
‘నీ పో మోనే విజయా’
రేవంత్ మాట్లాడుతు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఉద్దేశించి నీ పో మోనే విజయా అన్నారు
‘నీ పోమోనే విజయా’..అంటే విజయన్ నువ్వు దిగిపో అని అర్ధం. ఇంతకీ ఇది ఏ భాష ? సందర్భం ఏమిటి అని ఆలోచిస్తున్నారా ? సందర్భం ఏమిటంటే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నాడు. ప్రచారంలో భాగంగా రేవంత్ మాట్లాడుతు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఉద్దేశించి నీ పో మోనే విజయా అన్నారు. కాంగ్రెస్‌పార్టీ తరపున స్టార్‌క్యాంపెయినర్లలో రేవంత్ కూడా ఉన్నారు. అందుకనే రెండురోజుల ప్రచారంలో భాగంగా కేరళలో పర్యటించారు. ఆ సందర్భంగా ఎర్నాకుళంలో జరిగిన రోడ్డుషోలో రేవంత్ మాట్లాడుతు స్ధానిక ప్రజలను ఉత్తేజపరిచేందుకు నీ పో మోనే విజయా అని మళయాళంలో అన్నారు. రేవంత్ మళయాళంలో విజయన్ ను ఉద్దేశించి దిగిపోమని చెప్పగానే స్ధానికులు పెద్దఎత్తున సానుకూలంగా స్పందించారు.
నిజానికి రేవంత్ చెప్పిన నీ పో మోనే విజయా అనే డైలాగ్ పాపులర్ స్టార్ మోహన్ లాల్ సినిమాలోని ఒక డైలాగ్. ఈమధ్యనే రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మోహన్ లాల్ సినిమా ‘నరసింహ’ లో ‘పో మోనే దినేషా’ అనే పంచ్ డైలాగుంది. దాన్ని రేవంత్ మార్చి నీ పో మోనే విజయా అని మార్చి పంచ్ డైలాగ్ విసరటంతో జనాలు విపరీతంగా స్పందించారు. రేవంత్ దెబ్బకు కేరళ ఎన్నికల్లో నీ పోమేనే విజయా అనే డైలాగ్ పంచ్ డైలాగ్ గా మారిపోతుందేమో చూడాలి.
స్టార్‌క్యాంపెయినర్ హోదాలో రేవంత్ రెండు రోజుల్లో తిరువనంతపురం, అలప్పుజ, ఎర్నాకులం రోడ్డుషోలు, సభల్లో పాల్గొన్నారు. రేవంత్ తో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అలాగే డిప్యుటి సీఎం మల్లభట్టి విక్రమార్క పాండిచ్చేరిలో కాంగ్రెస్ అభ్యర్ధుల తరపున ప్రచారం చేస్తున్నారు. భట్టి ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగుస్తుంది.

