ఆర్‌జీ కర్ ప్రిన్సిపాల్‌పై మరో కేసు
x

ఆర్‌జీ కర్ ప్రిన్సిపాల్‌పై మరో కేసు

‘అనాథ శవాలను ప్రైవేటు ఆసుపత్రులకు అమ్ముకునేవాడు. ఆసుపత్రి చేపట్టే పనుల్లో 20 శాతం కమీషన్ ఆశించేవాడు’ - ఆర్‌జీ కర్ కాలేజీ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ.


కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచార, హత్య ఘటన దేశాన్ని కుదిపేసింది. ఆగస్టు 9న జరిగిన ఈ ఘటనలో నిందితుడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కేసు విచారణలో జాప్యంపై మండిపడ్డ హైకోర్టు కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)తో కాకుండా సీబీఐతో విచారణ జరిగించాలని ఆదేశించడంతో కేంద్ర దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో ఆర్‌జీ కర్ ప్రిన్సిపాల్‌ సందీప్ ఘోస్‌ను సీబీఐ అధికారులు పలు దఫాలుగా ప్రశ్నించారు. ఘటన తర్వాత తల్లిదండ్రులకు ఎందుకు ఆలస్యంగా సమాచారం ఇచ్చారు? ప్రిన్సిపాల్ ఫోన్లో ఎవరెవరితో మాట్లాడారు? అన్న కోణంలో విచారిస్తోంది.

సరిగ్గా ఇదే సమయంలో కాలేజీ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ ప్రిన్సిపాల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘అనాథ శవాలను ప్రైవేటు ఆసుపత్రులకు అమ్ముకునేవాడు. ఆసుపత్రి చేపట్టే పనుల్లో 20 శాతం కమీషన్ ఆశించేవాడు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల నుంచి లంచం తీసుకుని పాస్ చేయించేవాడు. గ్లౌజులు, సిరంజీలను రీ సైక్లింగ్ చేయించి వాటిని బంగ్లాదేశ్ వ్యాపారులకు అమ్ముకునేవాడు. 2023లో ఘోష్‌ చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి విజిలెన్స్ విభాగానికి తెలిపినా ఏ చర్య తీసుకోలేదు’ అని పేర్కొనడంతో ప్రిన్సిపాల్ ఆర్థిక లావాదేవీలపై సీబీఐ దృష్టి పెట్టింది. సిట్ అధికారులు శనివారం (ఆగస్టు 24) నిజాం ప్యాలెస్‌లోని సీబీఐ కార్యాలయానికి చేరుకుని కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను సమర్పించడంతో సీబీఐ అవినీతి నిరోధక శాఖ ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేసింది.

Read More
Next Story