AAP | మీ పర్యవేక్షణలో ఢిల్లీకి ఎన్ని పేర్లో.. షాకు కేజ్రీవాల్ లేఖ..
x

AAP | మీ పర్యవేక్షణలో ఢిల్లీకి ఎన్ని పేర్లో.. షాకు కేజ్రీవాల్ లేఖ..

ఢిల్లీలో శాంతిభద్రతలు క్షీణించడంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు.


ఢిల్లీలో శాంతిభద్రతలు క్షీణించడంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. ఢిల్లీ శాంతిభద్రతలు కేంద్రం అధీనంలో ఉన్నాయని, వీటిపై హోం శాఖ మంత్రి స్పందించాలని అమిత్ షాకు లేఖ రాశారు. ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ లేఖ రాయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఢిల్లీకి ఎన్నో రకాలుగా పిలవడం మొదలెట్టారు?

‘‘భద్రతా వైఫల్యం కారణంగా మీ పర్యవేక్షణలో ఉన్న మా మహా రాజధానిని రేప్ క్యాపిటల్, గ్యాంగ్‌స్టర్ క్యాపిటల్, డ్రగ్ క్యాపిటల్ అని పిలవడం చాలా సిగ్గుచేటు. మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయి. దోపిడీ ముఠాలు తమ పని పెంచేశాయి. డ్రగ్స్ మాఫియా నగరమంతా విస్తరించింది. మొబైల్ ఫోన్లు, చైన్ స్నాచింగులతో జనం బెంబేలెత్తిపోతున్నారు.’’ అని లేఖలో పేర్కొన్నారు.

ఆరు మాసాల్లో 600 స్కూళ్లకు బాంబు బెదిరింపులు..

‘‘గడిచిన ఆరు నెలల్లో 600లకు పైగా పాఠశాలలు, 100కు పైగా ఆసుపత్రులు, మాల్స్‌, విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ బెదిరింపుల కారణంగా ఢిల్లీలో పిల్లలు, వారి తల్లిదండ్రులు నిత్యం భయంతో గడుపుతున్నారు. స్కూళ్లను ఖాళీ చేయించి విద్యార్థులను ఇంటికి పంపే సమయంలో పిల్లలు, వారి తల్లిదండ్రుల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? బాంబు బెదిరింపులకు పాల్పడ్డ నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదు? అని ప్రశ్నించారు.

ఫస్ట్ ప్లేస్‌లో ఢిల్లీ..

‘‘19 మెట్రో నగరాల్లో మహిళలపై నేరాలు, హత్యల విషయంలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. 2019 నుంచి మాదకద్రవ్యాల సంబంధిత నేరాలు 350 శాతం పెరిగాయి. రోజూ సగటున ముగ్గురు మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. వ్యాపారవేత్తలకు క్రమం తప్పకుండా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. శాంతిభద్రతలు క్షీణించాయని చెప్పడానికి ఇవే నిదర్శనం. నేను ప్రజల మధ్యకు వెళ్తున్నా. నా గురించి శాంతి భద్రతల విషయంలో వారు ఆందోళనగా ఉన్నారు’’ అని కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నారు.

Read More
Next Story