నేటి సాయంత్రం బీహార్‌కు ఎస్పీ చీఫ్ అఖిలేష్..
x

నేటి సాయంత్రం బీహార్‌కు ఎస్పీ చీఫ్ అఖిలేష్..

‘‘ఓటర్ అధికార్ యాత్ర’’లో రాహుల్‌కు మద్దతు


Click the Play button to hear this message in audio format

సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) చీఫ్ అఖిలేష్ యాదవ్ (AkhileshYadav) ఈ రోజు సాయంత్రం బీహార్ చేరుకోనున్నారు. S.I.Rకు వ్యతిరేకంగా కాంగ్రెస్(Congress) నేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) చేపట్టిన ‘‘ఓటర్ అధికార్ యాత్ర’’లో ఆయన పాల్గొననున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ సరిహద్దు జిల్లాలోని చాప్రా పట్టణంలో రాహుల్‌కు మద్దతు ఇవ్వనున్నారు. చాప్రాలో PDA (పిచ్ఛ్డా-దళిత-అల్పసంఖ్యక్) - వెనుకబడిన కులాల హిందువులు, దళితులు, ముస్లిం మైనార్టీల జనాభా ఎక్కువ. అందుకే ఈ పట్టణాన్ని అఖిలేష్ ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.

‘‘యూపీ కో ఏ సాథ్ పసంద్ హై’’ స్లోగన్‌తో 2017లో అఖిలేష్, రాహుల్ గాంధీ కలిసి UP ఎన్నికల్లో తమ అభ్యర్థులను పోటీ చేయించారు. బీజేపీ ఢీ కొట్టడమే వారి లక్ష్యం. కాని ఆ ప్రయత్నం ఫలించలేదు. కాషాయ పార్టీ ఘన విజయం సాధించింది. 403 స్థానాల్లో BJP 312 సీట్లు గెలుచుకోగా.. SP, కాంగ్రెస్‌కు కలిపి 54 సీట్లు మాత్రమే దక్కాయి.

అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో PDA నినాదాంతో రెండు పార్టీలు విజయం సాధించాయి. కాషాయ పార్టీ వ్యూహం బెడిసికొట్టింది. ఇదే PDA మంత్రాన్ని చాప్రాలో కూడా అఖిలేష్ ఉచ్ఛరిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బీహార్‌లో ఇప్పటికే రాహుల్ గాంధీ వెంట యాత్రలో రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ ఉన్న విషయం తెలిసిందే.


అఖిలేష్ PDA ఆయుధం..

సారన్ జిల్లా చాప్రా పట్టణంలో వెనుకబడిన తరగతులకు చెందిన ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా చాప్రా చుట్టుపక్కల గ్రామాల్లో కేవత్, చంద్రవంశీ (కహార్), ధనుక్, నై, పాల్, బింద్, మల్లా, నట్, రాజ్వంశీ, తేలి కులాలు PDAలో భాగం. ఈ సామాజిక వర్గాల ఓటర్లు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతాయి కూడా.


ఎవరు ఎంత శాతం ?

ఇక బీహార్‌లో కులాలవారీగా పరిశీలిస్తే వెనుకబడిన తరగతుల (OBC) వారు 27 శాతం ఉండగా..యాదవులు 14 శాతం మాత్రమే ఉన్నారు. మరోవైపు ముస్లింలు ఓటింగ్ జనాభాలో 18 శాతం ఉన్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల నాయకులు 'ఓటరు అధికార్ యాత్ర'లో పాల్గొన్నా.. అఖిలేష్ ప్రభావం మాత్రం రాష్ట్రంలోని ఓటర్లపై ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.


లోక్‌సభలో రాహుల్‌కు సపోర్టుగా..

"పార్లమెంటులో రాహుల్ గాంధీని ప్రశ్నించినప్పుడల్లా, అఖిలేష్ యాదవ్ స్పందించి మాట్లాడారు. ఎన్నికల సంఘం అఫిడవిట్లను అడిగినప్పుడు 2022 ఎన్నికల తర్వాత అఫిడవిట్లను సమర్పించేందుకు ముందుకు వచ్చింది కూడా ఎస్పీయే. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్‌నుద్దేశించి అడిగిన ప్రశ్నలకు ఎస్పీ సమాధానమిస్తోంది" అని ఎస్పీ ప్రతినిధి ఫక్రుల్ హసన్ చంద్ పేర్కొన్నారు.


అఖిలేష్ మాట..

అఖిలేష్ బీహార్ పర్యటన చాలా ముఖ్యమైంది. ఎందుకంటే 2022 యూపీ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై ఎన్నికల కమిషన్‌తో గట్టిగా పోరాడారు. ఇటీవల న్యూఢిల్లీలో ఈసీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో చురుకుగా పాల్గొన్నారు. బీహార్ ర్యాలీలో పాల్గొనడం గురించి అఖిలేష్ మాట్లాడారు. భారత కూటమిని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. రాహుల్‌కు సపోర్టుగా ఉంటూనే..రెండేళ్లలో జరగనున్న యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై అఖిలేష్ దృష్టి సారించినట్లు సమాచారం.

Read More
Next Story