మహిళా రిజర్వేషన్లను పెద్టింటి మహిళలే తన్నుకు పోతారా?
x

మహిళా రిజర్వేషన్లను పెద్టింటి మహిళలే తన్నుకు పోతారా?

ప్రతి నాయకుడి కుటుంబంలో మహిళలు రెడీ అయిన కూర్చున్నారు. 33 శాతం మహిళలకు కోటావస్తే, పేదంటి మహిళలకు చోటిస్తారా?


చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు దాదాపు ఖరారైపోయింది. బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకునేందుకు ఈనెల 16,17,18 తేదీల్లో ఎన్డీయేప్రభుత్వం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తోంది. ఇపుడీ బిల్లును అడ్డుకునేపార్టీలు కూడా ఏవీలేవు కాబట్టి బిల్లు ఉభయసభల ఆమోదం పొందటం ఖాయం. రిజర్వేషన్ల ఆధారంగా నియోజకవర్గాల్లో పోటీచేయటానికి నేతల భార్యలు, కూతుర్లు, కోడళ్ళు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇలాంటి వారిలో అధికారపార్టీతో పాటు ప్రతిపక్షాల్లోని నేతల వారసులు చాలామంది పోటీకి రెడీ అయిపోతున్నారు. ఇలాంటి వారసుల్లో కొందరు ఇప్పటికే యాక్టివ్ రాజకీయాల్లో ఉంటే మరికొందరు రిజర్వేషన్ల కారణంగా ఇపుడిపుడే యాక్టివ్ అవుతున్నారు.

ఇపుడున్న 119 సీట్లలోనే 33శాతం రిజర్వేషన్ల ప్రకారం 40 సీట్లు మహిళలకు రిజర్వు అవుతాయి. ఒకవేళ నియోజకవర్గాల పునర్వవ్యవస్ధీకరణ జరిగి 119సీట్లు 179కి పెరిగితే అదనంగా మరో 20 సీట్లు అంటే 60 సీట్లు మహిళలకు రిజర్వు అవుతాయి. కాబట్టి ఇపుడున్న మగనేతలకు ధీటుగా వాళ్ళవారసులు కూడా రంగంలోకి దిగటానికి రెడీ అవుతున్నారు. మహిళా రిజర్వేషన్లవల్ల ఒక ప్లస్ ఎలాగ ఉంటుందో అలాగే మైనస్ కూడా ఉంటుందని తెలుసుకోవాలి. ప్లస్ ఏమిటంటే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం బాగా పెరుగుతుంది. ఇపుడు కూడా చట్టసభల్లో మహిళలున్నా అదివారి సొంతకెపాసిటీ మీదే వస్తున్నారు. మగనేతలకు ధీటుగా కొన్నినియోజకవర్గాల్లో రాజకీయాలు చేస్తు, టికెట్లను సాధించుకుని ఎన్నికల్లో పోటీచేసి గెలుస్తున్నారు. అయితే కచ్చితంగా పలానా నియోజకవర్గంలో మహిళ మాత్రమే పోటీచేయాలనే నిబంధన మహిళా రిజర్వేషన్ వల్ల అమలైతే సదరు నియోజకవర్గంలో పోటీచేసే వారంతా మహిళలే అయ్యుంటారు. కాబట్టి పార్టీల గెలుపోటములతో సంబంధంలేకుండా మహిళా ప్రతినిధే చట్టసభల్లోకి అడుగుపెడతారు.


ఎన్ని సీట్లు పెరుగుతాయి ?

ఇలాంటి నియోజకవర్గాలు మహిళలకు ఎన్ని రిజర్వ్ అవుతాయనే విషయంలో ఇప్పటికైతే క్లారిటిలేదు. ఇపుడున్న 119 నియోజకవర్గాల ప్రకారమైతే 40 సీట్లయితే రిజర్వ్ అవటం ఖాయం. ఒక్కసారిగా మహిళలకు 40 సీట్లు రిజర్వ్ కాబోతున్నాయన్న వార్తే మహిళా నేతలు, వారసురాళ్ళల్లో కొత్త ఉత్సహాన్ని రేకెత్తిస్తోంది. అదికూడా 2028/29 ఎన్నికల్లోనే అమలుకాబోతోందనే ప్రచారం మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది. అందుకనే కొందరి నేతల భార్యలు, కూతుర్లు, కోడళ్ళు వారసుల రూపంలో పోటీకి రెడీ అయిపోతున్నారు.

ఇపుడు ప్రచారంలో ఉన్న ప్రకారమైతే మంత్రుల్లో చాలామంది భార్యలు, కూతుర్లు, ఎంఎల్ఏల భార్యలు, కోడళ్ళు, కూతుర్లు, ఎంపీల కూతుర్లు, కోడళ్ళు పోటీకి రెడీ అంటున్నారు. రిజర్వు అవబోయే నియోజకవర్గాలు ఏవనే విషయంలో క్లారిటి లేకపోయినా మగనేతలు కూడా తమ ఆడవాళ్ళని పోటీకి సిద్ధం చేస్తున్నారు. ఇపుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు మహిళలకు రిజర్వయితే పట్టు జారిపోకుండా తమ ఇళ్ళల్లోని ఆడవాళ్ళకే టికెట్లు ఇప్పించుకుని గెలిపించుకోవాలనే ఆలోచనలో మగనేతలున్నట్లు అర్ధమవుతోంది. మహిళా రిజర్వేషన్లతో పాటు నియోజకవర్గాల పునర్విభజన కూడా జరుగుతుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. నియోజకవర్గాలు పెరిగితే వచ్చే ఎన్నికల్లో తాము పోటీచేయటంతో పాటు తమింట్లోని మహిళలకు టికెట్లు ఇప్పించుకోవాలని ఆలోచిస్తున్న పురుషనేతలు కూడా లేకపోలేదు.

ప్రచారం జరుగుతున్న వారిలో మచ్చుకి కొందరు వారసుల పేర్లను పరిశీలిద్దాము. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క భార్య నందిని పోటీకి రెడీ అవుతున్నారు. ఈమెపేరు 2024 పార్లమెంటు ఎన్నికల సమయంలోనే బాగా ప్రచారమైంది. ఖమ్మం ఎంపీగా పోటీకి గట్టి ప్రయత్నం చేసుకున్నారు. మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి భార్య లక్ష్మి, మంత్రులు కొండాసురేఖ కూతురు సుస్మిత పటేల్ పరకాలకు, దామోదర రాజనర్సింహ కూతురు త్రిష, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి, మాజీమంత్రి టీ జీవన్ రెడ్డి కోడలు చరిష్మారెడ్డి, విప్ బీర్ల ఐలయ్య భార్య అనిత, ఎంఎల్సీ అద్దంకి దయాకర్ భార్య నాగమణి, ఎంపీ ఈటల రాజేందర్ భార్య జమున, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి భార్య నిర్మల, కూతురు జయారెడ్డిని పోటీలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నారు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లోనే నిర్మల లేదా జయారెడ్డికి టికెట్ ఇప్పించుకునేందుకు జగ్గారెడ్డి గట్టి ప్రయత్నాలు చేసినా సాధ్యంకాలేదు.

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూతురు అనన్య, బీఆర్ఎస్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి తన భార్యను వెంటపెట్టుకుని రెగ్యులర్ గా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గం మహిళలకు రిజర్వయితే తన భార్యను పోటీచేయించాలనే ఆలోచనలో పాడి ఉన్నట్లు కారుపార్టీ నేతలు చెప్పారు. తన్నీరు హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డి నియోజకవర్గం మహిళలకు రిజర్వయితే ఆయన భార్య పోటీ చేస్తారనే ప్రచారం బాగా జరుగుతోంది. మేడ్చల్ బీఆర్ఎస్ ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డి తన కూతురు, కోడలిని కూడా పోటీచేయించే ఆలోచనలో ఉన్నట్లు బాగా ప్రచారం జరుగుతోంది. వారసులతో పోటీచేయించాలని అనుకుంటున్న నేతల జాబితా అన్నీపార్టీల్లో కలిపి చాంతాడంత పే...ద్దగా ఉంది.

ఇపుడు ఎంతమంది ఉన్నారు

తెలంగాణలోని 119 సీట్లలో అన్నీపార్టీల్లో కలిపి మహిళా ఎంఎల్ఏలు 9 మంది మాత్రమే ఉన్నారు. కాంగ్రెస్ నుండి 6, బీఆర్ఎస్ నుండి ముగ్గురు ఎంఎల్ఏలున్నారు. సీతక్క, కొండాసురేఖ, ఉత్తమ్ పద్మావతి, చిట్టెం పర్ణికారెడ్డి, మామిడాల యశస్వినీరెడ్డి, మట్టా రాగమయి కాంగ్రెస్ నుండి గెలవగా బీఆర్ఎస్ నుండి సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవాలక్ష్మి గెలిచారు.

వారసులకే ప్రయారిటి ఎందుకు ?

రాజకీయాల్లో మహిళలను ప్రోత్సహించాలంటే వారసులకు కాకుండా కొత్తవారికి టికెట్లు ఇవ్వాలని చెప్పటం, అడగటం, వినటం చాలా బాగుంటుంది. అయితే టికెట్ ఇవ్వటం సంగతి దేవుడెరుగు అసలు సమస్యంతా ఆ తర్వాతే మొదలవుతుంది. ఎలాగంటే ఓపెన్ కేటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేయాలంటే తక్కువలో తక్కువ రు. 50 కోట్లు అవసరం అవుతుంది. ఇన్ని కోట్లరూపాయలు కొత్త నేతలు ఎలా ఖర్చుచేయగలరు ? పోటీచేసే వారిలో ఒకరు వారుసురాలై మిగిలిన వాళ్ళు కొత్తవారైతే వారసురాలి రాజకీయాన్ని తట్టుకోవటం కష్టమే. కొత్తవారు పోటీచేసి గెలవటం అన్నది చాలా అరుదుగా జరుగుతుంది. ఏపార్టీ అయినా కొత్తవారికి, ధనబలం లేనివారికి టికెట్లు ఇవ్వటానికి ఇష్టపడవు. అందుకనే ఏ ఎన్నికలో అయినా పార్టీలు ఆర్ధికంగా పటిష్టంగా ఉన్న నేతలకు టికెట్లు ఇవ్వటానికే మొగ్గుచూపుతాయి. కాబట్టి మహిళా రిజర్వేషన్ అమల్లోకి వచ్చినా వారసులకు కాకుండా కొత్తవారికి లేదా పార్టీలో ఎప్పటినుండో పనిచేస్తున్నా ఆర్ధికదన్ను లేనివారికి టికెట్లు దక్కేది అనుమానమే.

ఆకుల లలిత : బీసీలకు ప్రయారిటి

బీసీలకు కూడా రిజర్వేషన్ ఇస్తే బాగుంటుంది అని ఉమ్మడి రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ కు అధ్యక్షురాలిగా పనిచేసిన ఆకుల లలిత అభిప్రాయపడ్డారు. ‘‘33శాతం రిజర్వేషన్లలో కూడా బీసీలకు టాప్ ప్రయారిటి ఇవ్వాలి’’ అని కోరారు. తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘మొదటినుండి పార్టీలో కష్టపడే వారికే టికెట్లు ఇవ్వాలి’’ అన్నారు. భార్య, చెల్లెలు, కూతురు అని ఇప్పుడున్న నేతల కుటుంబాల వారికే టికెట్లు కేటాయించటం తప్పు’’ అని అన్నారు. ‘‘వారసులు పోటీకి రెడీ అవుతున్నారనే ప్రచారంపై మాట్లాడుతు టికెట్ల పంపిణీలో మొదటినుండి పార్టీలో కష్టపడి పనిచేసిన వారికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి’’ అని లలిత చెప్పారు. ‘‘పబ్లిక్ లైఫ్ లో లేకపోయినా వారసులు అన్న అర్హతతో నేతల కుటుంబసభ్యులకే టికెట్లు ఇవ్వటం అన్యాయం’’ అని తెలిపారు.

లుబ్నాసార్వత్ : కష్టపడే వారికే దక్కాలి

సామాజిక అంశాలపైన పోరాటాలు చేస్తున్న లుబ్నాసార్వాత్ మాట్లాడుతు ‘‘ఇపుడు పార్టీల్లో పూర్తిస్దాయి రాజకీయాలు చేస్తున్నచాలామంది మహిళలున్నారు’’ అని చెప్పారు. ‘‘వారసుల హోదాలో ఇళ్ళల్లోని ఆడవాళ్ళకే మళ్ళీ టికెట్లు కేటాయించేట్లయితే పెద్ద తేడా ఏమీ ఉండదు’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘వారసులుగా నేతల ఇళ్ళల్లోని ఆడవాళ్ళకే టికెట్లు దక్కితే పెద్దగా మార్పుఏమీ ఉండదు’’ అని తెలిపారు. ‘‘నైతికభావన, సామాజికసేవ చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్న మహిళలకు టికెట్లిచ్చి ప్రోత్సహించాలి’’ అని సూచించారు. ‘‘కుర్చీలో మహిళలను కూర్చోబెట్టి అధికారం మగవాళ్ళు చెలాయిస్తున్న ఘటనలు చాలానే ఉన్నాయి’’ అని సార్వత్ వివరించారు. ‘‘33 శాతం రిజర్వేషన్లలో ఎన్జీవోలు, మహిళా సమాఖ్యల నుండి గట్టిగా పనిచేస్తున్న మహిళలకు టికెట్లు ఇచ్చి ప్రోత్సహించినపుడే మహిళలకు ఉపయోగం జరుగుతుంది’’ అని లుబ్నా అభిప్రాయపడ్డారు.

నేరెళ్ళ శారద : వారసులకు టికెట్లివ్వకూడదు

‘‘పార్టీకోసం పనిచేస్తున్న వాళ్ళని కాదని వారసులకు టికెట్లు ఇస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు’’ అని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరెళ్ళశారద అభిప్రాయపడ్డారు. ‘‘కేవలం డబ్బులున్నాయి అన్న ఏకైక కారణంగా వారసులకు టికెట్లు కేటాయించటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు’’ అన్నారు. ‘‘వివిధ రంగాల్లోని మహిళలతో పాటు పార్టీలో సంవత్సరాల తరబడి కష్టపడి పనిచేస్తున్న వారికి టికెట్లిచ్చి ప్రోత్సహించినపుడే మహిళా రిజర్వేషన్లకు సార్ధకత దక్కుతుంది’’ అని అన్నారు. ‘‘కులబలం, నాయకత్వ లక్షణాలు ఉండి కూడా వారసత్వ హోదా లేదన్న కారణంగా చాలామంది మహిళలను పార్టీలు పట్టించుకోవటంలేదు’’ అని అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘‘అణగారిన వర్గాల మహిళలకు అన్నీపార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలి’’ అని సూచించారు. ‘‘సమాజానికి రోల్ మోడల్ గా నిలిచిన వాళ్ళకు పార్టీలు టికెట్లివ్వాలని, పబ్లిక్ కూడా అలాంటి వాళ్ళకే ఓట్లేసి గెలిపించాలి’’ అని శారద అభిప్రాయపడ్డారు.

Read More
Next Story