
ఓటర్ల తొలగింపు వల్లే కేజ్రీవాల్ ఓడిపోయారా?
ఐదేళ్లలో 25 శాతం ఓటర్లను తొలగించినట్లు ఎన్నికల డేటాను బట్టి అర్థమవుతుంది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో AAP చీఫ్ కేజ్రీవాల్ ఓటమికి అదే కారణమా?
ఆప్ (AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ నేత, మూడుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన షీలా దీక్షిత్‌పై 2013 నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన కేజ్రీవాల్ .. నాలుగోసారి మాత్రం విజయాన్ని అందుకోలేకపోయారు. ఎప్పటిలాగే న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆయన.. బీజేపీ(BJP) అభ్యర్థి పర్వేష్ వర్మ చేతిలో 4వేల పైచిలుకు మెజార్టీతో ఓడిపోయారు. కేజ్రీవాల్ పరాజయం పార్టీకి తీవ్ర నష్టంగానే భావించాలి. కాని, ఒకసారి ఎన్నికల గణాంకాలను విశ్లేషిస్తే..కేజ్రీవాల్ నియోజకవర్గంలో గత ఐదేళ్లలో ఓటర్ల సంఖ్యను భారీగా తొలగించినట్లు అర్థమవుతుంది.
2020 అసెంబ్లీ ఎన్నికల సమయానికి న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 1,46,122 మంది. 2024 లోక్‌సభ ఎన్నికల సమయానికి ఆ సంఖ్య 1,06,365కి పడిపోయింది. అంటే మొత్తం 39,757 మంది ఓటర్లను (27.2%) తొలగించారు.
తిరిగి 2024 లోక్‌సభ ఎన్నికల తరువాత 2025 అసెంబ్లీ ఎన్నికల నాటికి 2,209కి పెరిగింది. 2020 అసెంబ్లీ ఎన్నికలను 2025 ఎన్నికలలో పోలిస్తే.. మొత్తం 37వేల మంది(25.7 శాతం)కి పైగా ఓటర్లను తొలగించారు. దీని అర్థం 2020 ఓటరు జాబితాలో ఉన్న ప్రతి నలుగురిలో ఒకరిని 2025 నాటికి తొలగించారన్నమాట.
న్యూఢిల్లీ, షాహదర వంటి నియోజకవర్గాల్లో అన్యాయంగా ఓటర్లను తొలగించారని ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య జనాభా పెరుగుదల లేదా వలసల కారణంగా మారుతుండడం సహజమే. కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఈ మార్పు గణనీయంగా కనిపించింది.
ఉదాహరణకు నంగ్లోయి జాట్ నియోజకవర్గంలో 2020 నుంచి 2024 మధ్య మొత్తం ఓటర్ల సంఖ్య 13,992కు తగ్గిపోయింది. కానీ 2024 లోక్‌సభ ఎన్నికల నుంచి 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నాటికి 16,413 ఓట్లు పెరిగాయి.