
ఆధార్ గుర్తింపు కార్డు మాత్రమే.. పౌరసత్వ రుజువు కాదు
మరోసారి స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం..
దేశంలో రెండో విడత ఓటరు జాబితా సవరణ ప్రక్రియ(S.I.R) ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి పునరుద్ఘాటించింది. ‘‘ఆధార్ కార్డు(Aadhaar) కేవలం గుర్తింపునకు మాత్రమే పనిచేస్తుంది. అది పౌరసత్వ రుజువు కాదు’’ అని స్పష్టం చేసింది.
గుర్తింపునకు మాత్రమే ఆధార్‌ను ఉపయోగించేలా ఆదేశించాలని న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన మధ్యంతర పిటీషన్‌పై ఎన్నికల కమిషన్ (EC) తన సమాధానాన్ని సుప్రీంకోర్టు(Supreme court)కు సమర్పించింది. ఆధార్ పుట్టిన తేదీకి రుజువు కాదని మహారాష్ట్ర రాష్ట్రం vs. UIDAI (క్రిమినల్ రిట్ పిటిషన్ నం. 3002 ఆఫ్ 2022) కేసులో బాంబే హైకోర్టు తీర్పును కూడా ఉదహరించింది.
బీహార్‌లో S.I.R చేపడుతున్న సమయంలో.. సుప్రీంకోర్టు ఆధార్‌ను గుర్తింపు పత్రాలలో ఒకటిగా ఉపయోగించడానికి అనుమతించిన విషయం తెలిసిందే.
అండమాన్, నికోబార్ దీవులు, లక్షద్వీప్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో నవంబర్ 4 నుంచి రెండో దశ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) చేపడుతున్నట్లు ఈసీ గతంలో పేర్కొంది.

