
రాజ్‌నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం
రాష్ట్రపతి ముర్ముతో భేటీ అయిన అమిత్ షా, జైశంకర్
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం గురువారం (ఏప్రిల్ 24) సాయంత్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దాడి ఘటనపై వివిధ రాజకీయ పార్టీల నాయకుల అభిప్రాయాలను తెలుసుకోనుంది.
ఎన్నికల నేపథ్యంలో బీహార్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర ఈ సమావేశానికి హాజరుకాకపోవచ్చు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో హోం మంత్రి అమిత్ షా నాయకులనుద్దేశించి మాట్లాడనున్నారు. ఇదిలా ఉండగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఈరోజు రాష్ట్రపతి(President) ద్రౌపది ముర్మును కలిశారు.
పాక్‌తో సింధు నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు నిన్న కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. పాక్ జాతీయులకు అన్ని వీసాలను రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇందుకు ప్రతిగా పాక్ సైతం భారత విమానాలకు గగనతలాన్ని మూసివేయడం వంటి చర్యలు తీసుకుంది. ఇరుదేశాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో అమిత్ షా, జైశంకర్ రాష్ట్రపతి భేటీ కావడం కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. పహల్గామ్ ఉగ్ర దాడి ఘటనకు సంబంధించి పలు అంశాలను ఆమెకు వివరించినట్లు సమాచారం.
మోదీ వార్నింగ్..
ఎన్నికల నేపథ్యంలో బీహార్‌లో ఉన్న ప్రధాని మోదీ ఉగ్రవాదులకు తీవ్ర హెచ్చరిక చేశారు. దాడిలో పాల్గొన్న ప్రతి ఉగ్రవాదిని, వారికి మద్దతు ఇస్తున్న వారికి వదిలిపెట్టేది లేదని అన్నారు. "ఈ దాడి కేవలం నిరాయుధ పర్యాటకులపై మాత్రమే కాదు, యావత్ భారతావనిపై జరిగిన దాడి" అని పేర్కొన్నారు. ప్రసంగానికి ముందు 26 మంది పహల్గామ్ మృతులకు సంతాపసూచకంగా నిమిషం మౌనం పాటించారు.