
యమునా నది జల కాలుష్యంపై AAP, BJP మధ్య మాటల యుద్ధం..
కేజ్రీవాల్ ప్రభుత్వంలో 'విషపూరితం' అని పేర్కొన్న రసాయనాన్ని ఇప్పుడు రేఖ గుప్తా ప్రభుత్వం వాడుతుండటాన్ని తప్పుబడుతున్న ఆప్ నేతలు..
ఢిల్లీ(Delhi)లో యమునా నది(Yamuna River) కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలు దశాబ్దాల నాటివి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అది ఎన్నికల ప్రధాన అంశం కూడా. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధికారంలో ఉన్నపుడు యమునా నదీ శుద్ధీకరణకు నామమాత్రపు చర్యలు చేప్టటిందని భారతీయ జనతా పార్టీ(BJP) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. అయితే 27 ఏళ్ల తర్వాత ఢిల్లీల్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు అదేపని చేస్తుంది. నదిని శుభ్రం చేయడానికి గతంలో ఆప్ ప్రభుత్వం వాడిన రసాయనాన్నే వాడుతోంది. ఈ రసాయనాన్ని బీజేపీ అప్పట్లో విషపూరితమది పేర్కొంది. అయితే ఇప్పుడు అదే మందును నది శుద్ధీకరణకు ఎందుకు వాడుతున్నారని ఆప్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
ఛఠ్ పండుగ నేపథ్యంలో..
ఛఠ్ పండుగ అక్టోబర్ 25 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ పండుగ రోజున భక్తులు యమునా నదిలో స్నానం చేసి సూర్య భగవానుడిని ప్రార్థిస్తారు. ఈ పండుగ కోసం రేఖా గుప్తా ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి.. యమునా నది శుద్ధీకరణ బాధ్యతను మంత్రి కపిల్ మిశ్రాకు అప్పగించారు. యమునా నదిని శుద్దీకరణకు కట్టుబడి ఉన్నామని చెబుతూ కాళింది కుంజ్ వద్ద యమునా నది ఒడ్డున సీఎం నిలుచుని మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అయ్యింది. ఆ వీడియోలో డీఫోమర్ రసాయనంతో నురుగును తొలగిస్తున్నట్లు ఆమె చెప్పారు. ‘‘డీఫోమర్ వాడకం వల్ల ఎలాంటి హాని లేదు. ఇది ప్రయోగశాలలో పరీక్షించబడింది. జలచరాలకు హాని కూడా కలగదు’’ అని రేఖా గుప్త చెప్పుకొచ్చారు. యమునా నదిలో నురుగు నివారణకు చర్యలు చేపట్టినట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.
कालिंदी कुंज के पास यमुना का नजारा आप सभी देखें…
— Rekha Gupta (@gupta_rekha) October 16, 2025
और…. अफवाहों से बचें!#CleanYamuna pic.twitter.com/RWcFsYpnsE
పర్వేష్కు ఆప్ సూటి ప్రశ్న..
ఆప్ నేత సంజీవ్ రెండు వీడియోలను రిలీజ్ చేస్తూ బీజేపీ నేత వర్మను ప్రశ్నిస్తున్నారు.
అక్టోబర్ 22, 2022 నాటి వీడియోలో అప్పటి బీజేపీ నాయకుడు, అప్పటి ఎంపీ పర్వేశ్ వర్మ యమునా నది దగ్గర నిలబడి, ఢిల్లీ ప్రభుత్వ అధికారిని మందలిస్తున్నారు.‘‘నదిలోని నురుగును తొలగించడానికి వాడే రసాయనంతో వచ్చిన అధికారితో వర్మ "యమునా నదిలో ఎందుకు విషాన్ని నింపుతున్నారు," అని అడుగుతున్నట్లు కనిపిస్తుంది. ఆ అధికారి ఆ రసాయనాన్ని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (NMCG) ఆమోదించిందని చెబుతూ కనిపిస్తారు. దానికి వర్మ.. “నేను దానిని నీ తలపై పోయాలా?” అని అడుగుతాడు.
पकड़े गए BJP के नौटंकीबाज़ मंत्री 🤡 pic.twitter.com/9uPaDNXjyd
— Sanjeev Jha (@Sanjeev_aap) October 16, 2025
తర్వాత వీడియోలో యమునా నదిలో నురుగును తొలగించడానికి డీఫోమర్ను ఉపయోగించారని ఝా చెప్పారు. "మూడేళ్ల తర్వాత చూడండి... అదే రసాయనాలను యమునా నదిలో కలుపుతున్నారు. వర్మను నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను.. గతంలో మేం యమునా నదిలో విషం కలుపుతున్నామని చెప్పాడు. మరి ఇప్పుడు వాళ్లు ఏం చేస్తున్నారు? అదే విషాన్ని మళ్లీ కలుపుతున్నారు, " అని ధ్వజమెత్తారు.
పరిష్కారం ఏమిటి?
పర్యావరణవేత్త మను సింగ్ మాట్లాడుతూ.. ‘‘డీఫోమర్ రసాయనం సిలికాన్ ఆధారిత రసాయనం. ఇది సమస్యకు పరిష్కారం కాదు. నివారణ మాత్రమే. వాస్తవానికి, యమునా నదిలో BOD (బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్) తక్కువగా ఉన్న ప్రదేశాలలో నురుగు ఏర్పడుతుంది. డీఫోమర్ నురుగును తొలగిస్తుంది కానీ నురుగుకు కారణమయ్యే కాలుష్య కారకాలను కాదు. డీఫోమర్ జలచరాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. మురుగునీరు యమునాలోకి ప్రవేశించకుండా తీవ్రమైన చర్యలు తీసుకుంటే బాగుండేది." అని సింగ్ పేర్కొన్నారు.