
కాంగ్రెస్-ఫిరాయింపుల మధ్య రేవంత్ ఫార్ములా ?
మున్సిపాలిటీల్లో పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధులు, రెబల్స్ మధ్య పెద్ద గొడవే జరుగుతోంది
ఈనెల 11వ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్నీ మున్సిపాలిటీలను స్వీప్ చేయాలన్నది రేవంత్ టార్గెట్. అయితే క్షేత్రస్ధాయిలో ఆ పరిస్ధితి కనబడటంలేదు. ఎందుకంటే పదిమంది (BRS defection MLAs)బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏలున్న నియోజకవర్గాల్లో విభేదాలు ముదిరిపోతున్నాయి. జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత టీ జీవన్ రెడ్డికి ఫిరాయింపు ఎంఎల్ఏ డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య గొడవలుజరుగుతున్నాయి. జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల్లో పోటీచేయాల్సిన అభ్యర్ధులు, బీఫారాల పంపిణీలో రెండువర్గాల మధ్య పెద్ద గొడవే జరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడు(PCC President Bomma Mahesh Kumar Goud) బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఇరిగేషన్ శాఖ మంత్రి, జగిత్యాల జిల్లా ఇంచార్జి మంత్రి (Uttam kumar Reddy)నల్లమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్దుబాటుకు ప్రయత్నించినా సాధ్యం కావటంలేదు.
సంజయ్ వర్గానికి ఎక్కువ టికెట్లు దక్కటమే గొడవకు అసలు కారణం. తనను నమ్మి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎంఎల్ఏలను వదులుకోవటం రేవంత్ కు ఇష్టంలేదు. అలాగని దశాబ్దాలుగా ఉన్న కాంగ్రెస్ నేతలకు సర్దిచెప్పలేకపోతున్నారు. ఇపుడు జిగిత్యాల్ లో రోడ్డున పడిన గొడవలు మిగిలిన తొమ్మిది నియోజకవర్గాలు బాన్సువాడ, చేవెళ్ళ, శేరిలింగంపల్లి, భద్రాచలం, గద్వాల, స్టేషన్ ఘన్ పూర్, ఖైరతాబాద్, పటాన్ చెరు, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో ఎక్కువగా గొడవలవుతున్నాయి. అందుకనే పై నియోజకవర్గాల్లో ఫలితాలపై రేవంత్ లో టెన్షన్ పెరిగిపోతోంది.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలపై పూర్తిస్ధాయిలో పైచేయి సాధించాలన్నది రేవంత్ టార్గెట్. టార్గెట్ రీచవ్వాలంటే అనుసరించాల్సిన రెండుమార్గాలున్నాయి. అవేమిటంటే పార్టీ నేతలు, క్యాడర్ మొత్తం పార్టీ అభ్యర్ధుల గెలుపుకు కోసం కష్టపడి పనిచేయటం. రెండోమార్గం ఏమిటంటే రెబల్స్ ను పోటీలో నుండి తప్పించటం. నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిపోవటంతో కొన్ని మున్సిపాలిటీల్లో రెబల్స్ పోటీలో ఉండిపోయారు. వీరందరితో మాట్లాడి పార్టీ అభ్యర్ధికి మద్దతుగా ప్రచారంచేయించి, గెలిపించే బాధ్యతను రేవంత్ జిల్లాలోని మంత్రులు, ఇంచార్జి మంత్రులు ఆయా మున్సిపాలిటీల్లోని సీనియర్ నేతలకు అప్పగించారు. బుజ్జగింపులు ఎంతవరకు వర్కవుటవుతున్నాయో తెలీటంలేదు.
పైన చెప్పినట్లుగా ఫిరాయింపు ఎంఎల్ఏల నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల్లో ఎక్కువ సమస్యలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫిరాయింపు ఎంఎల్ఏలకు, సీనియర్ నేతలకు మధ్య సయోధ్య కుదిర్చేట్లుగా రేవంత్ ఒక ఫార్ములాను అమలుచేస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం. అదేమిటంటే మున్సిపాలిటీల్లోని వార్డులు, కార్పొరేషన్లలోని డివిజిన్ల సంఖ్యలో ఫిరాయింపు ఎంఎల్ఏలకు 50 శాతం, పార్టీలోని సీనియర్ నేతల కోటాలో మిగిలిన 50శాతం టికెట్లు పంపిణీ చేయాలని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇంచార్జి మంత్రులను ఆదేశించినట్లు పార్టీవర్గాల సమాచారం. జగిత్యాల నియోజకవర్గంలోని జగిత్యాల్, రాయికల్ మున్సిపాలిటీల్లో ఈ ఫార్ములా వర్కవుట్ కాలేదు. ఎలాగంటే జగిత్యాల్ మున్సిపాలిటీల్లో పిరాయింపు ఎంఎల్ఏ సంజయ్ మద్దతుదారులకు ఎక్కువ టికెట్లు ఇచ్చిన పార్టీ మాజీమంత్రి జీవన్ రెడ్డి వర్గానికి తక్కువ టికెట్లిచ్చింది.
ఇక రాయికల్ లో సంజయ్-జీవన్ వర్గాలకు దాదాపు సమానంగానే టికెట్ల పంపిణీ జరిగింది. ఈ విషయంలోనే జీవన్ పార్టీమీద మండిపోతున్నారు. బాన్సువాడ, శేరిలింగంపల్లి, గద్వాల, భద్రాచలం, పటాన్ చెరు, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల్లో ఫిరాయింపు ఎంఎల్ఏ వర్గానికి, కాంగ్రెస్ సీనియర్ నేతల వర్గాల మధ్య పెద్ద గొడవలే అవుతున్నాయి.
పోలింగ్ 11వతేదీ దగ్గరపడుతున్నా ఫిరాయింపు నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల్లో గొడవలు సద్దుమణగకపోవటం, కాంగ్రెస్ తరపున ప్రచారంలో రెండువైపుల అభ్యర్ధులు పాల్గొంటుండటంతో జనాల్లో కూడా ఒకవిధమైన అయోమయం పెరిగిపోతోంది. ముఖ్యంగా రెబల్స్ ఎక్కువున్న వార్డులు, డివిజన్లలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వార్డులు, డివిజన్లలో కలుపుకుని అన్నీపార్టీలు, స్వతంత్రులు కలుపుకుని 12,958 మంది పోటీలో ఉన్నారు. వీరిలో కాంగ్రెస్ నుండి 2,948, బీఆర్ఎస్ నుండి 2878, బీజేపీ తరపున 2634 పోటీచేస్తున్నారు.ఇప్పటికి 14 వార్డుల్లో ఏకగ్రీవమయ్యారు. ఏకగ్రీవాల్లో 12 మంది కాంగ్రెస్, 2 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులున్నారు. చాలాచోట్ల టైట్ ఫైట్ నడుస్తోందని సమాచారం అందుతోంది. అందుకనే రెబల్స్ ను పోటీలోనుండి త్పపుకుని పార్టీ అభ్యర్ధుల గెలుపుకు సహకరించాలని రేవంత్ పదేపదే కోరుతున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి.

