకుండా చాకచక్యంగా ధైర్యంతో హార్వర్డ్ లో నేర్చుకున్న పాఠాలతో ఎలా గాడినపెడతాడో చూడాలి.

