నేడు కాంగ్రెస్ 138వ జన్మదినం, 15 వాక్యాల్లో క్లుప్తంగా కాంగ్రెస్ చరిత్ర
ఏర్పాటు చేసినపుడు స్వాతంత్య్రం అనే మాట కాంగ్రెస్ నేతలకు తెలియదు. ఇంగ్లండులో చదువుకున్నోళ్లు పవర్ కు దగ్గిరయేందుకు పెట్టిన ఈ పార్టీ వెనక ఉన్న కథేంటేంటే...
ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 138 వ సంస్థాపక దినోత్సవం జరుపుకునేందుకు నాగపూర్ లో సమావేశం అవుతూ ఉంది. బిజెపికి ఊపిరిపోసిన రాష్ట్రీయ స్వయం సేవక్ కేంద్ర స్థానమయిన నాగపూర్ ను ఈ సమావేశానికి ఎన్నుకోవడం ఆశ్చర్యం. ఎన్ని ఒడుదుడుకులు వచ్చిన పడుతూలేస్తూ రావడం కాంగ్రెస్ చరిత్రలో కనబడుతూంది. ఆర్ ఎస్ ఎస్ కు కాంగ్రెస్ ఈ సందేశమీయాలనుకుంటున్నదా.
కాంగ్రెస్ హిస్టరీలోని 15 ముఖ్యాంశాలివే...
ప్రపంచంలోనే అతిపెద్ద, అతి పురాతన పార్టీల్లో కాంగ్రెస్ ఒకటి. బ్రిటిష్ హోంశాఖ కార్యదర్శి అయిన ఏ ఓ హ్యూమ్ కాంగ్రెను డిసెంబర్ 28, 1885లో స్థాపించారు. మొదట కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం బ్రిటిష్ వారి నుంచి కేవలం మెరుగైన పాలనను మాత్రమే కావాలని కోరారు. కానీ తరువాత తన విధానాన్ని మార్చుకుని చివరగా స్వాతంత్యం సాధించింది.
1.1884 లో మద్రాస్ లోని థియోసోఫికల్ కన్వేన్షన్ లో అలెన్ అక్టేవియన్ హ్యూమ్(ఏఓ హ్యూమ్) 17 మందితో ఓ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే ఆయనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించాలనే ఐడియా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తన తొలి సమావేశాన్ని బొంబాయిలోని గోకుల్ దాస్ తేజ్ పాల్ సంస్కృత కళాశాలలో నిర్వహించింది.
2. పార్టీ ప్రారంభంలో ప్రధాన లక్ష్యం ఏంటంటే‘విద్యావంతులైన భారతీయ యువతకు ప్రభుత్వంలో ఎక్కువ భాగస్వామ్యం కల్పించడం’. అలాగే బ్రిటిష్ సర్కార్ కు, మేధావులకు మధ్య అర్ధవంతమైన చర్చలు జరపడం, అందుకు సరైన వేదిక సృష్టించడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఉండేది.
3. కాంగ్రెస్ పార్టీ తొలి సమావేశం మొదట జరగవలసింది పూనాలో. అయితే కలరా వ్యాధితో బీతావాహ పరిస్థితులుండటం మూలానా తరువాత బొంబాయికి మారింది. దీనికి ఏఓ హ్యూమ్ వైశ్రాయ్ లార్డ్ డఫ్రిన్ నుంచి అనుమతి తీసుకున్నారు.
4.ఉమేష్ చంద్ర ముఖర్జీ ఈ సమావేశానికి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి 72 మంది ప్రతినిధుల హాజరయ్యారు.
5. లక్నోలో జరిగిన పదిహేనవ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో బ్రిటిష్ వలసవాద విధానాలను కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. దేశంలోని సంపద మొత్తం ఇంగ్లండ్ కు తరలించడంపై విమర్శలు గుప్పించారు దాదాభాయ్ నౌరోజీ. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్ సీ దత్. దేశంలో కరువు కాటకాలకు కారణం ప్రకృతే కాదు.. సంపద తరలింపు కారణం అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
6.1905 బెంగాల్ విభజన దాకా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ప్రజాదరణ దక్కలేదు. కేవలం వార్షిక సమావేశాలతోనే ముందుకు సాగేది. అయితే బెంగాల్ విభజనను లార్డ్ కర్జన్ ప్రారంభించడాన్ని అవకాశంగా తీసుకుని సురేంద్రనాథ్ బెనర్జీ, సర్ హెన్రీ కాటన్ సమర్ధవంతంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించారు.
7. పార్టీ ప్రారంభించిన పది సంవత్సరాలకు గానీ పెద్దగా ప్రతినిధులు వార్షిక సమావేశాలకు హాజరుకాలేదు అని చెప్పవచ్చు. అయితే 1895 నాటి సమావేశానికి 1,163 మంది హాజరయ్యారు. అంతకుముందు వార్షిక సమావేశానికి 1584 మంది హాజరయ్యారు. దీంతో సురేంద్రనాథ్ బెనర్జీ కాంగ్రెస్ పార్టీ నాయకులను అభినందించారు.
8. మహత్మాగాంధీ తొలిసారి కాంగ్రెస్ వేదికపై కనిపించిన సంవత్సరం ఏంటో తెలుసా... 1901లో.. డిసెంబర్ 26. కలకత్తాలో జరిగిన సమావేశంలో ఆయన తళుక్కుమన్నారు. అప్పటికి ఆయన దక్షిణాఫ్రికాలో న్యాయవాదీగా ఉన్నారు. దేశంలో ఉన్న జాత వివక్ష, దోపిడీకి వ్యతిరేక పోరాటాలకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని కోరారు.
9. కాంగ్రెస్ కు రెండో మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికైంది సరోజిని నాయుడు. 1925 డిసెంబర్ 26న ఎన్నికైయ్యారు. అంతకుముందు అనిబిసెంట్ కాంగ్రెస్ పార్టీకి తొలి మహిళా అధ్యక్షురాలిగా పని చేశారు. సరోజిని నాయుడు ఎన్నికైన సందర్భంగా ‘మనలను ఆకలితో నగ్నంగా నిలబెట్టి, బానిసత్వంతో అణచివేస్తూ, అనైక్యతతో కొట్టామిట్టాడుతున్న హృదయాల్లో, చనిపోయినా ఆరిపోని జ్వాలను వెలిగిస్తా’ అని ప్రసంగించారు.
10. మహత్మా గాంధీ దక్షిణాఫ్రికా 1914 నుంచి తిరిగి వచ్చిన తరువాత 1921లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైయ్యారు. అయితే రెండో ప్రపంచ యుద్దం ప్రారంభ నాటికే కాంగ్రెస్ పార్టీకి ఆయనొక స్టార్ అట్రాక్షన్ గా మారారు.
11. కాంగ్రెస్ పార్టీ వార్షిక సమావేశం తొలిసారిగా గ్రామీణ ప్రాంతంలో మహరాష్ట్రలోని ఫైజ్ పూర్ లో జరిగింది. దీనికి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షత వహించారు. సమావేశంలో నెహ్రూ మాట్లాడుతూ‘ భారత దేశం ముమ్మాటికి రైతులదే. ఈ భూమి మీకే చెందుతుంది. ఈ వాస్తవాన్ని గుర్తించి మీ చెంతకు కాంగ్రెస్ పార్టీని చేర్చడానికి ఫైజ్ పూర్ లో సమావేశం నిర్వహిస్తున్నాం’ అని చెప్పారు.
12.సహయ నిరాకరణ ఉద్యమం ఆలోచన మద్రాస్ లో పుట్టింది. 1919 మార్చి 23న తన వియ్యంకుడు సీ రాజగోపాలాచారీ ఇంట్లో గాంధీ బస చేశారు. అప్పుడే గాంధీకి ప్రజలంతా పాటించే ఉపవాసం, ప్రార్థనలకు తోడు బహిరంగ సభలను కలపడం ద్వారా దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టవచ్చనే ఆలోచన వచ్చింది. ఈ విధంగా సహయ నిరాకరణ ఉద్యమం పుట్టుకొచ్చింది.
13. దేశానికి స్వాతంత్య్రం రావడంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యభూమిక వహించింది. పార్టీకి చెందిన 15 మిలియన్ కార్యకర్తలు, 70 మిలియన్లు ప్రజలు ఇందులో కీలక పాత్ర పోషించి ప్రజా ఉద్యమాలు నిర్మించి వలసపాలనను అంతం చేశారు.
14.స్వాతంత్య్రం వచ్చిన 15 సాధారణ ఎన్నికల తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ భారత్ ను పాలిస్తోంది. అందులో ఆరు ఎన్నికల్లో స్వంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగా, నాలుగు సార్లు సంకీర్ణ ప్రభుత్వాల ద్వారా అధికారంలో ఉంది.
15.కేంద్రం లో 49 సంవత్సరాలు కాంగ్రెస్ రూల్ చేసింది. దేశంలో ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ లేదు.