
S.I.R విధుల్లో మరో BLO మృతి..
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘటన..
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (S.I.R) విధుల్లో ఉన్న ఓ బూత్ లెవర్ ఆఫీసర్ (B.L.O) మృతిచెందారు. మెదడులో రక్తస్రావం జరగడంతో ఆయన ప్రాణాలొదిలారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh)లో జరిగింది. మోదీ సైన్స్ అండ్ కామర్స్ ఇంటర్మీడియట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న 58 ఏళ్ల లాల్ మోహన్ సింగ్‌ను సాహిబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం BLOగా నియమించారు. విధుల్లో భాగంగా ఇంటింటికీ తిరిగి ఓటరు జాబితాలో ఉన్న వారి వివరాలను పరిశీలించడం ఆయన పని. ఈ క్రమంలో పని ముగించుకుని మోదీనగర్‌లోని తన ఇంటికి చేరుకున్న మోహన్ సింగ్ శుక్రవారం రాత్రి చనిపోయారు. మెదడులో రక్తస్రావం జరిగి చనిపోయినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారులు కూడా ఇదే విషయం చెప్పారు. అయితే కాలేజీ ప్రిన్సిపాల్ సతీష్ చంద్ అగర్వాల్ విలేఖరులతో మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా S.I.R పూర్తి చేయాలన్న అధికారుల ఒత్తిడి వల్లే సింగ్ చనిపోయారని పేర్కొన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌తో సహా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఎలక్షన్ కమిషన్ ఉపాధ్యాయులతో SIR చేయిస్తున్న విషయం తెలిసిందే.
గుజరాత్‌లో..
గుజరాత్ రాష్ట్రంలో ఐదుగురు ఉపాధ్యాయులు మరణించారు. నవంబర్ 22న ఇద్దరు అసిస్టెంట్ బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) గుండెపోటుతో మరణించారు. మృతుల్లో 56 ఏళ్ల కల్పనాబెన్ పటేల్, 50 ఏళ్ల ఉషాబెన్ సోలంకి ఉన్నారు. గర్భిణీ ఉపాధ్యాయినులకు, 50 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిని, దివ్యాంగ ఉపాధ్యాయులకు S.I.R విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గుజరాత్‌లోని అఖిల్ భారతీయ రాష్ట్రీయ షేక్షిక్ మహాసంఘ్ (ABRSM) జాతీయ ఉపాధ్యాయ సంఘం గుజరాత్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హిరేన్ వ్యాస్ చెప్పారు.

