
గుజరాత్‌లో పశువుల వ్యాపారులు హత్యకు గురవుతున్నారా?
రోడ్డు ప్రమాదాలుగా కేసులు నమోదు.. గో సంరక్షకుల పని అంటున్న మృతుల కుటుంబసభ్యులు..
గుజరాత్ రాష్ట్రంలో పశువుల వ్యాపారుల (Cattle trader) మరణాలపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
పోలీసులు రోడ్డు ప్రమాదంగా కేసులు నమోదు చేస్తు్న్నారు. బలంగా కొట్టడం వల్లే చనిపోయారని పోస్టుమార్గం నివేదికలు చెబుతున్నాయి.
అహ్మదాబాద్‌కు చెందిన పశువుల వ్యాపారిని గో సంరక్షకులే (Cow vigilantes) కొట్టి చంపారని మృతుడి కుటుంబ సభ్యులు అంటున్నారు. కాని పోలీసులు మాత్రం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చెబుతున్నారు.
అసలేం జరిగింది?
32 ఏళ్ల మొహమ్మద్ భూరా ఏప్రిల్ 22న ఉదయం తన స్నేహితుడు రఫీక్ సయ్యద్‌తో కలిసి పని మీద ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రయినా ఇంటికి చేరుకోలేదు. మరుసటి రోజు ఉదయం గాంధీనగర్ జిల్లాలోని సంతేజ్ గ్రామం నర్మదా కాలువ సమీపంలో తన కారులో కాలిపోయి శవమై కనిపించాడు భూరా. ఇక 23 ఏళ్ల రఫీక్ తీవ్ర గాయాలతో కారు పక్కన అపస్మారక స్థితిలో కనిపించాడు. అటుగా వెళ్తున్న వారు ఫోన్ చేయడంతో అంబులెన్స్ సిబ్బంది ఇద్దరినీ అహ్మదాబాద్‌లోని సోలా సివిల్ ఆసుపత్రికి తరలించారు. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన భూరా చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. రఫీక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో చికిత్స పొందుతున్నాడు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉంది.
ప్రమాదంగా కేసు నమోదు..
స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేశారు. "భూరా, రఫీక్ సంతేజ్, వాయనా గ్రామాల గుండా ప్రయాణిస్తుండగా.. వారు ప్రయాణిస్తు్న్న కారు ప్రమాదానికి గురై మంటలు చెలరేగాయి" అని ఎఫ్ఐఆర్ రాసి ఉంది.
పోస్ట్ మార్టం నివేదిక..
పోలీసుల వాదనకు విరుద్ధంగా పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చింది. భురా శరీరంపై గాయాలున్నాయని అందులో రాసి ఉంది. రఫీక్ ఒంటిమీదున్నవి కూడా కాలిన గాయాలు కావని అతని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ‘‘రఫీక్‌ను దారుణంగా కొట్టడం వల్ల గాయాలయ్యాయని అతనికి వైద్యం చేసిన సోలా సివిల్ హాస్పిటల్ వైద్యుడు మాకు చెప్పారు. కడుపు, తలలో అంతర్గత రక్తస్రావం జరిగింది. కాలిన గాయాలేమీ లేవు. కారు మంటల్లో చిక్కుకున్నపుడు తప్పించుకునే క్రమంలో కొన్ని కాలిన గాయాలయిన శరీరంపై ఉండాలి, " అని వైద్యుడు చెప్పాడని రఫీక్ భార్య రస్సేదా పేర్కొ్న్నారు.
గో సంరక్షకుల పనే..
భురా ప్రమాదవశాత్తూ కారు ప్రమాదంలో చనిపోలేదని, గో సంరక్షకులే కొట్టి చంపారని అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారం రోజులుగా వారు భురాను బెదిరిస్తున్నారని కూడా చెప్పారు. "ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు. మా అన్నను మొదట కొట్టి, ఆపై కారులోకి తోసి నిప్పంటించారు. మా అన్న స్నేహితుడు రఫీక్‌పై దాడి చేసిన గుర్తులు కనిపిస్తున్నాయి కానీ కాలిన గాయాలు లేవు" అని భురా తమ్ముడు ముకీమ్ చెప్పాడు.
"మా అన్నను స్థానిక గో సంరక్షకులు బెదిరింపులకు గురిచేస్తున్నారు. వ్యాపారం కొనసాగించుకునేందుకు వాళ్లు డబ్బు డిమాండ్ చేస్తున్నారు. గత వారం వాళ్లకు రూ.2వేలు చెల్లించాడు. అయినప్పటికి మా అన్నను టార్గెట్ చేశారు," అని ముకీమ్ చెప్పారు. తన అన్న, అతని స్నేహితుడు వెళ్ళిన మార్గంలో ఉన్న CCTV ఫుటేజ్‌లను పరిశీలించాలని ముకీమ్ పోలీసులను కోరాడు.
"ముహమ్మద్ భూరా ఖురేషీ వర్గానికి చెందినవాడు. పశువుల వ్యాపారం చేసేవాడు కావడంతో అతనిపై దాడి చేశారు. ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడూ గో రక్షకులకు మద్దతు ఇస్తుంది" అని అహ్మదాబాద్‌లో నివసిస్తున్న మైనారిటీ హక్కుల కార్యకర్త, AIMIM పార్టీ సభ్యుడు అసిమ్ షేక్ అన్నారు.
జనవరిలో మరో బాధితుడు..
జనవరి 2025లో ఇలాంటి ఘటనే జరిగింది. 21 ఏళ్ల అబ్దుల్ రజా ఖురేషి ..సబర్కాంత అహ్మదాబాద్‌ను కలిపే హైవే పక్కన పడి ఉండగా, అతని వాహనం దాదాపు 100 మీటర్ల దూరంలో బోల్తా పడింది.
"ఆ రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను. జనవరి 12న అబ్దుల్ పుట్టినరోజు. శుభాకాంక్షలు చెబుదామని ఫోన్ చేశా, సబర్కాంత నుంచి అహ్మదాబాద్‌లోని ఖాన్పూర్ మార్కెట్‌కు మాంసం తీసుకెళ్తున్నానని చెప్పాడు. కాసేపటికి అబ్దుల్ అమ్మ (నా సోదరి) నుంచి కాల్ వచ్చింది. ప్రమాదం జరిగిందని చెప్పింది. నేను వాళ్ళ ఇంటికి పరుగెత్తాను. అబ్దుల్ మృతదేహాన్ని కూడా చలించిపోయా. ఖురేషి ముఖం నీలం రంగులో ఉంది. అతని చేతివేళ్లను విరిచేసినట్లు కనిపించింది. కొన్ని పళ్లు కూడా లేవు. శరీరం మీదంతా గాయాల గుర్తులు ఉన్నాయి" అని సాజిద్ వివరించారు.
పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారు..
అబ్దుల్ గో సంరక్షకుల బాధితుడని కుటుంబసభ్యులు ఆరోపించారు. కాని పోలీసులు మాత్రం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని కేసు కట్టారు. ప్రమాదమే జరిగితే లారీ ఎందుకు ఎక్కడా చెక్కుచెదరలేదని, అబ్దుల్ తీసుకెళ్లిన 10 కిలోల మేక మాంసం ఏమైందని ప్రశ్నించారు సాజిద్.
"మమ్మల్ని గోరక్షకులు బెదిరింపులకు గురిచేస్తున్నారు. మా జోలికి రాకుండా ఉండేందుకు వాళ్లకు వారానికోసారి డబ్బులు చెల్లిస్తాము. ఆ వారం మేము వాళ్లకు డబ్బులు చెల్లించలేకపోయాం. ఎందుకంటే మాకు నెల నుంచి సరిగ్గా వ్యాపారాలు లేవు. సమయానికి చెల్లించనందుకే అబ్దుల్‌ను చంపేశారు. నేను అప్పు తెచ్చి చెల్లించి ఉంటే బాగుండేది. అబ్దుల్ ఈరోజు బతికే ఉండేవాడు," అని సాజిద్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
పోస్ట్‌మార్టం రిపోర్టులో..
అబ్దుల్ వీపుపై షూ గుర్తులున్నాయి. సన్నని, పొడవైన వస్తువుతో కొట్టినట్టుగా ఒంటిపై గాయాలున్నాయని పోస్ట్‌మార్టం రిపోర్టులో రాసి ఉంది. "అబ్దుల్ మరణంపై లోతుగా దర్యాప్తు చేయడానికి పోలీసులు నిరాకరించారు. ఇది ప్రమాదవశాత్తే జరిగిందని వారు అంటున్నారు. నేను కంప్లైంట్ చేసినా తీసుకోలేదు," అని సాజిద్ పేర్కొన్నారు.
గతేడాది ఇలాంటి ఘటనలే..
2024 సెప్టెంబర్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. మరో మాంసం వ్యాపారి రజాక్ ఖురేషి (39) అహ్మదాబాద్, గాంధీనగర్ మధ్య హైవేపై చనిపోయి కనిపించాడు. ఏడుగురు సభ్యులకు ఆయనే జీవనాధారం. పెళై సిద్ధ్‌పూర్‌లో ఉంటున్న పెద్ద కుమార్తెను చూసేందుకు బయల్దేరాడు. రజాక్ కత్తిపోట్లతో రక్తపు మడుగులో కనిపించినా.. గాంధీనగర్ పోలీసులు మాత్రం ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేశారు.
"పోస్టుమార్టం అయిన తర్వాత మృతదేహాన్ని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు.. ప్రమాదం ఎలా జరిగిందని పోలీసులను అడిగాం. రజాక్ మోటార్ సైకిల్‌ను ట్రక్కులాంటి పెద్ద వాహనం ఏదైనా ఢీ కొట్టి ఉండవచ్చని మాకు చెప్పారు" అని రజాక్ అల్లుడు డానిష్ ది ఫెడరల్‌కు చెప్పారు.
"మేం ధనవంతులం కాదు. కోర్టులో కేసు వాదించే స్థోమత మాకు లేదు. అయితే దుకాణాన్ని మూసేయాలని రజాక్‌ను గోసంరక్షణలు గతంలో చాలాసార్లు బెదిరించారని పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదు," అని చెప్పాడు.
బనస్కాంతలో మరో కేసు..
మరో పశువుల వ్యాపారి మిస్రి ఖాన్ (43)ను గో సంరక్షకులు దాడి చేసి కొట్టి చంపగా.. అతని స్నేహితుడు హుస్సేన్ ఖాన్ తప్పించుకున్నాడు. ప్రత్యక్ష సాక్షి ఖాన్ ఫిర్యాదు ఆధారంగా బనస్కాంత పోలీసులు ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఐదుగురిపై భారత శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్లు 149 (చట్టవిరుద్ధంగా గుమిగూడడం), 506 (2) (నేరపూరిత బెదిరింపు), 120 బి (నేరపూరిత కుట్ర) కింద కేసు కట్టారు.
ఇదే సమయంలో ఐదుగురు నిందితులలో గోసంరక్షకుడని చెప్పుకునే అఖిల్ రాజ్.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాను ఏమి చేసినా గోమాత కోసమేనని, గోమాతను బాధపెట్టే ఎవరినైనా చంపడానికి వెనుకాడనని అందులో పేర్కొన్నాడు.