
అమిత్ షా రికార్డు..
దేశంలో ఎక్కువ కాలం పనిచేసిన హోంమంత్రిగా నమోదు..
భారతదేశంలో అత్యధిక కాలం కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా అమిత్ షా(Amit Shah) రికార్డుకెక్కారు. 2019 మే 30న బాధ్యతలు చేపట్టిన అమిత్ షా జూన్ 9, 2024 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆయన మళ్ళీ జూన్ 10, 2024న హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఆగస్టు 5 నాటికి కేంద్ర హోంమంత్రిగా ఉన్న షా 6 సంవత్సరాల 56 రోజులు (2258 రోజులు) పూర్తిచేసుకున్నారు.
అద్వానీ, పంత్‌లను అధిగమించిన షా..
గతంలో హోమంత్రిగా ఉన్న కాంగ్రెస్ నేత గోవింద్ వల్లభ్ పంత్ పదవీకాలాన్ని కూడా షా అధిగమించారు. గోవింద్ వల్లభ్ పంత్ జనవరి 10, 1955 నుంచి మార్చి 7, 1961 వరకు కేంద్ర హోం మంత్రిగా పనిచేశారు. ఇక బీజేపీ నేత లాల్ కృష్ణ అద్వానీ 2,256 రోజులు ఆ పదవిలో కొనసాగారు.
షా కీలక నిర్ణయాలు...
షా తన పదవీకాలంలో ఆర్టికల్ 370 రద్దు సహా అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఉగ్రవాదంపై నిరంతర అణచివేత, అంతర్గత భద్రత బలోపేతానికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (CAA) కూడా ఆయన పదవీకాలంలోనే అమలులోకి వచ్చింది. 2026 మార్చి నాటికి దేశం నుంచి మావోయిజాన్ని నిర్మూలిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే.