
ప్రతిపక్ష కూటమిపై దాడులొద్దు: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్..
స్థానిక సంస్థల ఎన్నికలలో మహాయుతి కూటమి 207 అధ్యక్ష స్థానాలను, ప్రతిపక్ష కూటమి (కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ (ఎస్‌పీ) 44 స్థానాలను గెలుచుకుంది..
మహారాష్ట్ర(Maharashtra)లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యుత్సాహంతో ఎవరూ కూడా ప్రతిపక్ష కూటమి నాయకులు, కార్యకర్తలపై దాడులకు దిగొద్దని తమ కూటమి శ్రేణులను కోరారు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis). సోమవారం రాత్రి (డిసెంబర్ 22) ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన మహారాష్ట్ర బీజేపీ కోర్ టీం సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎవరికి ఎన్ని?..
మహారాష్ట్ర అంతటా 288 మునిసిపల్ కౌన్సిళ్లు, నగర పంచాయతీలకు ఇటీవల ఎన్నికలు జరగ్గా.. మహాయుతి కూటమి (బీజేపీ, శివసేన, ఎన్‌సీపీ) ఘన విజయాన్ని సాధించింది. కూటమి 207 అధ్యక్ష స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 117, శివసేన 53, ఎన్‌సిపి 37 స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష కూటమి (కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ (ఎస్‌పీ) 44 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ కేవలం 28 అధ్యక్ష స్థానాలను సాధించగలిగింది.
చందా నుంచి బండా వరకు..
అయితే ఎన్నికలకు ముందు అధికార NDA కూటమిలో BJP, శివసేన, NCP మధ్య సీట్ల పంపకాలపై లోతయిన చర్చ జరిగింది. కొంతమంది కూటమి భాగస్వాములే ఒకరిపై ఒకరిని నిలబెట్టారు. ఏక్‌నాథ్ షిండే(Shinde) నేతృత్వంలోని శివసేన మొదటిసారిగా బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసింది. మహాయుతి ఏర్పాటులో జూనియర్ భాగస్వామి అయినప్పటికి, దాని సీనియర్ మిత్రపక్షం కంటే ఎక్కువ స్ట్రైక్‌రేట్ నమోదు చేసింది. శివసేన అభ్యర్థులు కొంకణ్, థానే బెల్ట్‌లోని ప్రాంతాలతో పాటు రూరల్, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఈ ఫలితంపై షిండే స్పందిస్తూ.. శివసేన రాష్ట్రవ్యాప్తంగా "చందా నుంచి బండా వరకు" విస్తరించిందని చెప్పారు.

