అంబటి రాయుడు... పొలిటికల్ పిచ్ పై డకౌట్
ఆ ముచ్చటా తీరింది. క్రీడా రాజకీయాలను తట్టుకోలేక అనేక సార్లు అనూహ్య నిర్ణయాలు తీసుకున్న రాయుడు రాజకీయ ఆరంగేట్రం చేస్తే అది కాస్తా పురిట్లోనే సంధి కొట్టింది..
“సింగడు అద్దంకి పోనూ పోయాడు, రానూ వచ్చాడు” అని తెలుగులో ఓ సామెత ఉంది. ఇప్పుడది ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడికి అచ్చుగుద్దినట్టు సరిపోయేలా ఉంది. రాజకీయ పిచ్ పై బ్యాటింగ్ మొదలు పెట్టకముందే డకౌట్ అయ్యారు. రాజకీయాల్లో భవిష్యత్ ఆటాడాలనుకున్న అంబటి రాయుడు టైమ్ అవుట్ బౌల్డ్ కావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. రాయుడికి తొందరెక్కువన్నది మరోసారి రుజువైనట్టయింది. రాజకీయ ముచ్చట వారం రోజులు తిరక్క ముందే తీరింది. డిసెంబర్ 28న ఏపీ సీఎం వైఎస్ జగన్ తో వైసీపీ కండువా కప్పించుకున్న అంబటి రాయుడు జనవరి 6న కాడి కింద పడేశారు.
షాక్ వైసీపీకా.. రాయుడికా...
ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైసీపీకి అంబటి రాయుడు షాకిచ్చారని ఓ వర్గం అంటున్నా రాయుడికే షాక్ తగిలిందంటోంది మరోవర్గం. ఇవన్నీ ఎలా ఉన్నా.. పార్టీని వీడుతున్నట్లు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రకటించారు. ‘‘రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. త్వరలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా’’ అని ట్విట్ చేశారు. వారం కిందట సీఎం జగన్ సమక్షంలో అంబటి రాయుడు వైసీపీలో చేరారు. ఆయన చేరికతో కాపు సామాజిక వర్గం ఓట్లని వైసీపీ వైపు అనే టాక్ కూడా వచ్చింది. ఇంతలో ఏమైందో ఏమో రాయుడు చేసిన ట్వీట్ ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సంచలనమే అయింది.
మరో పార్టీలో చేరతారా?
వైసీపీ నుంచి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తప్పుకున్నారు. అయితే ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏమిటన్నది చర్చనీయాంశమైంది. కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగా ఉంటాననే దానికి అర్థం ఏమైఉంటుందన్న చర్చ ప్రారంభమైంది. “అంబటి రాయుడికి ఆది నుంచి తొందరెక్కువే. రాజకీయాల్లోకి రాయుడు లాంటి షార్ట్ టెంపర్ మనుషులు పనికి రారు. నిజంగానే రాజకీయాల్లో ఉండాలనుకుంటే కాసంత్త ఓర్పు , సహనం ఉండాలి” అన్నారు క్రీడా విశ్లేషకులు కె.రామమోహన్ నాయుడు. ఇతర పార్టీలో చేరబోనని అంబటి రాయుడు సంకేతాలు ఇచ్చినా ఒకసారి రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై ఆలోచించడమే మంచిదంటారు రామమోహన్ నాయుడు.
డిసెంబర్ 28న పార్టీలో చేరిన అంబటి
అంబటి రాయుడు డిసెంబర్ 28న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అసెంబ్లీ లేదా లోక్ సభకు పోటీ చేస్తారని పార్టీలో జోరుగా ప్రచారం జరిగింది. ఇంతలో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం తీవ్ర కలకలం రేపింది. వైసీపీలో చేరకముందు జగన్ సర్కార్ చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సంక్షేమ కార్యక్రమాలు నచ్చడంతోనే వైసీపీలో చేరానని ఆ సమయంలో ప్రకటించారు.
రాజీనామా ఎందుకంటే..?
గుంటూరు నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని అంబటి రాయుడు అనుకున్నారు. టికెట్ ఇచ్చే విషయమై పార్టీ నుంచి హామీ రాలేదు. గుంటూరు సీటును రెడ్డి లేదా కమ్మ సామాజికవర్గాల వారికి ఇవ్వాలన్నది వైసీపీ వూహం. అంబటి రాయుడు కాపుసామాజిక వర్గానికి చెందిన వారు. నిజానికి గుంటూరు లోక్ సభ నియోజకవర్గంలో కాపులు ఎక్కువే అయినా ఎందుకో వైసీపీ కమ్మ, రెడ్డి సామాజికవర్గాల వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండగా ఆలస్యం చేయడం ఎందుకని పార్టీని వీడే నిర్ణయం తీసుకొని ఉంటారని విశ్లేషిస్తున్నారు.
గుంటూరు లోక్ సభ ఎందుకు కోరుకున్నారంటే..?
అంబటి రాయుడు స్వస్థలం గుంటూరు జిల్లా. ఏపీలో బలమైన సామాజిక వర్గం కాపు కులానికి చెందినవారు. క్రికెట్‌లో రాణించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఫామ్‌లో ఉండగానే రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాలపై ఆసక్తి కనబరిచారు. వైసీపీలో చేరి, ఆ వెంటనే రాజీనామా చేశారు. సామాజిక వర్గాన్ని బట్టి చూస్తే జనసేన లేదా తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది. ప్రస్తుత గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మరోసారి లోక్ సభకు పోటీ చేయనని అంటున్నారు. దీంతో టీడీపీలో చేరితే రాయుడుకు టికెట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు
జగన్ ఏమి చెప్పారంటే...
గుంటూరు ఎంపీ టికెట్ కేటాయిస్తామన్న హామీతోనే అంబటి రాయుడు వైకాపాలో చేరారు. అయితే, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలుని గుంటూరు స్థానానికి మారాల్సిందిగా జగన్ ప్రతిపాదించారు. ఆ స్థానాన్ని బీసీ అభ్యర్థికి కేటాయించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. దీనికి ఏమాత్రం అంగీకరించని శ్రీకృష్ణదేవరాయలు తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో గుంటూరు స్థానాన్ని ఆశించిన రాయుడు.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమైంది.