ఆప్ అగ్రనాయకత్వమంతా జైల్లోనే!
x
కేజ్రీవాల్ ఫైల్ ఫోటో

ఆప్ అగ్రనాయకత్వమంతా జైల్లోనే!

కేజ్రీవాల్ సహా 14 మంది అరెస్ట్ అయ్యారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వమంతా జైల్లోకి చేరినట్టుయింది. ఇప్పుడు పార్టీని ఎవరు నడిపిస్తారనేది తేలాల్సి ఉంది..


ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడంతో ఆ పార్టీలోని ప్రధానమైన నాయకత్వమంతా అరెస్ట్ అయినట్టయింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 14 మంది నాయకులు అరెస్ట్ అయ్యారు. కేజ్రీవాల్ అరెస్ట్ కి ముందు ముగ్గురు పెద్ద నాయకులు – ఇద్దరు ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, సత్యేందర్‌ జైన్‌ అరెస్ట్ అయ్యారు. ఇటీవల ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత – అరెస్ట్ అయ్యారు. ఒక దర్యాప్తు సంస్థ తర్వాత మరొకటి రంగంలోకి దిగి నిందితుల్ని వెంటాడుతున్నాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్- సీబీఐ- 2022 నవంబర్ 25న ఏడుగురు నిందితులపై చార్జిషీట్ దాఖలు చేసింది. గురుగ్రామ్‌కు చెందిన వ్యాపారవేత్త అమిత్ అరోరాను 2022 నవంబర్ 30న ఈడీ అరెస్టు చేసింది.

2022 సెప్టెంబర్ లో ఆప్ కమ్యూనికేషన్స్ హెడ్ విజయ్ నాయర్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. 2023 జనవరి6 న ఈడీ తన ఛార్జిషీట్‌లో ఈ కేసుకు సంబంధించి 12 మంది నిందితులను పేర్కొనగా, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను మార్చి 2023లో ఈడీ అదుపులోకి తీసుకుంది.

2023 అక్టోబర్ లో ఆప్ నాయకుడు సంజయ్ సింగ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయగా ఈ ఏడాది మార్చి 16న ఈడీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె కవితను అరెస్టు చేసింది. 2024 మార్చి 21న కేంద్ర దర్యాప్తు సంస్థ-ఈడీ- కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది. అరెస్టయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను శుక్రవారం ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో హాజరుపరుస్తారు. ఎక్సైజ్ పాలసీ కేసులో రెండు కేసులు ఉన్నాయి - ఒకటి సిబిఐ దాఖలు చేయగా మరొకటి మనీలాండరింగ్‌ కి సంబంధించింది. దీన్ని ఈడీ నమోదు చేసింది.పాలసీ రూపకల్పనలో విధానపరమైన లోపాలున్నాయని ఆరోపిస్తూ 2022 జూలైలో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వినయ్ కుమార్ సక్సేనాకు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

ఎక్సైజ్ మంత్రి హోదాలో అప్పటి ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా 'ఏకపక్ష విధానాలు, నిర్ణయాలు' తీసుకున్నారని, దీనివల్ల 'ఖజానాకు సుమారు 580 కోట్ల రూపాయల ఆర్థిక నష్టం' వచ్చిందని సక్సేనా తన నివేదికలో పేర్కొన్నారు. సిసోడియా సహా 14 మంది పేర్లను సిబిఐ తన చార్జిషీటులో నమోదు చేసింది. ఈడీ తన కేసులో ఆర్ధిక నష్టం రూ.292 కోట్లకు కుదించింది. ED తన మొదటి ఫిర్యాదులో ఆప్ నాయకులు 'సౌత్ గ్రూప్'గా గుర్తించిన వ్యక్తుల నుంచి ₹100 కోట్ల వరకు ముడుపులు అందుకున్నారని ఆరోపించింది.

Read More
Next Story