మమతకు మరో సమస్య..దక్షిణ బెంగాల్‌లోకి వరద నీరు
జార్ఖండ్‌లోని తెనుఘాట్ డ్యాం నుంచి 3.5 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేయడంతో దక్షిణ బెంగాల్‌ను వరదలు ముంచెత్తాయి.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కష్టాలు ఇప్పుడిప్పుడే తీరేలా కనిపించడం లేదు. కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుప్రతిలో ట్రైనీ డాక్టర్ ఆత్మహత్య, హత్య ఘటనకు నిరసనగా జూనియర్ డాక్టర్లు దాదాపు 40 రోజుల పాటు విధులకు దూరంగా ఉన్నారు. గురువారం జూనియర్ డాక్టర్లు, ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో కొంత పురోగతి కనిపించింది. అత్యవసర, అవసరమైన సేవలకు మాత్రం శనివారం నుంచి హాజరవుతారని చెప్పడంతో రోగులకు, ప్రభుత్వానికి కాస్త ఊరట లభించినట్లయ్యింది.
దక్షిణ బెంగాల్‌లోకి వరద..
అయితే మరో సమస్య వచ్చిపడింది. జార్ఖండ్‌లోని తెనుఘాట్ డ్యాం నుంచి 3.5 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేయడంతో దక్షిణ బెంగాల్‌ను వరదలు ముంచెత్తాయి. విషయం తెలిసి వరద ప్రభావిత పశ్చిమ పుర్బా మేదినిపూర్ జిల్లాల్లో మమతా పర్యటించారు. తమకు సమాచారం ఇవ్వకుండా జార్ఖండ్ ప్రభుత్వం డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంపై సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి విడుదల గురించి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో మూడుసార్లు మాట్లాడానని మమతా తెలిపారు. ఒకవేళ నీటిని విడుదల చేయాలనుకుంటే, ముందుగా సమాచారం ఇచ్చి ఉండాల్సిందని చెప్పారు.
ఆరోపణలను ఖండించిన కేంద్రం..
మమత ఆరోపణలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. నీటి విడుదల విషయంలో Damodar Valley Corporation (DVC)ప్రోటోకాల్ అనుసరిస్తూ, బెంగాల్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిందని ఒక ప్రకటనలో పేర్కొంది. జార్ఖండ్ ప్రభుత్వం ఏకపక్షంగా తెనుఘాట్ డ్యాం నుంచి నీటిని విడుదల చేసిందని మంత్రిత్వ శాఖ ఆరోపించింది. అయితే బెంగాల్‌కు నీటి విడుదలలో తన ప్రభుత్వ పాత్ర లేదని జార్ఖండ్ జలవనరుల శాఖలోని ఒక అధికారి పేర్కొన్నారు. డీవీసీ అధికారుల నేతృత్వంలోని కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు.
జార్ఖండ్ నుంచి వాహనాలను ఆపేసిన బెంగాల్..
కుల్తీలోని ధన్‌బాద్-వెస్ట్ బుర్ద్వాన్ సరిహద్దు వద్ద జార్ఖండ్‌కు చెందిన వాహనాలను బెంగాల్‌లోకి ప్రవేశించకుండా పశ్చిమ బెంగాల్ పోలీసులు అడ్డుకున్నారు. వరదల్లో కార్లు కొట్టుకుపోకుండా ఉండేందుకు బెంగాల్-జార్ఖండ్ సరిహద్దును మూసివేసినట్లు బెంగాల్ ప్రభుత్వం తెలిపింది. అంతర్ రాష్ట్ర సరిహద్దును మూడు రోజుల పాటు మూసివేస్తామని బెంగాల్ ముఖ్యమంత్రి తెలిపారు. బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై JMM స్పందించింది. బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న చర్య తొందరపాటు చర్యగా అభివర్ణించింది. మమతా నిర్ణయం అసమంజసమని అధికార పార్టీ పేర్కొంది.