బీజేపీని ‘కోవర్టులు’ వివాదమే  ముంచేస్తుందా ?
x
Nizamabad BJP MP Dharmapuri Arvind

బీజేపీని ‘కోవర్టులు’ వివాదమే ముంచేస్తుందా ?

ఎంపీ చేసిన ఆరోపణల కారణంగా సీనియర్లు కూడా పార్టీకి సహాయ నిరాకరణ చేస్తే అప్పుడు రాబోయే ఎన్నికల్లో ఫలితాలు ఎలాగుంటాయో ఊహించుకోవచ్చు


మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీలో కోవర్టుల వివాదం సంచలనంగా మారింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మీడియాతో మాట్లాడుతు పార్టీలో చాలామంది కోవర్టులున్నట్లు చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. నాలుగు దశాబ్దాలుగా ఉంటూ సీనియర్లమన్న ముసుగులో మెట్ పల్లి, రాయికల్, జగిత్యాల్, కోరుట్ల తదితర ప్రాంతాల్లో కోవర్టులున్నారని ఎంపి అన్నారు. దాంతో పై ప్రాంతాల్లోని బీజేపీ నేతలను మిగిలిన వాళ్ళు అనుమానంగా చూస్తున్నారు. సీనియర్లనే ఎంపీ కోవర్టులు అంటే మరి కొత్తగా చేరిన వాళ్ళ పరిస్ధితి ఏమిటనే చర్చ కూడా మొదలైంది.

2023 ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నుండి బీజేపీలోకి వచ్చిన మల్కింజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, మెదక్ ఎంపీ ఎన్ రఘునందనరావు, నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వరరెడ్డి లాంటి వాళ్ళపైన పార్టీలోని సీనియర్లలో కొందరు ఇప్పటికే మండుతున్నారు. ఎందుకంటే వీరు పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. పాతనేతలు-కొత్తనేతల మధ్య సమన్వయం లేదన్న వివాదానానికి కోవర్టులన్న అర్వింద్ వివాదం జతకలసింది. మొత్తంమీద ఇలాంటి ఆరోపణలే పార్టీని నిలువునా ముంచేస్తాయా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

నిజానికి ఇలాంటి వివాదాస్పద ఆరోపణలు, వ్యాఖ్యలను ఏపార్టీ నేతకూడా బహిరంగంగా చేయరు. కాని ఇపుడు కోవర్టుల ఆరోపణలను ఉదాహరణలతో సహా ఎంపీ ఎందుకు చేశారు ? అన్నదే అర్ధంకావటంలేదు. ఎంపీ చెప్పిన ప్రకారం మెట్ పల్లి, రాయికల్, జగిత్యాల్, కోరుట్లలో తదితర ప్రాంతాల్లో బీజేపీకి కోవర్టులున్నారని చేసిన ఆరోపణ సంచలనంగా మారింది. ఉదాహరణగా మెట్ పల్లి మున్సిపాలిటీలో సుఖేందర్ గౌడ్ అనే వ్యక్తిని చెప్పారు. మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీచేసేందుకు తన భార్యకు టికెట్ ఇవ్వాలని కోరాడు. అయితే భార్యకు, అతనికి కూడా టికెట్ ఇవ్వద్దని కొందరు పార్టీకి చెప్పారట. అయినా సరే 40 ఏళ్ళుగా పార్టీ జెండా మోస్తున్నారన్న కారణంతో అతనికి పార్టీ టికెట్ ఇచ్చినట్లు వివరించారు.

మెట్ పల్లిలో ఏం జరిగింది ?

సుఖేందర్ గెలుపుకోసం ప్రత్యర్ధులు బలహీనమైన అభ్యర్ధిని పోటీచేయిస్తున్నట్లు తనకు ఫోన్ వచ్చిందన్నారు. నిజమేనేమో అనుకుంటే అలా జరగకుండా బలమైన అభ్యర్ధినే పోటీచేయించి దమ్ముంటే తమ అభ్యర్ధిని ఓడించాలని బీజేపీకి ఇతరపార్టీలు సవాలు చేసినట్లు చెప్పారు. చివరకు ఎన్నికలో సుఖేందరే గెలిచినా పార్టీని వదిలేసి కాంగ్రెస్ లో చేరిపోయినట్లు ఎంపీ మండిపడ్డారు. మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులుండగా బీజేపీకి 10, కాంగ్రెస్ కు 10, బీఆర్ఎస్ కు 6 వార్డులొచ్చినట్లు వివరించారు. ఛైర్మన్ పదవికోసం ముందు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మకైనట్లు ఎంపీ ఆరోపించారు. అయితే ఏమైందో ఏమో చివరకు ఓటింగ్ నుండి కారుపార్టీ గైర్హాజరైనట్లు తెలిపారు. అదేసమయంలో బీజేపీ తరపున గెలిచిన సుఖేందర్ కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లు ఎంపీ చెప్పారు.

ఇలాంటి కోవర్టులు జగిత్యాల్, రాయికల్, కోరుట్లలో కూడా ఉన్నట్లు ఎంపీ ఆరోపించారు. రాయికల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఛైర్మన్ అభ్యర్ధి గెలిచిన తర్వాత కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లు తెలిపారు. ఇలాంటి ఉదాహరణలను చెప్పిన ఎంపీ బీజేపీని కోవర్టులు లేకుండా ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఇప్పటికే జగిత్యాల్ జిల్లాలో కోవర్టులు లేకుండా ప్రక్షాళన చేసినట్లు కూడా వివరించారు. ఎంపీ కోవర్టుల ఆరోపణలపై ఇపుడు పార్టీలో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. 30, 40 ఏళ్ళనుండి ఉన్ననేతల్లో కోవర్టులు ఉన్నారు అని అనటంతోనే పార్టీలోని సీనియర్లపైన చాలామందిలో అనుమానాలు పెరిగిపోతున్నాయి. సీనియర్లలో కోవర్టులు ఉన్నారో లేదో తెలీదు కాని ఎంపీ ఆరోపణలతో సీనియర్లు శీలపరీక్షకు నిలవాల్సిన అవసరం ఎదురైంది.

కోవర్టుల ఆరోపణలు ఎందుకు చేశారు ?

మున్సిపల్ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి కోవర్టులపేరుతో ఆరోపణలను బహిరంగంగా చేసినా పార్టీకి వచ్చే నష్టంలేదన్న ఆలోచనతోనే ఎంపీ ఆరోపణలు చేసుండచ్చు. కాని తొందరలోనే పరిషత్ ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇప్పటికే ప్రజా ప్రతినిధులతో పాటు నేతల మధ్య సమన్వయంలేదన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది ఇపుడు ఎంపీ చేసిన ఆరోపణల కారణంగా సీనియర్లు కూడా పార్టీకి సహాయ నిరాకరణ చేస్తే అప్పుడు రాబోయే ఎన్నికల్లో ఫలితాలు ఎలాగుంటాయో ఊహించుకోవచ్చు.

తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆమధ్య ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమైన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ సమావేశంలోనే ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం లేదని, కష్టపడిపనిచేయటంలేదని మోదీ తీవ్రఅసంతృప్తిని వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా నిలవాల్సిన అవసరాన్ని మోదీ నొక్కిచెప్పారు. మోదీ వ్యాఖ్యలతోనే పార్టీలోని ప్రజాప్రతినిధుల మద్య సమన్వయం లేదన్న విషయంపై క్లారిటి వచ్చేసింది. తర్వాత జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అందరు కష్టపడి పనిచేశారు అని అధ్యక్షుడు రామచంద్రరావు కితాబిచ్చిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనే ఘోర పరాజయం తప్పలేదు. అలాంటిది ఎంపీ మీద నిరసనతో సీనియర్లు కాడి కిందపడేస్తే అప్పుడు పరిస్ధితి ఏమిటి ?

ధర్మపురి ఎక్కడనుండి వచ్చారు ?

నిజానికి ఎంపీ ధర్మపురి కూడా మొదటినుండి బీజేపీలో పుట్టి ఎదిగిన నేతేమీ కాదు. చాలా ఏళ్ళు కాంగ్రెస్ లోనే ఉండి బీజేపీలో చేరిన వ్యక్తి. అదృష్టం కలిసొచ్చి వరుసగా రెండుసార్లు 2019, 2024 ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. అలాంటి ఎంపీ పార్టీలోని సీనియర్లపైన కోవర్టులు అనే ముద్ర వేయటం చాలామంది సీనియర్లకు ఇబ్బందిగా మారింది. బీఆర్ఎస్ లో నుండి బీజేపీలో చేరి ఎంపీ అయిన ఈటల రాజేందర్, బీఆర్ఎస్ లో నుండి బయటకు వచ్చి బీజేపీలో చేరి ఎంపీ అయిన మాధవనేని రఘునందన్ రావుకు కూడా పార్టీతో అంటీముట్టనట్లుగానే ఉంటారనే ప్రచారం అందరికీ తెలిసిందే. రఘునందన్ ఇస్నాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్ధి గెలుపుకు ఓటేశారు.ఈ విషయాన్ని తానే స్వయంగా ప్రకటించారు. ఎంపీ ధర్మపురి లెక్కలో మెదక్ ఎంపీ రఘునందన్ కూడా కోవర్టు కిందే లెక్క.

కరీంనగర్ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ పరిధిలోని కరీంనగర్ కార్పొరేషన్లో తప్ప మిగిలిన 7మంది ఎంపీల పరిధిలోని ఏ మున్సిపాలిటీని కూడా బీజేపీ గెలుచుకోలేదు. పార్టీ గెలిచిన వార్డులు కూడా పెద్దగా లేవు. అప్పుడు ధర్మపురి లెక్కలో 7 మంది ఎంపీలు కూడా తమ నిజాయితీని నిరూపించుకోవాల్సిందేనా ? ఏదేమైనా ఎంపీ చేసిన కోవర్టుల ఆరోపణలు పెద్ద వివాదంగా తయారై రాబోయే ఎన్నికల్లో పార్టీని నిండా ముంచేసే ప్రమాదమే ఎక్కువగా కనబడుతోంది.

ఆరోపణలు చేయకూడదు : రామచంద్రరావు

పార్టీలో కోవర్టులు ఉన్నారన్న ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపణలు తన దృష్టికి రాలేదన్నారు. ‘‘ఎంపీ ఆరోపణలను పరిశీలించిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తాము’’ అని తెలంగాణ ఫెడరల్ తో రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు చెప్పారు. ‘‘ఏదేమైనా కోవర్టుల్లాంటి సున్నితమైన ఆరోపణలను ఎంపీ బహిరంగంగా చేయకూడదు’’ అని అధ్యక్షుడు స్పష్టంగా చెప్పారు. ‘‘ఢిల్లీ నుండి రాగానే కోవర్టుల ఆరోపణలపై దృష్టి పెడతాను’’ అని రామచంద్రరావు తెలిపారు.

Read More
Next Story