జామ్‌నగర్ లో భూలోక స్వర్గం ఆవిష్కృతం కానుంది. గొప్పోళ్ల పెళ్లంటే అందరికీ ఆసక్తే. ఏమి తింటారు, ఏమి చేస్తారు, ఎన్ని రకాల వంటలు వండుతారు, ఎంతమంది సినీ ప్రముఖులు, ఇతర అతిరథమహారథులు వస్తారు వంటి సవాలక్ష ప్రశ్నలు సామాన్యుడిని చుట్టుముడతాయి. తాను తీర్చుకోలేని కోర్కెలనేకం కనీసం వినైనా, చూసైనా, చదివైనా తెలుసుకోవాలనుకుంటారు. ఇప్పుడు ఆ ఆసక్తే అనంత్ అంబానీ పెళ్లి ఏర్పాట్లపై నడుస్తోంది.
‘‘మేకిన్ ఇండియా తరహాలో దేశంలో ‘వెడ్ ఇన్ ఇండియా’ ప్రారంభం కావాలి. భారత్‌లో పెళ్లి చేసుకునే జంటలను దేవుడు కలుపుతాడని విశ్వసిస్తారు. అలాంటప్పుడు దేవుడు కలిపిన జంటలు తమ జీవితంలో నూతన ప్రయాణాన్ని విదేశాలకు వెళ్లి ఎందుకు ప్రారంభించాలి? యువ జంటలు వెడ్డింగ్ డెస్టినేషన్ గురించి ఆలోచించాలి’’ అన్న ప్రధాని మోదీ పిలుపునకు భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ బాగానే స్పందించినట్టున్నారు. తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. జులై 12న రాధికా మర్చంట్‌ను వివాహం చేసుకోబోతున్నారు. ఇప్పటికే పెళ్లి సందడి మొదలైంది. మార్చి 1 నుంచి 3 వరకు ప్రీ వెడ్డింగ్ వేడుకల్ని గుజరాత్ జామ్‌నగర్‌లో నిర్వహించబోతున్నారు. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ అట్టహాసంగా జరగబోతుంది. మొదటిసారి స్టార్ గాయని రిహన్నా భారత్‌కు రానున్నారు. ప్రపంచమంతా చెప్పుకునేలా.. అతిరథ మహారథుల మధ్య గ్రాండ్ గా వేడుక జరగనుంది. అతిథులకు 2వేల 5వందల రకాల వంటకాలతో భోజనాలు వడ్డించనున్నారు.
టాక్ ఆఫ్ ది ఇంటర్నేషనల్...
దేశ, విదేశీ ప్రముఖులు హాజరవుతుండటంతో మూడు రోజుల పాటు జరగనున్న ప్రీ వెడ్డింగ్ వేడుకలు టాక్ ఆఫ్ ది ఇంటర్నేషనల్‌గా మారిపోయాయి. మార్చి 1న కాక్టెయిల్ పార్టీతో ప్రీవెడ్డింగ్ వేడుక ప్రారంభమవుతుంది. మార్చి 2న రెండు ఈవెంట్లను ప్లాన్ చేశారు. ఉదయం అంబానీ కుటుంబం 3వేల ఎకరాల్లో అభివృద్ధి చేసిన జంతు సంరక్షణ కేంద్రం వంతారాలో వైల్డ్‌సైడ్ వాక్ అనే కార్యక్రమం చేపడతారు. మార్చి 3న ప్రపంచ నలుమూలల నుంచి హాజరైన అతిథులకు ప్రకృతి మధ్యలో మధ్యాహ్న భోజనం వడ్డించనున్నారు.
ప్రపంచ నలుమూలల నుంచీ...
ప్రపంచంలోని వివిధ దేశాల అధినేతలు, ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు సహా దాదాపు 12వందల మంది ఈ ప్రీవెడ్డింగ్ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారిని అలరించడానికి భారీగా ఈవెంట్లు ప్లాన్ చేశారు. దేశంలోని ఆర్టిస్టులతో పాటు ప్రంపచంలోని ప్రముఖ కళారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అమెరికన్ సింగర్ రిహాన్నా సహా అర్జీత్ సింగ్, దిల్జీత్ దోసంగ్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టనున్నారు.
ఏమి కావాలంటే అదే...
ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగే మూడ్రోజుల పాటు అతిథులకు ప్రత్యేక మెనూ వడ్డించనున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి 21మంది చెఫ్‌లతో వంటలు చేయించనున్నారు. గెస్టులకు ఇండియన్ డిషెస్ తో పాటు జపనీస్, మెక్సికన్, థాయ్, పార్సీ ఇలా పలు రకాల సంప్రదాయ వంటలను రుచి చూపించనున్నారు. మొత్తంగా 2 వేల 5వందల రకాల వంటకాలను అతిథులకు వడ్డిస్తారు. బ్రేక్‌ఫాస్ట్‌లో 75 వెరైటీలు, లంచ్‌లో 225, డిన్నర్‌లో 275 రకాల వంటకాలు పెడుతారు. మిడ్‌నైట్ స్నాక్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు. అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 4 గంటల వరకు 85 వంటకాల్లో అతిథులు ఏది కోరుకుంటే అది అందించనున్నారు.
అందరి దృష్టి అటువైపే...
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలపైనే ఇప్పుడు అందరి దృష్టి. అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్‌కు గుజరాత్ లోని జామ్‌నగర్ ను ఎంచుకోవడం ఆసక్తిగా మారింది. ‘‘నేను ఇక్కడే పెరిగాను. ఇక్కడ వేడుక జరుగుతుండటం నా అదృష్టం. ఇది మా నానమ్మ జన్మభూమి. మా తాతయ్య, నాన్న కర్మభూమి. ఇది మీ తాతయ్య అత్తిల్లు అంటూ మా నాన్న తరచూ చెప్తుంటారు. భారత్‌లోనే వివాహాలు చేసుకోవాలని మోదీ పిలుపునిచ్చినప్పుడు నాకు ఎంతో గర్వంగా అనిపించింది. ఇది నా ఇల్లు’’ అంటూ అనంత్ స్పందించారు.
రాధిక నా వెన్నంటి నిలిచింది: అనంత్
తాను ఆరోగ్యసమస్యలతో ఇబ్బందిపడుతోన్న సమయంలో రాధికా మర్చంట్ ఎంతో అండగా నిలిచిందన్నారు అనంత్. ‘నా జీవితంలో ఆమె ఉండటం నా అదృష్టం. ఆమె నా కలలరాణి. ఎప్పుడూ మూగజీవాల సంరక్షణ గురించి ఆలోచించే నేను.. వైవాహిక జీవితంలోకి అడుగుపెడతానని అనుకోలేదు. కానీ రాధికను కలిసిన తర్వాత మొత్తం మారింది. మా ఆలోచనలు కలిశాయి. ఆమె మూగజీవాల పట్ల దయతో ఉంటుంది. నేను ఆరోగ్యపరంగా ఇబ్బంది ఎదుర్కొంటున్న సమయంలో కొండంత అండగా నిలిచింది’ అని రాధికపై తన ప్రేమను వ్యక్తం చేశారు. అనంత్ చిన్నప్పటి నుంచి ఊబకాయంతో బాధపడుతున్నారు. తన కుమారుడికి ఆస్థమా ఉండటంతో, బరువు తగ్గడం చాలా కష్టంగా మారిందని గతంలో నీతా అంబానీ చెప్పారు.
9 పేజీలతో ఈవెంట్ గైడ్...
అతిథులకు 9 పేజీల ఈవెంట్ గైడ్ తయారైంది. ఆహ్వానితులను తీసుకువెళ్లేందుకు మార్చి ఒకటి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య ముంబయి, ఢిల్లీ నుంచి జామ్‌నగర్‌కు ఛార్టర్డ్ ఫ్లైట్స్ నడుపుతున్నారు. లగేజ్, డ్రెస్‌కోడ్ గురించి ఓ క్లారిటీ ఇచ్చారు. వైద్యసేవలు, డైట్‌కు తగ్గ ఫుడ్ అందుబాటులో ఉంటుంది. జామ్‌నగర్‌లో ఫైవ్‌స్టార్ హోటళ్లు లేకపోవడంతో.. అల్ట్రా- లగ్జరీ టెంట్‌లను ఏర్పాటు చేశారు. అతిధుల కోసం ఏర్పాటు చేసే ఈ టెంట్‌లలో సకల సదుపాయాలు ఉంటాయి.
హోరెత్తనున్న సంగీతం...
ఈ మూడు రోజులు పాటలు, నృత్యాలతో ఆ వేదిక హోరెత్తనుంది. గ్లోబల్ పాప్ స్టార్ రిహన్నాతో పాటు దిల్జీత్ దోసాన్జ్, ఇతర గాయకులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఇందుకోసం రిహన్నా మొదటిసారి భారత్‌కు రానున్నారు. జామ్‌నగర్ టౌన్‌షిప్ కాంప్లెక్స్‌లో హస్తాక్షర్- సంతకాలు- పేరిట ఒక సంప్రదాయ కార్యక్రమం నిర్వహించనున్నారు. భారత వారసత్వ సంప్రదాయాన్ని ప్రతిబింబించే దుస్తుల్లో ఇది జరగనుంది. ఆ నగరంలో దేశ సంస్కృతీసంప్రదాయాలకు అనుగుణంగా పలు ఆలయాల నిర్మాణానికి అంబానీ కుటుంబం సహకరించింది. గతంలో ముకేశ్ సతీమణి నీతూ అంబానీ నేతృత్వంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. పెళ్లి వేడుకల్లో భాగంగా ఆమె ఈ ప్రాంతాన్ని సందర్శించారు.