నెమ్రాలో గిరిజన పోరాటయోధుడు శిబూ సోరెన్ అంత్యక్రియలు
x

నెమ్రాలో గిరిజన పోరాటయోధుడు శిబూ సోరెన్ అంత్యక్రియలు

సంతాపం వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు మంత్రులు..


Click the Play button to hear this message in audio format

ప్రముఖ గిరిజన నాయకుడు, జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) సహ వ్యవస్థాపకుడు శిబు సోరెన్ (Shibu Soren) (81) సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఝార్ఖండ్‌ రాష్ట్రం ఏర్పాటు కోసం ఆయన అలుపెరుగని పోరాటం చేసిన విషయం తెలిసిందే. మూత్రపిండ సమస్యలతో బాధపడుతున్న ఆయన గడచిన నెల రోజులుగా ఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జార్ఖండ్‌(Jharkhand) రాష్ట్రం రామ్‌గఢ్ జిల్లాలోని ఆయన స్వగ్రామం నెమ్రాలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రామ్‌గఢ్ డిప్యూటీ కమిషనర్, ఎస్పీతో సహా సీనియర్ పరిపాలనా అధికారులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

మూతపడ్డ పాఠశాలలు, వ్యాపార సంస్థలు..

నెమ్రా గ్రామానికి తీసుకెళ్లే ముందు శిబూ సోరెన్‌కు మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు కడసారి వీడ్కోలు పలికేందుకు ఆయన పార్థీవదేహాన్ని జార్ఖండ్ అసెంబ్లీకి తీసుకెళ్లారు. సంతాపసూచకంగా జార్ఖండ్ ప్రభుత్వం ఆగస్టు 6 వరకు మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. శిబూ సోరెన్‌ గౌరవార్థం దుకాణాలు, సంస్థలను మూసివేయాలని జార్ఖండ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (FJCCI) పిలుపునిచ్చింది. ఇక జార్ఖండ్‌లోని చాలా పాఠశాలలు మంగళవారం మూసిపడ్డాయి. శిబూ సోరెన్ ఆత్మకు శాంతి చేకూరాలని పాఠశాల యాజమాన్యాలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాయి. శిబూ సోరెన్ సిట్టింగ్ ఎంపీ కావడంతో గౌరవ సూచకంగా రాజ్యసభ కార్యకలాపాలు సోమవారం కూడా వాయిదా పడ్డాయి.

మూడుసార్లు సీఎం.. కేంద్రమంత్రిగా మూడు పర్యాయాలు..

అవిభాజ్య బీహార్‌ రాష్ట్రంలోని రామ్‌గఢ్‌ జిల్లా నెమ్రా గ్రామంలో 1944, జనవరి 11న జన్మించిన శిబూ సోరెన్‌ గిరిజనోద్యమనేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. 15 ఏళ్ల వయసులో ఆయన తండ్రి శోబరన్‌ సోరెన్‌ వడ్డీ వ్యాపారుల చేతిలో హత్యకు గురయ్యారు. శిబూ సోరెన్‌పై తీవ్ర ప్రభావం చూపిన ఈ ఘటన అనంతరం గిరిజన హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టారు. 1973లో జేఎంఎంను స్థాపించిన ఆయన ఉద్యమం ఫలితంగా 2000 సంవత్సరం నవంబరు 15న ప్రత్యేక ఝార్ఖండ్‌ రాష్ట్రం ఆవిర్భవించింది. శిబూ సోరెన్‌ యూపీఏ హయాంలో మూడుసార్లు కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా పనిచేశారు. మూడు పర్యాయాలు ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రిగానూ విధులు నిర్వహించారు. ఆయన తన జీవితకాలంలో 8 సార్లు లోక్‌సభకు, ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

ప్రముఖుల సంతాపం

శిబూ సోరెన్‌ మరణంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు మంత్రులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా పలువురు రాజకీయ నాయకులు అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం ఉంది. గిరిజనులకు గుర్తింపు తెచ్చేందుకు, ఝార్ఖండ్‌ రాష్ట్ర ఆవిర్భావానికి సోరెన్‌ ఎనలేని కృషిచేశారని రాష్ట్రపతి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. గిరిజన జాతుల సాధికారికతకు సోరెన్‌ అవిరళ కృషి చేశారని ప్రధాని మోదీ అన్నారు. పలు రాష్ట్రాల సీఎంలు, జాతీయ, రాష్ట్ర నాయకులు దివంగత నేతకు నివాళులర్పించారు.

Read More
Next Story