
ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న కేరళ పర్యాటకుల బృందం..
వరద సంభవించిన తర్వాతి నుంచి సమాచారం లేకపోవడంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన ..
కేరళకు చెందిన 28 మంది పర్యాటకుల బృందం ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్నట్లు వార్తలొస్తున్నాయి. వీరిలో 20 మంది కేరళకు చెందినవారుకాగా మహారాష్ట్రలో స్థిరపడ్డారు. మిగిలిన 8 మంది కేరళలోని వివిధ జిల్లాలకు చెందినవారు. ఈ విషయాన్ని పర్యాటక బృందంలోని కొంతమంది బంధువులు చెబుతున్నారు. ఈ బృందం వారం క్రితం ఉత్తరాఖండ్‌కు తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. మంగళవారం ఉదయం గంగోత్రికి వెళ్తామని బంధువులకు సమాచారం ఇచ్చారు. కొండచరియలు విరిగిపడిన ప్రదేశం నుంచి ఈ బృందం దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే వీరి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం సంభవించిన ఆకస్మిక వరద కారణంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం ధరాలి గ్రామంలోని ఇళ్లు, హోటళ్లు నీట మునిగాయి. ఉధృత నీటి ప్రవాహానికి దాదాపు సగం గ్రామం బురదలో చిక్కుకుంది. ఐదుగురు మరణించినట్లు అధికారులు ప్రకటించారు. గల్లంతయిన వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి.