ఢిల్లీ సీఎంగా ప్రమాణం చేసిన అతిశీ
x

ఢిల్లీ సీఎంగా ప్రమాణం చేసిన అతిశీ

ఢిల్లీ ఎనిమిదో ముఖ్యమంత్రిగా ఆప్ ఆద్మీ పార్టీ నేత అతిశీ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు.


ఢిల్లీ ఎనిమిదో ముఖ్యమంత్రిగా ఆప్ ఆద్మీ పార్టీ నేత అతిశీ శనివారం (సెప్టెంబర్ 21) ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆప్ సీనియర్ నేతలు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా కూడా హాజరయ్యారు.ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇటీవల తీహార్ జైలు నుంచి విడుదల అయిన ఆప్ చీఫ్ కేజ్రీవాల్.. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే దాకా సీఎం పీఠాన్ని అధిరోహించనని చెప్పారు. దీంతో అతిశీ శాసనసభా పక్ష నాయకురాలిగా ఎంపికయ్యారు. కాంగ్రెస్‌కి చెందిన షీలా దీక్షిత్, బీజేపీకి చెందిన సుష్మా స్వరాజ్ తర్వాత అతిశీ ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రి. స్వతంత్ర భారతదేశంలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన 17వ మహిళ కూడా. అయితే ఫిబ్రవరిలో దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున అతిషి కొంతకాలం పదవిలో ఉంటారు.

కొత్తమంత్రిమండలిలో ఒక్కరే కొత్తవారు..

కొత్త మంత్రి మండలిలో గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్‌, సుల్తాన్‌పూర్ మజ్రా నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖేష్ అహ్లావత్ ఉన్నారు. రాయ్, గహ్లోత్, భరద్వాజ్, హుస్సేన్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు.

కొత్త ప్రభుత్వ పదవి కాలం 5 మాసాలే..

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున అతిశీ ప్రభుత్వ పదవీకాలం 5 నెలలు మాత్రమే ఉంటుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మహిళా సమ్మాన్ యోజన, ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2.0 లాంటి కొన్ని సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలుచేయాల్సి ఉంటుంది. కేజ్రీవాల్ ప్రభుత్వంలో అతిశీ ఫైనాన్స్, రెవెన్యూ, పిడబ్ల్యుడి, పవర్, ఎడ్యుకేషన్‌తో సహా 13 పోర్ట్‌ఫోలియోలు ఉండేవి. అలాగే రాయ్ పర్యావరణం, అభివృద్ధి, సాధారణ పరిపాలన శాఖలకు ఇన్‌ఛార్జ్‌గా ఉండగా.. భరద్వాజ్ ఆరోగ్యం, పర్యాటకం, పట్టణాభివృద్ధి శాఖలు చూసేవారు. హుస్సేన్ ఆహారం, సరఫరాల మంత్రిగా ఉండగా, గహ్లోత్ రవాణా, గృహ మహిళా, శిశు అభివృద్ధి శాఖల బాధ్యతలను నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా చేయడంతో ఆయన శాఖలు అహ్లావత్‌కు అప్పగించే అవకాశం ఉంది. కాగా కొత్త క్యాబినెట్‌లో పాత నలుగురు మంత్రులు వారి మునుపటి శాఖల్లోనే కొనసాగుతారని సమాచారం.

Read More
Next Story