గడిచిన ఐదేళ్లలో 200 రైలు ప్రమాదాలు, 351 ప్రయాణికులు మృతి
x

గడిచిన ఐదేళ్లలో 200 రైలు ప్రమాదాలు, 351 ప్రయాణికులు మృతి

రద్దీగా ఉండే ప్యాసింజర్ రైళ్లు, ఓవర్‌లోడ్ గూడ్స్ ట్రైన్ల వల్ల పట్టాలపై ఒత్తిడి పెరిగి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది.


ఇటీవల దేశంలో రైలు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. ప్రమాదాలకు సాంకేతిక కారణాలుండొచ్చు. మానవ తప్పిదాల వల్ల జరిగి ఉండొచ్చు. కారణం ఏదైతేనేం.. ట్రైన్ యాక్సిడెంట్లలో చనిపోయే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. RTI కార్యకర్త వివేక్ పాండే అభ్యర్థన మేరకు భారతీయ రైల్వే శాఖ ఇచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తే.. గత ఐదేళ్లలో 200 సార్లు రైలు ప్రమాదాలు జరిగాయి. 351 మంది చనిపోగా 970 మంది గాయపడ్డారు. జూన్ 2023లో బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీ కొన్న ఘటనతో పాటు సౌత్ - ఈస్ట్ జోన్‌లో జరిగిన 10 ప్రమాదాల్లో 297 మంది మరణించినట్లు రైల్వే శాఖ నివేదించింది.

2019 నుంచి 2024 వరకు ఐదేళ్లో రైలు ప్రమాదాల్లో మృతుల కుటుంబాలకు రూ. 32 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించింది. సదరన్ రైల్వే, కొంకణ్ రైల్వే, నార్త్ ఈస్టర్న్ రైల్వే, సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్లలో ఎలాంటి రైలు ప్రమాదాలు జరగలేదని పేర్కొంది.

ప్రమాదాలకు కొన్ని కారణాలు..

సాంకేతిక కారణాల వల్ల, కొన్నిసార్లు మానవ తప్పిదాల వల్ల రైలు ప్రమాదాలు జరుగుతుంటాయని ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (IRTS) సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ట్రాక్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం, కాలం చెల్లిన మౌలిక సదుపాయాలు, సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం, వంతెనలు, సొరంగాల నిర్వహణ సరిగా లేకపోవడం సాంకేతిక కారణాల కిందకు వస్తాయన్నారు. డ్రైవర్ అలసట, తగిన శిక్షణ లేకపోవడం, రైల్వే సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ మానవ తప్పిదాలుగా చెప్పుకొచ్చారు. రద్దీగా ఉండే ప్యాసింజర్ రైళ్లు, ఓవర్‌లోడ్ గూడ్స్ ట్రైన్ల వల్ల పట్టాలపై ఒత్తిడి పెరిగి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందన్నారు.

ప్రమాదాలు తగ్గాయి: వైష్ణవ్

గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రమాదాల సంఖ్య తగ్గిందని రైల్వే కేంద్రం మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. 10 సంవత్సరాల క్రితం సంవత్సరానికి 171 రైలు ప్రమాదాలు జరిగేవని, ప్రస్తుతం ఏడాదికి 40 ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే నెట్‌వర్క్‌ల్లో రైల్వే వ్యవస్థ ఒకటని, రోజూ మిలియన్ల మంది ప్రయాణికులు, భారీ మొత్తంలో సరుకుల రవాణా జరుగుతుందన్నారు.

Read More
Next Story