హిందుస్థాన్ హమారా హై దేశంలో విస్త‌రిస్తున్న ఎం.ఐ.ఎం.
x

'హిందుస్థాన్ హమారా హై' దేశంలో విస్త‌రిస్తున్న ఎం.ఐ.ఎం.

ఇప్పుడు ఓవైసీ పాత‌బ‌స్తీ నేత‌కాదు, జాతీయ నేత‌.


నిజాం కాలంలో 1927 మార్చి 2న బ్రిటిష్ ఇండియాలో మ‌జ్లిస్ - ఏ- ఇత్తేహాదుల్ ముస్లిమీన్ గా ఉనికిలోకి వచ్చిన మజ్లిస్ పార్టీ 1948లో సర్దార్ పటేల్ పోలీసు చర్యతో నిర్వీర్యమైపోయింది.


1950వ దశకం చివరలో సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ తండ్రి వాహెద్ ఒవైసీ మళ్లీ ఆ పార్టీకి ప్రాణం పోశారు. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నుంచి మొదలైన ఎం.ఐ.ఎం. రాజకీయ ప్రస్థానం అసెంబ్లీ, పార్లమెంటు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం దాకా వచ్చింది. అసదుద్దీన్ ఒవైసీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఇతర రాష్ట్రాలకూ వ్యాపిస్తోంది. ముస్లిం పార్టీగా ముద్ర పడిన మజ్లిస్‌కు సెక్యులర్ గుర్తింపు తీసుకురావడానికి అసదుద్దీన్ ప్ర‌యత్నిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లోని వివిధ పార్టీలకు అందుబాటులో ఉంటూ లిబరల్ నేతగా, సెక్యులర్ పార్టీ అనే నినాదాన్ని మొత్తం దేశానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగమే దళితులతో క‌లిసి ఓవైసీ జై భీం అంటున్నారు.

2014 ముందు వ‌ర‌కు, హైద‌రాబాద్ మీద‌నే ఫోక‌స్ చేసిన మ‌జ్లిస్ పార్టీ, ఆ త‌ర్వాత నుంచి జాతీయ రాజ‌కీయాల మీద దృష్టి సారించింది. ఏపీ మొద‌లు క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, బిహార్ స‌హా ప‌లు రాష్ట్రాల్లో విస్త‌రించాల‌న్న ఆలోచ‌న‌తో దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తూ ఎక్క‌డ ఎలాంటి ఎన్నిక‌లు జ‌రిగినా త‌మ పార్టీ త‌ర‌ఫున అభ్య‌ర్థుల్ని రంగంలోకి దింపుతూ త‌మ ఉనికి చాటుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు.

బాబ్రీ వివాదం, లవ్ జిహాద్ కేసులు, పౌరసత్వ సవరణ చట్టం, పౌర నమోదు పట్టిక ఇలా అన్ని అంశాలను పార్లమెంటులో ఒవైసీ స్వరం చాలాసార్లు ధ్వనించింది. ఆయన చాలా మంది కంటే పార్లమెంటులో మెరుగ్గా మాట్లాడతారు. భార‌త దేశ‌వ్యాప్తంగా ఎంఐఎం పార్టీకి ప్రజాదరణ పెరుగుతుంది.

ప్ర‌స్తుతం ఎంఐఎంకు వున్న రాజ‌కీయ బ‌లంః

తెలంగాణాః 7 ఎమ్మెల్యేలు + 2 ఎమ్మెల్సీలు + ఒక ఎం.పి.హైద‌రాబాద్‌తో స‌హా తెలంగాణాలో కార్పొరేట‌ర్లు + కౌన్సిల‌ర్లు=150

బీహార్ః 5 ఎమ్మెల్యేలు

మ‌హారాష్ట్రః 1 ఎమ్మెల్యే, కార్పొరేట‌ర్లుః 126 + 85 కౌన్సిల‌ర్లు + 1 మున్సిప‌ల్ ఛైర్మ‌న్‌

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ః 1 మున్సిప‌ల్ ఛైర్మ‌న్, కౌన్సిల‌ర్లు + జ‌డ్పీటీసి స‌భ్యులు = 200

గుజ‌రాత్ః కార్పొరేట‌ర్లు + కౌన్సిల‌ర్లు = 40

మ‌ధ్య‌ప్ర‌దేశ్ః కార్పొరేట‌ర్లు + కౌన్సిల‌ర్లు = 25

ఎంఐఎం పార్టీ ఫుల్ టీంతో పార్టీ శాఖ‌లుః

1. త‌మిళ‌నాడు, 2. క‌ర్నాట‌క‌, 3. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, 4. పాండిచ్చేరి, 5. మ‌హారాష్ట్ర 6. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, 7. జార్ఖండ్‌, 8. వెస్ట్‌బెంగాల్‌, 9. బీహార్‌, 10. ఢిల్లీ, 11. గుజ‌రాత్‌, 12.ఉత్త‌ర‌ఖండ్‌.

1962లో జరిగిన ఎన్నికల్లో ఒక్క సభ్యుడితో అసెంబ్లీలోకి అడుగుపెట్టింది మొదలు, ఆ తర్వాత ప్రతీ ఎన్నికల్లోనూ మజ్లిస్ తన ఎమ్మెల్యేలను సభలోకి పంపుతూనే ఉంది. ప్రస్తుత సభలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. పదేళ్ల క్రితం ఎమ్మెల్సీలను కూడా గెల్చుకుని మండలిలోకి కూడా అడుగుపెట్టింది. సమైక్య రాష్ట్రంలోనే రాష్ట్రస్థాయి రాజకీయ పార్టీగా గుర్తింపు పొందిన మజ్లిస్, ఆ తర్వాత మహారాష్ట్రలోనూ ఎమ్మెల్యేలను గెల్చుకుని అక్కడ కూడా గుర్తింపు పొందింది. చివరకు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మజ్లిస్ పార్టీకి కామన్ సింబల్ కూడా దక్కింది. స్థానిక సంస్థల ఎన్నికల మొదలు పార్లమెంటు ఎన్నికల వరకు ఒకే గుర్తుపై పోటీచేసే వెసులుబాటు లభించింది.

ఎంఐఎం పార్టీ అధ్యక్షుడిగా సలావుద్దీన్ ఒవైసీ ఉన్నంత కాలం వరుసగా ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత అసదుద్దీన్ ఒవైసీ నాలుగుసార్లు గెలిచారు. ముస్లిం జ‌నాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేయడం ద్వారా ఇతర పార్టీలకు పడే ఓట్లను చీల్చుతూ పరోక్షంగా తాము సహకారం అందిస్తున్న పార్టీ విజయానికి కారణమవుతోంది.

బిహార్ అసెంబ్లీలో ఐదు స్థానాల్లో విజయం సాధించడంతో.. తెలంగాణ, మహారాష్ట్ర తర్వాత మూడో రాష్ట్రంలో పార్టీ ఖాతా తెరిచినట్లు అయింది. అంతేకాదు ఇప్పుడు తెలంగాణ తర్వాత పార్టీకి ఎక్కువ సీట్లు ఉన్నది బిహార్‌లోనే. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, త‌మిళ‌నాడు ఎన్నికల్లోనూ తమ అదృష్టం పరీక్షించుకోవాలని ఎంఐఎం భావిస్తోంది.

"ఏ ఎన్నిక‌లు చూసినా మెజార్టీ స్థానాల్లో కేవ‌లం 500 లోపు ఓట్ల‌తో భార‌తీయ జ‌న‌తా పార్టీ అభ్య‌ర్థులు గెలుస్తున్నారు. అందుకు ప్ర‌ధాన కార‌ణం మ‌జ్లిస్ పార్టీ ఎన్నిక‌ల బ‌రిలో వుండ‌ట‌మే. బీజేపీయే దేశ‌వ్యాప్తంగా ఎంఐఎంను ప్ర‌మోట్ చేస్తుంది. వ‌న‌రుల్ని స‌మ‌కూర్చుతోంది," అని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ చ‌ల‌సాని న‌రేంద్ర ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో తెలిపారు.

"ఇప్పుడు ఓవైసీ పాత‌బ‌స్తీ నేత‌కాదు. జాతీయ నేత‌. కాంగ్రెస్‌ను బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డంలో బిజెపి ఆడే పొలిటిక‌ల్ గేమ్‌లో ఎంఐఎం కీల‌క పాత్ర పోషిస్తోంది. ఎంఐఎం రాక‌ముందు ముస్లిం ఓట్లు చీల్చ‌డానికి యు.పి.లో మాయావ‌తిని వాడేవాళ్ళు. ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఎక్క‌డ అవ‌స‌ర‌మైతే అక్క‌డ ఎంఐఎంను వాడుకుంటున్నారు," అని చ‌ల‌సాని న‌రేంద్ర చెప్పారు.

మ‌జ్లిస్ పార్టీ త‌న వ్య‌వ‌స్థాగ‌త సిద్ధాంతాల‌ను వ‌దిలి పెట్టి బీజేపీతో మిలాఖ‌త్ కావ‌డం, బీజేపీ ప్రయోజ‌నాల‌కు గొడుగు ప‌డుతోంద‌న్న అపప్ర‌ద‌ను మూట‌గ‌ట్టుకుంటోంది. ఒక‌ప్పుడు మ‌జ్లిస్ వేరు. ఇప్పుడు వేరు అనే టాక్ ఓల్డ్ సిటీలోనూ వినిపిస్తోంది.

"మ‌జ్లిస్ పార్టీ నేత‌ల 1980 నాటి ప్ర‌సంగాల‌కు, ఇప్ప‌ట్టి ప్ర‌సంగాల మ‌ధ్య చాలా తేడా వుంది. అప్ప‌ట్లో 'మతం' గురించి మాట్లాడేవారు. ఇప్పుడు 'దేశ‌భ‌క్తి, ప్రగతిశీల భావజాలం, అభివృద్ధి' అంశాల‌పై మాట్లాడుతున్నారు. 24 గంట‌లు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో వుండ‌టం, హైద‌రాబాద్ పార్టీ కార్యాల‌యంలో ప్ర‌తి రోజూ దారుస‌లాం ద‌ర్బార్ నిర్వ‌హిస్తూ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల ఫిర్యాదులు తీసుకోవ‌డం స‌మ‌స్య‌ల్ని తీర్చ‌డంలో ఆపార్టీ నేత‌లు ఓ ఉద్యోగంలా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. 'దారుస‌లాం ద‌ర్బార్' మోడ‌ల్ ను త‌మ పార్టీ శాఖ‌లున్న 12 రాష్ట్రాల్లో అమ‌లు చేస్తుండ‌టం వ‌ల్ల ఎంఐఎం పార్టీ దేశ‌వ్యాప్తంగా త‌న ఉనికిని చాటుకుంటుంది," అని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ గౌరీ శంక‌ర్ ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో తెలిపారు.

ఇటీవ‌ల జ‌రిగిన మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో గాలిపటం గుర్తుతో పోటీ చేసి మ‌జ్లిస్ పార్టీ గట్టిగా తన ఉనికిని చాటింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తర్వాత, మహారాష్ట్రలోనూ తమది చిన్న పార్టీ కాదని నిరూపించుకుంది. అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలో 29 మున్సిపల్ కార్పొరేషన్లలో పోటీ చేసి 126 సీట్లు గెలుచుకుంది.

ఔరంగాబాద్, మాలేగావ్, నాందేడ్, నాగ్‌పూర్, ముంబయి లాంటి ప్రధాన నగరాల్లో AIMIM బలంగా నిలిచింది. 13 కార్పొరేషన్లలో ఆ పార్టీ అభ్యర్థులు గణనీయమైన విజయాన్ని సాధించారు. మహారాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తూ లౌకిక పార్టీల ఓటు బ్యాంకుకు గండి కొడుతోంది మ‌జ్లిస్ పార్టీ. మరాఠా గడ్డపై మజ్లిస్ సాధించిన విజ‌యం భవిష్యత్ ఎన్నిక‌ల్లో దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ సమీకరణాలను మార్చే అవకాశం స్ప‌ష్టంగా కనిపిస్తోంది.

2024 లోక్‌సభ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. ఎంపీ సయ్యద్ ఇమ్తియాజ్ జలీల్ ఓడిపోయారు. అదే ఏడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 16 చోట్ల పోటీ చేసి కేవలం మాలేగావ్ సెంట్రల్‌లో ఒక్క సీటే గెలిచింది. అప్పుడు చాలామంది ఇక్కడితో AIMIM కథ ముగిసిందనుకున్నారు.

ముఖ్యంగా ఛత్రపతి శంభాజీనగర్ గా పేరు మార్చిన ఔరంగబాద్, మలేగావ్ ప్రాంతాల్లో మజ్లిస్ జయభేరి మోగించింది. ఛత్రపతి సంభాజీనగర్ (ఔరంగాబాద్‌) మున్సిపల్‌ కార్పొరేషన్‌లో గతంలోకంటే అధికంగా 33 స్థానాలు దక్కించుకుని రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక్క‌డ‌ కాంగ్రెస్, ఇరు ఎన్సీపీలు, ఇరు శివసేనల కంటే అధిక స్థానాలు దక్కించుకుంది. మాలేగావ్‌లో 20 స్థానాలు దక్కించుకోగా నాందేడ్‌లో 15, అమ‌రావతిలో 12, ధులేలో 10 చోట్ల విజ‌యం సాధించింది. ముంబైలో 8, షోలాపూర్‌లో 8, నాగ‌పూర్‌లో 6, థానేలో 5 స్థానాల్లో గెలిచింది. అకోలా (3), జాల్నా (2), అహ్మ‌ద్‌న‌గ‌ర్ (2) ల‌లో ఉనికిని చాటుకుకుంది. చంద్రాపూర్‌లో మొట్టమొదటి సారిగా ఒక్కస్థానం దక్కించుకుని బోణి కొట్టింది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సైతం 8 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ తన ఉనికిని చాటుకుంది. అటు సోలాపూర్, ధూలే , నాందేడ్ కార్పొరేషన్లలో తలో 8 సీట్ల చొప్పున మొత్తం 24 స్థానాలను గెలుచుకుని ఆయా నగరాల పాలక వర్గాల్లో కీలక శక్తిగా ఎదిగింది.

విదర్భ, థానే ప్రాంతాల్లో కూడా ఎంఐఎం తన ప్రభావం చూపింది. అమరావతిలో 6, థానేలో 5, నాగపూర్‌లో 4 స్థానాలను కైవసం చేసుకోగా.. చంద్రపూర్‌లోనూ ఒక సీటును గెలుచుకుంది. మహారాష్ట్రలోని మొత్తం 2,869 వార్డులకుగానూ 1,388 సీట్లను బీజేపీ, 364 సీట్లను శివసేన (షిండే), 150 సీట్లను ఎన్‌సీపీ(అజిత్) గెల్చుకున్నాయి.కాంగ్రెస్ 306 సీట్లను, శివసేన (ఉద్ధవ్) 166 సీట్లను దక్కించుకున్నాయి. మజ్లిస్ పార్టీ 126 సీట్లలో గెలిచింది.

దేశంలో ముస్లింలపై ఏ చిన్న సంఘటన జరిగినా, వారికి అండగా గట్టిగా వాదిస్తూ, వార్తల్లో ప్రముఖంగా నిలుస్తారు అస‌దుద్దీన్ ఓవైసీ. తాము దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నామని ఒవైసీ పదే పదే చెబుతారు. చెప్పడమే కాదు, పలు రాష్ట్రాల జరిగిన ఎన్నికల్లోనూ పోటీ చేశారు. కొన్ని స్థానాల్లోనూ గెలిచారు.

హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ పార్టీ దేశమంతటా విస్తరిస్తోంది. ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు చేసినట్లు కనిపించకపోయినా దేశ రాజకీయాల్లో మజ్లిస్ పార్టీ పాత్రను విస్మరించలేం. నిజానికి ఎంఐఎం పార్టీ కీలక నాయకుడు 'ఖాసిం రజ్వీ' చివరి కోరిక కూడా ఇదే. ఏదో ఒక రోజు ఢిల్లీ కేంద్రంగా 'ఎంఐఎం' పార్టీ పాలించాలని అతడు ఆకాక్షించాడు. ఎంఐఎం పార్టీ స్థాపకుడు 'నవాబ్ బహదూర్ యార్ జంగ్' నుంచి నేటి 'అసదుద్దీన్ ఒవైసీ' వరకూ ఇదే లక్ష్యంతో పార్టీని నడుపుతున్నారు. రాష్ట్రంలో కింగ్ మేకర్‌లా అవతరించడం, దేశంలో బలం పెంచుకోవడం. ఈ రెండూ ఎంఐఎం పార్టీ ప్రధాన లక్ష్యాలు.

Read More
Next Story