
సీఎంలకు అమిత్ షా ఫోన్..
పాకిస్తానీ జాతీయులను గుర్తించి తిరిగి పంపించేయాలన్న కేంద్రం హోం మంత్రి ..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. గడువులోగా ఏ పాకిస్థానీ కూడా దేశంలో ఉండటానికి వెళ్లేదని వారికి చెప్పారు. పహల్గామ్(Pahalgam)లో ఉగ్రదాడి (Terror Attack) తర్వాత ప్రధాని మోదీ (PM Modi) తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఇదీ ఒకటి. మంగళవారం పహల్గామ్‌కు 5 కిలోమీటర్ల దూరంలోని బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రమూకలు దాడికి పాల్పడిన ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏప్రిల్ 27 నుంచి పాకిస్తాన్ జాతీయులకు జారీ చేసిన అన్ని వీసాలను రద్దు చేస్తున్నట్లు భారతదేశం గురువారం ప్రకటించింది. పాకిస్తాన్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులంతా వీలైనంత త్వరగా స్వదేశానికి తిరిగి రావాలని సూచించింది.
పాక్‌పై కఠిన చర్యలకు క్యాబినెట్ కమిటీ ఆమోదం..
పహల్గామ్‌లో ఉగ్రవాదులు 26 మంది అమాయకుల ప్రాణాలను పొట్టనపెట్టుకోవడంపై భారత్ రగిలిపోతోంది. ఈ క్రమంలో పాక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ నిర్ణయించింది. దీంతో సింధూ జలాల ఒప్పందం నిలిపివేతతో పాటు.. పాక్ జాతీయులు భారత్‌ను వీడాలని నిర్ణయం తీసుకుంది. మెడికల్ వీసాలు పొందిన వారికి మాత్రం ఏప్రిల్ 29వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. పాక్ నుంచి కొత్త దరఖాస్తుదారులకు వీసా సర్వీసులను తక్షణమే నిలిపివేశామని విదేశాంగ శాఖ పేర్కొంది.
ఇప్పటికే తిరుగు ప్రయాణమైన పాకిస్థానీయులు..
భారత ప్రభుత్వ హెచ్చరికతో అనేక మంది పాక్ జాతీయులు ఇప్పటికే పంజాబ్‌లోని అటారీ- వాఘా సరిహద్దు గుండా తమ దేశానికి తిరుగు ప్రయాణమయ్యారు వివిధ కారణాల దృష్ట్యా భారత్‌లో పర్యటిస్తున్న పాక్ జాతీయుల్లో కొందరు గురువారం అటారీ- వాఘా సరిహద్దు గుండా వెనక్కు వెళ్లిపోయారు. తమ బంధువులను కలుసుకునేందుకు 45 రోజుల వీసా గడువుపై భారత్‌కు వచ్చామని, ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కరాచీకి చెందిన ఓ కుటుంబం తెలిపింది. కేంద్ర ఆదేశాల మేరకు బుధవారం అధికారులు అటారీ- వాఘా సరిహద్దును మూసివేసిన విషయం విధితమే.