
రేవంత్‌రెడ్డికి రాయలసీమ ప్రయోజనాలు తాకట్టు
తొందరలో రాయలసీమ లిఫ్ట్ కోసం వైసిపి రాయలసీమ ప్రాంతీయ ఉద్యమం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ పనులు చంద్రబాబు నిలిపివేసినందుకు నిరసనగా ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రాంతీయ ఉద్యమం చేపట్టేందుకు సిద్ధమవుతూ ఉంది. దీనికోసం రాయలసీమ అని అన్ని వర్గాల ప్రజలను, మేధావులను సమీకరించే కృషిలో ఉంది. ఈ విషయాలను ఈరోజు పార్టీ నేతలు అనంతపురంలో వెల్లడించారు.
రాయలసీమ ఎత్తిపోతలపథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిక మేరకు చంద్రబాబునాయుడు ఆపేసినట్టు తేలిపోయిందని, రేవంత్ రెడ్డి మాటలను ఖండించాల్సిన చంద్రబాబు, 20 టీఎంసీల కోసం ఎందుకంత రాద్ధాంతం అని మాట్లాడటం రాయలసీమకు వెన్నుపోటు పొడవడమేనని అనంతపురం జిల్లా వైయస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు.
అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించి రాయలసీమ లిఫ్టు పెండింగ్ పనులు పూర్తి చేసే వరకు ఊరుకునేది లేదని, రాజకీయాలకు అతీతంగా సాగునీటిరంగ నిపుణులు, మేధావులు, రాయలసీమ ఉద్యమకారులతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని వారు హెచ్చరించారు.
మీడియా సమావేశంలో పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకుడు బోరెడ్డి నరేష్ కుమార్ రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు వై.విశ్వేశ్వర రెడ్డి, సాకె శైలజనాథ్, మెట్టు గోవిందరెడ్డి, వై.వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, తలారి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.
"పక్క రాష్ట్రాల్లో నిర్మాణం జరుగుతున్న అక్రమ ప్రాజెక్టుల కారణంగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం నోరు మెదపడం లేదు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచి అదనంగా 17 టీఎంసీల నీటిని తరలించుకుపోతే, ఇప్పుడు మళ్లీ చంద్రబాబు సీఎం కాగానే కర్నాటక రాష్ట్రం ఆల్మట్టి ఎత్తును 524 మీటర్లకు పెంచే పనులు చకచకా చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణం జరుగుతున్న అక్రమ ప్రాజెక్టుల కారణంగా రోజుకు 8 టీఎంసీల నీటిని తరలించుకుపోతున్నారు," అని వారు పేర్కొన్నారు.
"2019లో వైయస్ జగన్ సీఎం కాగానే రాయలసీమ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టి రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. శ్రీశైలానికి వరద వచ్చే 40 రోజుల సమయంలో నీటిని తరలించాలనేది రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు లక్ష్యం. వైయస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ. 990 కోట్లు ఖర్చు చేసి 80 శాతం పనులు పూర్తి చేయడం జరిగింది. కానీ 2024లో చంద్రబాబు సీఎం అయ్యాక రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను పూర్తిగా పక్కన పెట్టేశారు," అని వారు ఆరోపించారు.
పర్యావరణ అనుమతులు లేవనే సాకు చూపించి ఈ ప్రాజక్టును పక్కన పెట్టేశారనడం తప్ప అని చెబుతూ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఆ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ తాను కోరడం వల్లే చంద్రబాబు రాయలసీమ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఆపేశాడని చెప్పడమే కాకుండా దానికి నిజనిర్ధారణ కమిటీ వేయడానికి సిద్ధమని ప్రకటించాడని దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంజాయిషీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
"తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రయోజనాల కోసం చంద్రబాబు రాయలసీమ రైతుల భవిష్యత్తును తాకట్టుపెట్టాడు. కానీ ఇంతవరకు రేవంత్ రెడ్డి మాటలను చంద్రబాబు ఖండించలేదు. పైగా 20 టీఎంసీల కోసం అంత రాద్ధాతం అవసరమా అన్నట్టు చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటు. తెలంగాణ ప్రాజెక్టులన్నీ పూర్తయితే శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకోవడం గగనమే అవుతుంది. అప్పుడు రాయలసీమ ప్రాజెక్టులకు చుక్క నీరు కూడా రావడం అసాధ్యం. రేవంత్‌రెడ్డితో చంద్రబాబు చేసుకున్న రహస్య ఒప్పందం కారణంగా రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఏర్పడింది," వారు పేర్కొన్నారు
రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ నాలుగు జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మేలు జరుగుతుందని ఈ ప్రాజెక్టుపై పార్టీ తరఫున ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు రూపొందిస్తున్నామని వారు పేర్కొన్నారు.
ఇప్పటికే ‘చలో పొతిరెడ్డిపాడు’ కార్యక్రమం కర్నూలు జిల్లాలో నిర్వహించడం జరిగింది. ఈ ప్రాజెక్టు పూర్తి చేసే లక్ష్యంతో మేథావులు, సాగునీటి రంగ నిపుణులతో కలిసి వైయస్సార్సీపీ ఉద్యమిస్తుందని వారు హెచ్చరించారు.

