రిచ్ కావడానికి నువ్వేమన్నా అంబానీవా, అదానివా?  డబ్బు జబ్బుతో జైలు పాలు!
x
గంజాయితో ఒడిషా నుంచి స్కూటీపై వచ్చిన నిందితులు

రిచ్ కావడానికి నువ్వేమన్నా అంబానీవా, అదానివా? డబ్బు జబ్బుతో జైలు పాలు!

పెద్ద పెద్ద కలలు కనమని అబ్దుల్ కలాం చెప్పాడంటే అర్థం ఇది కాదురా అయ్యా.. కష్టపడి సంపాయించమంటే గంజాయి స్మగ్లింగ్ చేయమని కాదు.. ఇప్పటికైనా అర్ధం చేస్కో నాయనా..


రాత్రికి రాత్రే కోటేశ్వరులు అయిపోవాలనే దురాశ.. కష్టపడకుండానే భారీగా డబ్బు సంపాయించాలనే పేరాశతో ఇక్కడో మెకానిక్‌ కటకటాలపాలయ్యాడు. ధనవంతులు అయ్యేందుకు షార్ట్‌ కట్స్‌ ఫార్ములాలేవీ వర్కవుట్‌ కావని రుజువైంది.

అతనో మెకానిక్‌. స్టేట్‌ ఒడిషా. పేరు వరుణ్‌ కుమార్‌. రోజంతా పని చేసినా చేతికి మూతికి సరిపోవడం లేదు. వయసు మీరుతోంది. పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. దీంతో ఓ షార్ట్‌కట్‌ ఫార్ములాను కనిపెట్టాడు. తెలంగాణలో మాదకద్రవ్యాలు బాగా అమ్ముడవుతున్నాయని ఆనోటా ఈనోటా విన్నారు. ఇక అంతే క్షణం ఆలోచించకుండా గంజాయి స్మగ్లర్‌గా మారాడు. అదేదో సినిమాలో ఆలీ రోజుకో స్కూటర్‌పై ఇసుక మూట కట్టుకుని వాహనాలను వేరే రాష్ట్రంలో అమ్మి పోలీసులకు మస్కా కొట్టినట్టుగా ఇతను కూడా పోలీసులను బోల్తా కొట్టించాలనుకున్నాడు. మెకానిక్‌ కావడంతో స్కూటర్‌లో ఏయే పార్టుల్ని ఎలా తయారు చేయాలో, ఏది ఎక్కడ దాయవచ్చో కనిపెట్టాడు. ఇక అంతే, ఓ స్కూటీ బండికి పది కిలోల గంజాయి కట్టుకుని బయల్దేరాడు. రెండు రాష్ట్రాల సరిహద్దులు దాటాడు. సుమారు 800 కిలోమీటర్లు ప్రయాణించాడు. హైదరాబాద్‌ పోలీసులకు చిక్కాడు. కటకటాల పాలయ్యాడు.


తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులు గంజాయి వంటి మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ విషయం వరుణ్‌ కుమార్‌కి తెలిసినట్టు లేదు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కర్నీ సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందో లేదో.. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ తెలంగాణ పోలీస్ అకాడమీ వద్ద చిక్కాడు. సినీ ఫక్కీలో గంజాయి తరలిస్తున్న కేటుగాణ్ణి ఎక్సైజ్‌ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడి నుంచి 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇతని స్కెచ్‌ చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. ఇలా కూడా గంజాయిని స్మగ్లింగ్‌ చేయవచ్చా అని ముక్కున వేలేసుకున్నారు.

పోలీసులకు మస్కా కొట్టాలని చూసి...


ఒడిషా నుంచి స్కూటీపై రావడాన్నే అనుమానించిన పోలీసులు క్షుణ్ణంగా తనికీ చేశారు. ఓ స్కూటీకి ఎన్ని భాగాలుంటాయో అన్ని భాగాల్లో గంజాయిని దాచి గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్రాల సరిహద్దులు దాటి హైదరాబాద్‌ వచ్చాడు. సిటు కింది భాగాన్ని పూర్తిగా గంజాయితో నింపాడు. ముందున్న పాస్టిక్‌ భాగంలోపల, పక్కనున్న భాగంలోనూ‌ గంజాయిని దాచి ఎవరికి ఏమాత్రం అనుమానం రాకుండా స్కూటిని తీర్చిదిద్దాడు. గంజాయి వాసన రాకుండా స్కూటీ లోపల, బయట ఎప్పుడూ పర్యూపూమ్ కొట్టాడు. ఇలా ఒకటా రెండా ఏకంగా 800 కిలోమీటర్లు ప్రయాణం చేశారు.

విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులే టార్గెట్

హైదరాబాద్‌లో విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు టార్గెట్‌గా గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో ప్యాకింగ్ చేసి విక్రయించాలన్నది ప్లాన్‌. స్కూటీ మొత్తం వెతికినా పోలీసులు ఓ దశలో గంజాయిని గుర్తించలేకపోయారు. దీంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. నిందితుడు ఏదో దాస్తున్నాడని అనుమానించిన పోలీసులు స్కూటీ విడిభాగాలను ఒక్కొక్కటి తీసి వెతకడంతో అసలు కథ బయటపడింది. ఇంత జరిగినా నోరు విప్పని నిందితుణ్ణి పోలీసులు తమదైన స్టైల్‌లో నాలుగు తగిలిస్తే అసలు విషయం బయటపడింది. గంజాయి బండారం బయటపడింది. ఒడిషాలో మూడు వేల రూపాయలకు గంజాయి కొని హైదరాబాద్‌లో 20 నుంచి 30 వేల రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ నిందితునిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి‌ కటకటాలకు తరలించారు.

Read More
Next Story