
‘ఆర్జేడీ అధికారంలోకి వస్తే మళ్లీ ఆటవిక పాలనే..’
బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి పాలనలో ఆమె సోదరుడు సాధు యాదవ్ గోపాల్‌గంజ్‌లో చేసిన దురాగతాలను గుర్తుచేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
బీహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికల(Assembly Polls) నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) రాష్ట్రీయ జనతాదళ్ (RJD) విరుచుకుపడ్డారు. ఆర్జేడీ అధికారంలోకి వస్తే తిరిగి "అటవిక రాజ్యం" చూడాల్సి వస్తుందని ప్రజలను హెచ్చరించారు. వాస్తవానికి ఆయన శనివారం గోపాల్‌గంజ్ జిల్లాలో ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగించాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో వర్చువల్‌గా మాట్లాడారు.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి(Rabri Devi) పాలన గురించి షా విమర్శలు గుప్పించారు. ఆమె సోదరుడు సాధు యాదవ్ గతంలో ఎన్నో దురాగతాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. గోపాల్‌గంజ్ నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నికయిన యాదవ్.. తన సోదరి పాలనలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని చెప్పారు. 1999లో రబ్రీ దేవి పెద్ద కుమార్తె మిసా భారతి వివాహం సందర్భంగా షోరూమ్ నుంచి కార్లను బలవంతంగా తీసుకెళ్లాడని ఆరోపించారు. ఈ ఘటన గురించి ప్రధాని మోదీ కూడా ఇటీవల ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు. అయితే ఆయన నేరుగా పేరు బయటపెట్టలేదు.
"2002 తర్వాత గోపాల్‌గంజ్ ప్రజలు ఎప్పుడూ ఆర్జేడీకి ఓటు వేయలేదు. వారు ఆ ట్రెండ్‌ను కొనసాగిస్తారని నేను అనుకుంటున్నాను. సాధు యాదవ్ దుష్చర్యల గురించి గోపాల్‌గంజ్ ప్రజల కంటే ఇంక ఎవరికి బాగా తెలియదు’’ అని షా పేర్కొన్నారు.
శిల్పి గౌతమ్ హత్య కేసులో కూడా యాదవ్ పేరు బయటకొచ్చింది. ఈ కేసులో అప్పటి ఆర్జేడీ నాయకుడు, ప్రస్తుతం బీజేపీలో ఉన్న సామ్రాట్ చౌదరి హస్తం ఉందని జన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఇటీవల ఆరోపించారు.
ఐదు నిమిషాలకు పైగా మాట్లాడిన షా..అధికార ఎన్డీఏ మ్యానిఫెస్టోను పునరుద్ఘాటించారు.

