నటి వరలక్ష్మి పెళ్లి కూతురాయనే!
x
వివాహ ముహూర్త వేడుక..

నటి వరలక్ష్మి పెళ్లి కూతురాయనే!

హనుమాన్, క్రాక్, తెనాలి రామకృష్ణ బీఎ, బీఎల్, పక్కా కమర్షియల్ సినిమాలలో నటించి మంచి పేరుతెచ్చుకున్న నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ తొందర్లో పెళ్లి చేసుకోబోతున్నారు.


హనుమాన్, క్రాక్, తెనాలి రామకృష్ణ బీఎ, బీఎల్, పక్కా కమర్షియల్ సినిమాలు గుర్తున్నాయిగా.. ఈ సినిమాలలో ఓ ప్రత్యేక క్యారెక్టర్ మనల్ని ఎంతగానో అలరిస్తుంది. ఆ పాత్రధారి ఎవరో మీకీపాటికే గుర్తుకువచ్చి ఉంటుంది. ఆమే సినీనటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌. ఆమె తొందర్లో పెళ్లి చేసుకోబోతున్నారు. తనదైన నటనతో ఒకింత సీరియస్ గా, మరింత నటనా వైవిధ్యంతో కూడిన వరలక్ష్మీ శరత్ కుమార్ ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తను వివాహమాడనున్నారు. పెయింటింగులు, అద్భుత కళాఖండాలు వంటివి ఉండే గ్యాలరీలను నిర్వహించడంలో ఈ వ్యాపారికి మంచిపేరుంది. ఆయనే నికోలయ్‌ సచ్‌దేవ్‌. ఆయనతో ముంబైలో ఆమె నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకలో కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. తండ్రి శరత్ కుమార్, మారుతల్లి రాధికతో పాటు నికోలయ్ తల్లి, మరికొంత మంది మిత్రులు ఈ ఫంక్షన్ కు హాజరయ్యారు.

తండ్రి వద్దన్నా సినీ రంగ ప్రవేశం..

కన్నడంలో ఎంతో పేరున్న నటుడు శరత్ కుమార్. వరలక్ష్మి బెంగళూరులో 5 మార్చి 1985న నటుడు శరత్‌కుమార్, ఛాయ దంపతులకు జన్మించారు. ఆమె మారుతల్లి నటి రాధిక. వరలక్ష్మి తన పాఠశాల విద్యను చెన్నైలోని సెయింట్ మైకేల్స్ అకాడమీలో చదివింది. ఆమె హిందుస్థాన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, చెన్నై నుంచి మైక్రోబయాలజీలో గ్రాడ్యుయేట్, ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం నుంచి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ చేసి నటిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. ముంబైలోని అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణ పొంది సినీరంగంలో ప్రవేశించారు వరలక్ష్మి. తమిళ, తెలుగు చిత్రాల్లో నటిగా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక నికోలయ్‌ సచ్‌దేవ్‌ ముంబయికి చెందిన వ్యాపారవేత్త. ఆర్ట్‌ గ్యాలరీలను నిర్వహిస్తుంటారు. వివిధ రకాల పెయింటింగ్‌లు, కళాకృతులను విక్రయిస్తుంటారు. నికోలయ్‌, వరలక్ష్మీకి 14ఏళ్లుగా పరిచయం ఉంది. ప్రస్తుతం జరిగింది వివాహముహూర్తమేనని, వివాహానికి మరికొంత సమయం పట్టవచ్చునంటున్నారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ పనుల్లో బిజీబిజీగా ఉండడమే కారణమట. మరోవైపు వరలక్ష్మి అటు తమిళ, ఇటు తెలుగు సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నారు. ఇటీవల ఆమె నటించిన ‘హను-మాన్‌’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ధనుష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాయన్‌’లోనూ నటిస్తున్నారు. మలయాళంలో ‘కలర్స్‌’, తెలుగు ‘శబరి’ చిత్రాల్లో నటిస్తున్నారు.

వరలక్ష్మి తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దృశ్యాన్ని ఒడిసిపట్టడంలో ఆమెకు ఆమే సాటని పలు సంస్థలు మెచ్చుకున్నాయి. ఆమె చాలా సహజనటిగా గుర్తింపుపొందారు. ఆత్మవిశ్వాసం, కపటం లేని మనస్తత్వం ఉన్న వ్యక్తి అంటుంటారు. మమ్మూట్టితో కలిసి నటించారు. ఉన్నదున్నట్టు ముఖం మీదనే చెప్పేసే వ్యక్తి వరలక్ష్మి. అదేదో సినిమా నిర్మాతలు తనపట్ల అవమానకరంగా వ్యవహరించారని అసలు ఆసినిమానే వదిలేశారు. జయటీవీలో అరిందాల్ టీవీ షోకి వరలక్ష్మి హోస్ట్‌గా చేశారు. ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం తెనాలి రామకృష్ణ BA. BL, ఆ తర్వాత ఆమె అనేక తెలుగు సినిమాలలో నటించారు. త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు.

Read More
Next Story