రేవంత్ ప్రోగ్రెస్ రిపోర్టును ఏఐసీసీ సమీక్షిస్తుందా ?
x
Revanth reddy

రేవంత్ ప్రోగ్రెస్ రిపోర్టును ఏఐసీసీ సమీక్షిస్తుందా ?

మంత్రుల పనితీరును ఏఐసీసీ సమీక్షించటం ఏమిటో అర్ధంకావటంలేదు.


వినటానికే ఈవిషయం ఇబ్బందిగా ఉంది. తెలంగాణ ప్రభుత్వ పనితీరును డైరెక్టుగా చెప్పుకోవాలంటే మంత్రుల పనితీరును సమీక్షించాల్సింది ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాత్రమే. ఇంకెవరికీ అధికారాలు ఉండవు. అలాంటిది ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలు తెలంగాణ ప్రభుత్వ పనితీరును సమీక్షిస్తారని మీడియాలో వార్తలు హోరెత్తిపోతున్నది. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి, మంత్రులే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంత్రుల పనితీరును ఏఐసీసీ సమీక్షించటం ఏమిటో అర్ధంకావటంలేదు. ఇప్పటివరకు ఇలాంటి ఘటన జరిగినట్లు వినలేదు. అవసరమైనపుడు ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలిపించుకుని ఏఐసీసీ పెద్దలు మాట్లాడటం, రిపోర్టులు తెప్పించుకోవటం చాలాకాలంగా ఉన్నదే.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో గురువారం జరగబోయే సమావేశానికి రేవంత్ తో పాటు పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రులు బుధవారం రాత్రికే ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం రాత్రే సంక్షేమశాఖ మంత్రి వాకిటి శ్రీహరి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అంట ఈరోజు పూర్తిస్ధాయిలో మళ్ళీ కలవబోతున్నారు.

ప్రభుత్వ పనితీరును హైదరాబాద్ లో సమీక్షించే అధికారం రేవంత్ కు మాత్రమే ఉంది. రెగ్యులర్ గా క్యాబినెట్ సమావేశాలు పెట్టుకుని రేవంత్ మంత్రుల పనితీరును సమీక్షిస్తునే ఉన్నారు. ఇదికాకుండా ప్రతిరోజు శాఖల వారీగా సమీక్షలు జరిగినపుడు ఎలాగూ మంత్రులు పాల్గొంటున్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఏఐసీసీ మంత్రుల పనితీరును సమీక్షించాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్ధంకావటంలేదు. ఏ హోదాలో మంత్రుల పనితీరును ఏఐసీసీ సమీక్షిస్తున్నదో ఎవరికీ అర్ధంకావటంలేదు. తమకు ఏఐసీసీనే బాస్ కాబట్టి తన పనితీరుతో పాటు మంత్రుల పనితీరును కూడా పార్టీ బాసులు సమీక్షించవచ్చు అని రేవంత్ సర్దిచెప్పుకుంటున్నారేమో తెలీదు.

కాని ప్రజల్లోకి ఎలాంటి రాంగ్ మెసేజ్ వెళుతున్నదో రేవంత్ అండ్ కో ఆలోచించినట్లులేదు. హైదరాబాదులోని సచివాలయంలో మంత్రుల సమీక్షల్లో మీనాక్షి కూర్చోవటంపైనే అప్పట్లో బాగా విమర్శలొచ్చాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటిలో 400 ఎకరాల వివాదం నేపధ్యంలో మంత్రులతో యూనివర్సిటి అధ్యాపకులు, విద్యార్ధి సంఘాలు, ప్రజాసంఘాల నేతలతో మంత్రులు సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో మంత్రులతో పాటు మీనాక్షి నటరాజన్ కూడా కూర్చోవటాన్ని చాలామంది అప్పట్లోనే అభ్యంతరాలు వ్యక్తంచేశారు.

ఎందుకంటే యూనివర్సిటి వివాదం ప్రభుత్వానికి సంబంధించింది. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల్లో ప్రత్యక్షంగా పార్టీనేత మీనాక్షి ఎలాగ జోక్యం చేసుకుంటారు ? అవసరం అనుకుంటే మంత్రులను మీనాక్షి పార్టీ ఆఫీసు గాంధీభవన్ కు పిలిపించుకుని మాట్లాడుకోవచ్చు. రేవంత్, మంత్రులు గాంధీభవన్ కు వెళ్ళటంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలుండవు. అలాగే పార్టీ నేతలు కూడా సచివాలయంలో రేవంత్, మంత్రులను కలవటంలో కూడా ఎవరికీ అభ్యంతరాలు ఉండాల్సిన అవసరంలేదు. అలాగని మంత్రుల అధికారిక సమీక్షల్లో ప్రభుత్వంలో ఏవిధంగానూ భాగస్వామ్యంలేని మీనాక్షి లేదా ఇతర నేతలు కూర్చుంటేనే అభ్యంతరాలొస్తాయి.

ఈ విషయం రేవంత్, మంత్రులు, ఏఐసీసీ పెద్దలకు తెలీకుండా ఉండదు. అయినా ప్రభుత్వ పనితీరుపై ఏఐసీసీ సమావేశంలో సమీక్ష చేయటమే ఆశ్చర్యంగా ఉంది. రెండేళ్ళ ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్టుపై పార్టీపెద్దలు సమీక్షించటంపై తెలంగాణలో అభ్యంతరాలు మొదలయ్యాయి.

తెలంగాణకు అవమానం : హరీష్

తెలంగాణ క్యాబినెట్ ను ఢిల్లీకి ఏఐసీసీ అధిష్ఠానం పిలిపించుకోవటం సిగ్గుచేటని బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్ధిపేట ఎంఎల్ఏ తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. మంత్రివర్గాన్ని ఢిల్లీకి పిలిపించుకోవటం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టినట్లే అని మండిపోయారు. మంత్రివర్గం పనితీరును ఏఐసీసీ పెద్దలు సమీక్షించటం అంటే ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకోవటమే అని హరీష్ ధ్వజమెత్తారు. హరీష్ రావు ఆరోపణలతో సరిపెట్టకుండా ఏకంగా ఢిల్లీలోని పార్టీ పెద్దలందరికీ ఈ మేరకు లేఖలు రాసి తన నిరసనను వ్యక్తంచేశారు.

Read More
Next Story