AAP, కాంగ్రెస్ ఒంటరి పోరు..బీజేపీకి లాభించిందా?
x

AAP, కాంగ్రెస్ ఒంటరి పోరు..బీజేపీకి లాభించిందా?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఇండియా (I.N.D.I.A) కూటమి పార్టీలు విడివిడిగా పోటీచేయడమే బీజేపీకి కలిసొచ్చిందా? ఇకనైనా ప్రతిపక్ష కూటమి పార్టీలు తీరు మార్చుకుంటాయా?


Click the Play button to hear this message in audio format

జాతీయ రాజధానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) 48 సీట్లు దక్కించకుంది. వరుసగా మూడు సార్లు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఈ సారి 22 స్థానాలతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్‌ ఒక్క చోట కూడా గెలువలేకపోయింది. అయితే 27 ఏళ్ల తర్వాత హస్తినా పీఠాన్ని చేజిక్కించుకోవడానికి బీజేపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆప్ ముఖ్యనేతలు కేజ్రీవాల్(Arvind Kejriwal), మనీష్ సిసోడియా పాత్ర, తన అధికారిక నివాసంలో హంగులకు కేజ్రీవాల్ రూ. కోట్లు కేటాయించడం, యమునా నదీ శుద్ధీకరణ హామీ నిలబెట్టుకోలేకపోవడం.. బీజేపీకి అస్త్రాలుగా మారాయి.

మరోవైపు బీజేపీ విజయానికి పరోక్షంగా ఇండియా కూటమి భాగస్వాములైన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), కాంగ్రెస్ దోహదపడ్డాయన్న టాక్ వినిపిస్తోంది. ఆ రెండు పార్టీలు విడివిడిగా పోటీచేయడం వల్ల కాషాయ పార్టీ లాభపడిందని, కలిసి పోటీ చేసి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని రాజకీయ విశ్లేషకుల మాట.

సఖ్యత లేకపోతే కూటమి లక్ష్యం వృథా..

బీజేపీ గెలుపుపై శివసేన (యూబీటీ) (Shiv Sena (UBT) స్పందించింది. తన అధికార పత్రిక సామ్నా‌లో ప్రచురించిన సంపాదకీయంలో కూటమి పార్టీల మధ్య సఖ్యత లేకపోవడమే కారణమని పేర్కొంది. కాషాయ పార్టీని ఓడించడమే లక్ష్యమని జతకట్టిన ప్రతిపక్ష కూటమి సభ్యులు.. ఒకరిపై ఒకరు పోటీచేసుకుంటే కూటమికి అర్థం లేదని విమర్శించింది.

"ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ పరస్పరం నాశనం చేసుకునేందుకు పోటీ పడ్డాయి. ఈ పరిస్థితి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా‌కి కలసివచ్చింది. ఇలాగే కొనసాగితే కూటములు ఎందుకు?," అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది శివసేన (యూబీటీ).

ఇలాంటి విభేదాలే మహారాష్ట్రలో (2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలిచినప్పుడు) బీజేపీకి కలిసొచ్చాయని సంపాదకీయంలో పేర్కొంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాల నుంచి పాఠం నేర్చుకోకపోతే మోదీ-షా "అధికార దుర్వినియోగ పాలన" మరింత బలపడుతుందని హెచ్చరించింది.

ఒమర్ అబ్దుల్లా కామెంట్..

గత శనివారం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్-AAP విడివిడిగా పోటీ చేయడంపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

"ఒకరినొకరు తిట్టుకుంటూ పోటీచేయండి!" అంటూ ఎక్స్‌లో కామెంట్ చేశారు.

అబ్దుల్లా వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. 14 స్థానాల్లో AAP పరాజయానికి కాంగ్రెస్ కారణమైందని సామ్నా పేర్కొంది. ఇదే పరిస్థితి హర్యానా ఎన్నికల్లోనూ (గత ఏడాది బీజేపీ గెలిచినప్పుడు) కనిపించిందని వెల్లడించింది.

అరవింద్ కేజ్రీవాల్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన అన్నా హజారే‌ను కూడా సామ్నా విమర్శించింది. ఒకప్పుడు కేజ్రీవాల్ ఎదుగుదలకు మార్గం సుగమం చేసిన హజారే, ఇప్పుడు ఆయనను విమర్శించడం అర్ధరహితమని పేర్కొంది.

హజారే ఏకపక్ష వ్యాఖ్యలు..

"స్వచ్ఛమైన, నీతివంతులను ఎన్నుకోవాలని" హజారే గత నెలలో ఢిల్లీ ప్రజలను కోరిన విషయం తెలిసిందే. అయితే మోదీ ప్రభుత్వంలో జరుగుతోన్న అవినీతి, రాఫెల్ డీల్, అదానీ గ్రూప్‌పై హిండెన్ బర్గ్ నివేదిక అంశాలపై హజారే మౌనం పాటించడం గమనార్హమని సామ్నా ఎత్తిచూపింది.

"మోదీ ప్రభుత్వం మోసపూరిత, అవినీతి పాలన సాగిస్తోంది. నేరస్థులను కూడగట్టుకుని మహారాష్ట్రతో సహా దేశాన్ని నడిపిస్తోంది" అని సంపాదకీయంలో రాసుకొచ్చారు.

"ఢిల్లీలో జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రజాస్వామ్య విధానాలను ప్రభావితం చేస్తున్నాయి. మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ స్థానాల విభజన విషయంలో చివరి నిమిషం వరకు వ్యవహారాన్ని లాగడంతో అపార్థాలు తలెత్తాయి" అని సామ్నా పేర్కొంది.

"ఢిల్లీ, మహారాష్ట్రలో ప్రతిపక్ష విభజనతో బీజేపీ లాభపడింది. ఇది ఇలాగే కొనసాగితే కూటమి ఏర్పాటు అవసరమే లేదు. ఇలా ఒకరినొకరు పోటీ పడుతూ ఉండండి!" అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.

Read More
Next Story