డాటర్ కవిత టార్గెట్ డాడీ కేసీఆర్‌యేనా ?
x
Kavitha and KCR

డాటర్ కవిత టార్గెట్ డాడీ కేసీఆర్‌యేనా ?

పార్టీని ప్రకటించే తేదీ దగ్గరకు వస్తున్న నేపధ్యంలో సడెన్ గా కవిత టార్గెట్ మారినట్లే అనుమానంగా ఉంది


తొందరలోనే కొత్త రాజకీయపార్టీని ప్రారంభించబోతున్న కల్వకుంట్ల కవిత పెద్ద టార్గెట్టే పెట్టుకున్నట్లున్నారు. కొడితే కుంభస్ధలాన్నే కొట్టాలన్న సామెతలాగ కవిత కూడా చాలా పెద్ద టార్గెట్టే పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే డాడీ, మోడీ, చిన్న మోడీయే తన టార్గెట్ అని కవిత పదేపదే చెబుతున్నారు. బీఆర్ఎస్ లోనుండి బయటకు కవితను గెంటిసిన తర్వాత కూడా కవిత ఇప్పటివరకు ఎక్కడా డాడి@ కేసీఆర్‌ గురించి మాట్లాడిందిలేదు. సోదరుడు కేటీఆర్ పైన ఆరోపణలు చేయటం కూడా తక్కువే. ఇంతకాలం కవిత టార్గెట్ అంతా హరీష్ రావు, సంతోష్ రావుగానే సాగింది. అలాంటిది పార్టీని ప్రకటించే తేదీ దగ్గరకు వస్తున్న నేపధ్యంలో సడెన్ గా కవిత టార్గెట్ మారినట్లే అనుమానంగా ఉంది.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే డైరెక్టుగా తన డాడీనే కవిత టార్గెట్ చేస్తున్నారు. రాజకీయంగా తన టార్గెట్ అంతా డాడీ, మోదీ, చిన్నమోదీనే అని పదేపదే చెబుతున్నారు. డాడీ తనను పార్టీలో నుండి గెంటివేయటానికి మూలకారకుడు అన్న మంట ఉండవచ్చు. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరికించి ఆరుమాసాలు జైలులో కూర్చునేట్లు చేశారని మోదీ అంటే కూడా కవితకు బాగా కోపం ఉండవచ్చు. ఇక సహజంగా అధికారపార్టీతో పాటు ప్రభుత్వ సారధిగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అంటే కూడా మండిపోతున్నారు. అందుకనే డాడీ, మోదీ, చిన్నమోదీ అని కవిత పదేపదే ఎద్దేవా చేస్తున్నది. కవిత ఉద్దేశ్యంలో చిన్నమోదీ అంటే రేవంత్ అనే.

కవిత ఆగ్రహం బాగానే ఉంది కాని రాబోయే షెడ్యూల్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయిపోతారా ? తెలంగాణ ప్రజా జాగృతి అనే కొత్తపార్టీని కవిత ప్రారంభించబోతున్నారు. రాబోయే శ్రీరామనవమి తర్వాత పార్టీ పేరుతో పాటు విధానాలు, లక్ష్యాలను ప్రకటించబోతున్నట్లు ఆమె స్వయంగా చెప్పారు. కాకపోతే ఆమె చెప్పకముందే పార్టీ పేరు బయటకు లీకైపోయింది. సరే, ఇపుడు అసలు విషయానికి వస్తే కవిత ఏకకాలంలో పెట్టుకున్న మూడు టార్గెట్లను రీచవుతారా ? ఎందుకంటే మూడింటిలో ఏ ఒక్కదాన్ని కూడా కవిత చేరుకుంటారనే ఆశలు లేవు.

పార్టీ నడపటం చాలా కష్టం

కారణం ఏమిటంటే రాజకీయపార్టీ పెట్టి నడపటం అంత తేలికకాదు. పార్టీని నడపాలంటే వందల కోట్ల రూపాయలు ఖర్చుచేయాల్సుంటుంది. మరంత డబ్బు కవిత దగ్గర ఉందా ? పార్టీ ఏర్పాటుకు, నిర్వహణకు డబ్బుతో పనేముంది జనాల ఆధరణే చాలు అనే సినిమా డైలాగులు చాలామంది చెబుతారు. అయితే ఆచరణలో సినిమా డైలాగులు ఎందుకూ పనికిరావు అల్టిమేట్ గా చేతిలో డబ్బుంటేనే ఏ పనయినా జరుగుతుందంతే.

సరే, మూడు టార్గెట్ల గురించి ఆలోచిస్తే కవిత వల్ల ఏదైనా డ్యామేజి జరిగితే అది బీఆర్ఎస్‌కే కాని మిగిలిన బీజేపీ, కాంగ్రెస్‌కు కాదన్న విషయం అర్ధమవుతుంది. ఎలాగంటే కవిత పార్టీకి పడే ప్రతి ఓటూ బీఆర్ఎస్ కు పడాల్సినవే అయ్యుంటాయనటంలో సందేహంలేదు. కొత్తగా బీజేపీ నుండో లేకపోతే కాంగ్రెస్ నుండో ఓట్లు చీలి కవిత పార్టీకి పడే అవకాశాలు దాదాపు లేవు. అలాగే తనపార్టీకి అంటు కొత్త ఓటర్లను కవిత సృష్టించుకునే అవకాశాలు కూడా తక్కువే. ఇపుడున్న పది ఓట్లే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు పడుతున్నాయి. వీటిలో మూడుపార్టీలకు స్ధిరమైన ఓటుబ్యాంకు ఎలాగూ ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీ ఓటుబ్యాంకు చీలి కవితపార్టీకి వెళ్ళే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువ.

బీఆర్ఎస్ ఓట్లకే ఎసరు

ఇక మిగిలింది బీఆర్ఎస్ ఓటుబ్యాంకు మాత్రమే. ఇక్కడనుండే కవితపార్టీకి ఓట్లు చీలే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎలాగంటే మొన్నటివరకు కవిత ఉన్నది బీఆర్ఎస్ లోనే కాబట్టి. కవితకు ఇప్పటికీ బీఆర్ఎస్ నేతగానే పేరుంది. పార్టీ నాయకత్వంతో గట్టుతగాదాల కారణంగా పడకపోవటం వల్లే పార్టీని వీడాల్సొచ్చింది. పార్టీని వీడిన తర్వాత ఇపుడు కవిత చుట్టూ ఉన్న వాళ్ళంతా ఒకపుడు బీఆర్ఎస్ లో ఉన్నవాళ్ళో లేకపోతే జాగృతి సంస్ధలో పనిచేస్తున్న వాళ్ళో. బీఆర్ఎస్ నుండి కవిత వేరుపడిన తర్వాత ఆమె మద్దతుదారుల్లో కొందరు పార్టీని వీడి బయటకు వచ్చి ఆమెతోనే నడుస్తున్నారు. అంటే కవితకు మద్దతిస్తున్న వారిలో కొత్తగా పుట్టుకొచ్చిన మద్దతుదారులు అంటు ఎవరూ లేరని అర్ధమవుతోంది. ఇపుడు కవితతో ఉన్న వారిలో అత్యధికులు ఒకపుడు బీఆర్ఎస్ లో ఉన్నవాళ్ళే.

కాబట్టి కవిత వల్ల ఏ పార్టీకి అయినా డ్యామేజి జరుగుతుంది అనుకుంటే అది బీఆర్ఎస్ కే ఎక్కువ అన్నది అర్ధమవుతోంది. ఈ విషయంలో కవితకు కూడా మంచి క్లారిటీనే ఉండుంటుంది. అందుకనే ఇపుడు పదేపదే డాడీని టార్గెట్ చేస్తానని చెబుతున్నారు. ఉత్త డాడీని మాత్రమే టార్గెట్ చేస్తే బావోదని మోదీ, చిన్నమోదీలను కూడా కవిత యాడ్ చేసినట్లున్నారు. ఏదేమైనా కవిత టార్గెట్ వల్ల నష్టపోయే పార్టీ ఏది అన్న విషయం తొందరలో జరగబోయే పరిషత్ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొంత క్లారిటి వచ్చే అవకాశముంది.

Read More
Next Story