
బంగ్లాదేశ్‌లో మరో హిందువు మృతి..
ఘటనను మతపర కోణంలో చూడొద్దని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనుస్ కార్యాలయం నుంచి ప్రకటన
బంగ్లాదేశ్(Bangladesh)లో హిందూ(Hindu) సమాజానికి చెందిన మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాజ్‌బరీ జిల్లా పంగ్షా ఉపజిలాలో బుధవారం (డిసెంబరు 24) జరిగింది. 29 ఏళ్ల అమృత్ మండల్ అలియాస్ సామ్రాట్‌ను కొంతమంది స్థానికులు మూకుమ్మడిగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ మందాల్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మోండల్ మృతదేహాన్ని శవపరీక్ష కోసం రాజ్‌బరి సదర్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటన తర్వాత ఒక వ్యక్తిని అరెస్టు చేసి అతని నుంచి తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు.
‘మతం రంగు పులమొద్దు..’
కాగా అమృత్ మందాల్ పలు క్రిమినల్ కేసులు నిందితుడని, వ్యక్తిగత వివాదాలే దాడికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనుస్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దాడిని మతపరమైన కోణంలో చూడొద్దని కోరింది. వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనగా పేర్కొంది. బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
చంద్రదాస్ ఘటన మరువక ముందే..
దైవదూషణ ఆరోపణలపై మైమెన్‌సింగ్‌లో గతవారం హిందూ యువకుడు దీపు చంద్ర దాస్‌ను స్థానిక జన సమూహం కొట్టి చంపి, అతని శరీరానికి నిప్పుపెట్టింది. ఆ ఘటనతో బంగ్లాదేశ్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం దాస్ కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చింది.
మానవ హక్కుల సంఘాల ఆందోళన..
బంగ్లాదేశ్‌లో జరుగుతోన్న దాడుల్లో హిందు సమాజానికి చెందిన వ్యక్తులు ప్రాణాలు కోల్పోతుండడంపై మానవ హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దాడులపై లోతుగా విచారించి పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నాయి. అయితే అమృత్ మందాల్ మృతిపై దర్యాప్తు జరుగుతోందని బంగ్లాదేశ్ పోలీసులు తెలిపారు.

