ఢిల్లీలో హై టెంపరేచర్..
దేశ రాజధానిలో బుధవారం అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీ పరిధిలోని ముంగేష్‌పూర్‌లో 52.3 డిగ్రీల టెంపరేచర్ రికార్డయ్యింది.
దేశ రాజధానిలో బుధవారం అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీ పరిధిలోని ముంగేష్‌పూర్‌లో 52.3 డిగ్రీల టెంపరేచర్ రికార్డయ్యింది. ఇది అసాధారణంగా కనిపిస్తోందని అని IMD డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజస్థాన్ నుంచి వచ్చే వేడి గాలులే ఈస్థాయి ఉష్ణోగ్రతల నమోదుకు కారణమని ఐఎండీ పేర్కొంది. ఉత్తరాదిలోని చాలా రాష్ట్రాల్లో హీట్ వేవ్‌ల ప్రభావం ఉంటుందని, అది జూన్‌లోనూ కొనసాగవచ్చని చెబుతున్నారు.
పలు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు..
ఇక హర్యానా, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లోని నగరాలు, పట్టణాల్లో 47 డిగ్రీలకు మించి నమోదైంది. గత రికార్డులను పరిశీలిస్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మే30న, 1994న గరిష్ఠంగా 48.4 డిగ్రీల సెల్సియస్, అలాగే రోహ్‌తక్‌లో జూన్ 6, 1995న 47.2 డిగ్రీల టెంపరేచర్ రికార్డయ్యింది.
రెండు రోజుల్లో ఉపశమనం..
నైరుతి రుతుపవనాలతో వాతావరణం చల్లబడుతుంది. ఇప్పటికే అవి కేరళలోకి ప్రవేశించాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో ఇతర రాష్ట్రాలకు విస్తరించవచ్చని ఐఎండీ తెలిపింది.
బీహార్‌లో మూతపడ్డ పాఠశాలలు..
రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో, బీహార్ ప్రభుత్వం జూన్ 8 వరకు అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు, అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించింది. షేక్‌పురా, బెగుసరాయ్, తూర్పు చంపారన్ ప్రాంతాలలో ఎండ వేడిమికి కొంతమంది విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయినట్లు వార్తలు రావడంతో బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉండడంతో శరీరం డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
హర్యానాలో..
హర్యానాలోని హిసార్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 48.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. మహేంద్రగఢ్‌లో అత్యధికంగా 48.3 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, సిర్సాలో 48.2 డిగ్రీలుగా రికార్డయ్యింది.
ఝజ్జర్, ఫరీదాబాద్‌లలో వరసగా 48.4 డిగ్రీలు, 48 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అంబాలాలో 44.3 డిగ్రీలు, కర్నాల్‌లో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రోహ్‌తక్, హిసార్‌లలో సాయంత్రం తేలికపాటి జల్లులు పడ్డాయి. దీంతో తాత్కాలికంగా ఉపశమనం పొందారు.
ఉడికిపోతున్న పంజాబ్, రాజస్థాన్..
పంజాబ్‌లోని భటిండాలో అత్యధికంగా 48.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. లూథియానా , పఠాన్‌కోట్ రెండింటిలోనూ 46.1 డిగ్రీలు నమోదైంది. ఫరీద్‌కోట్‌లో 46 డిగ్రీల సెల్సియస్, అమృత్‌సర్‌లో 45.8 డిగ్రీలు, పాటియాలాలో 45.7 డిగ్రీలు, గురుదాస్‌పూర్‌లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.