
ఉత్తరాఖండ్‌లో కుంభవృష్టి: పెరిగిన మృతుల సంఖ్య
ఇప్పటిదాకా ఐదుగురు, తప్పిపోయిన వారికోసం కొనసాగుతున్న గాలింపు
ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలతో ఉత్తర కాశీ(Uttarkashi) తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. నిన్నటి వరద ఉధృతికి గంగోత్రికి వెళ్లే మార్గంలోని ధరాలీ గ్రామంలోని సగభాగం జలమయమైంది. ఇప్పటిదాకా ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. సుమారు 60 నుంచి 70 మంది గల్లంతయ్యారు. వారి కోసం సహాయక బృందాలు గాలింపు చేపడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి(Pushkar Singh Dhami) డెహ్రాడూన్‌కు తిరిగి వచ్చి సీనియర్ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాగా బుధవారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ రెడ్ అలర్డ్ జారీ చేసింది IMD.
ఘటన అనంతరం ఉత్తరాఖండ్ ఎంపీలు పీఎం నరేంద్ర మోదీతో సమావేశమై తమను ఆదుకోవాలని కోరారు. కాగా ఈ దుర్ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైసీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.