‘‘రత్న భాండాగార్‌’’పై అపోహలు నిజమేనా?
x
పెట్టెలో స్వామి వారి ఆభరణాలను తరలిస్తున్న దృశ్యం

‘‘రత్న భాండాగార్‌’’పై అపోహలు నిజమేనా?

పూరీ జగన్నాథ్ స్వామి ఆభరణాలను దొంగిలించకుండా విషసర్పాలు కాపలాగా ఉంటాయా? ఆ గది తలుపులు తెరిస్తే అరిష్టమా ? ఈ ప్రచారంలో వాస్తవమెంత?


పూరీ జగన్నాథ్ ‘రత్న భాండాగార్’లో విష సర్పాలు లేవు. రహస్య సొరంగాలు అస్సలు లేవు. భక్తుల్లో గత కొన్నేళ్లుగా ఉన్న అపోహకు తెరపడింది. రత్న భాండాగార్ తలుపులు తెరిస్తే అరిష్టం జరుగుతుందని, స్వామి వారి విలువైన ఆభరణాలకు సర్పాలు కాపలాగా ఉంటాయని గత కొన్ని దశాబ్దాలుగా ప్రచారం జరిగింది. అవన్నీ వాస్తవం కాదని తేలిపోయింది. 11 మంది సభ్యుల కమిటీ స్వామి వారి నగలను భద్రపరిచిన గదిలోకి వెళ్లారు. ఏడు గంటల పాటు ఆ గదిలోనే ఉన్నారు. క్షేమంగా బయటకు తిరిగొచ్చారు. బంగారు ఆభరణాలను చెక్కపెట్టేలో భద్రపరిచి ఆలయం లోపల నిర్మించిన తాత్కాలిక స్ట్రాంగ్‌రూమ్‌లోకి తరలించారు. అయితే ఇప్పటిదాకా భద్రపరిచిన ఆభరణాల వివరాలను వెల్లడించేందుకు రాథ్ నిరాకరించారు.

అవాస్తవాలను వ్యాప్తి చేయొద్దు.. జస్టిస్ బిశ్వనాథ్ రాథ్

తమ పరిశీలనలో సొరంగాలున్న ఆనవాలేమీ కనిపించలేదని అని సూపర్‌వైజరీ కమిటీ ఛైర్మన్, ఒరిస్సా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రాథ్ పేర్కొన్నారు. ఇకపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం మానుకోవాలని మీడియా కోరారు.

‘స్వామివారి ఆభరణాలను భద్రపరిచిన రహస్య గదిలో ఎలాంటి సొరంగాలు లేవు. కేవలం గది మాత్రమే ఉంది. అది సుమారు 20 అడుగుల ఎత్తు 14 అడుగుల పొడవు ఉంది. గది పైకప్పు నుంచి కొన్ని చిన్నపాటి రాళ్ళు పడిపోయాయి. గది గోడలు పగుళ్లు ఇచ్చాయి. మేం భయపడినంతగా తేమగా నేల లేదు." అని మరో కమిటీ సభ్యుడు, సేవకుడు దుర్గా దాస్మోహపాత్ర చెప్పారు.

ఆలయం లోపల సొరంగాలేమైనా ఉంటే వాటిని కనుగొనేందుకు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) సాయంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని కమిటీ సభ్యుల్లో ఒకరైన గజపతి మహరాజ్ దివ్య సింఘా దేబ్ సూచించారు.

ఊపిరి పీల్చుకున్న కమిటీ సభ్యులు..

రత్న భాండాగార్‌లోకి జూలై 14వ తేదీన కమిటీ సభ్యులు లోపలికి ప్రవేశించారు. లోపల ఉన్న రెండు గదుల తలుపులు తెరిచి స్వామి వారి విలువైన ఆభరణాలను బయటకు తీసుకొచ్చారు. జూలై 18 వతేదీన కమిటీ సభ్యులు మరోసారి లోపలికి వెళ్లి మూడో గది తలుపులు కూడా తెరిచి విలువైన వస్తువులను బయటకు తెచ్చి స్ట్రాంగ్ రూంలో ఉంచారు. అయితే స్వామి వారి అభరణాలను ఎవరూ దొంగిలించకుండా ఉండేందుకు విషసర్పాలు కాపలాగా ఉంటాయన్న ప్రచారం ఉంది. దాన్ని పరిగణనలోకి తీసుకున్న కమిటీ అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు కూడా తీసుకుంది. గది వెలుపల పాములు పట్టే వాళ్లను సిద్ధంగా ఉంచారు. పూరీలోని ప్రధాన ఆసుపత్రిలో విష సర్పాల విరుగుడు మందును సిద్ధంగా ఉంచారు. అదనంగా ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ODRAF)ను రప్పించారు. అయితే సర్పాలేమీ కనిపించకపోవడంతో కమిటీ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ఆంగ్లేయుల పాలనలో తొలిసారి..

తనిఖీ నిమిత్తం 1905లో మొదటిసారిగా బ్రిటీష్ వారు ఈ రత్న భాండాగార్ తలుపులను తెరిచారు. 1926లో బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్, చివరిసారిగా 1976లో అప్పటి ఒడిశా గవర్నర్ భగబత్ దయాళ్ శర్మ నేతృత్వంలోని కమిటీ స్వామి వారి అభరణాలను లెక్కకట్టారు. ప్రస్తుతం 46 ఏళ్ల తర్వాత మరోసారి వాటిని లెక్కగట్టనున్నారు.

Read More
Next Story