
‘నో డ్రోన్ జోన్’గా ఔరంగజేబు సమాధి
మొఘల్ చక్రవర్తి గురించి అభ్యంతరకర పోస్టులపై నిఘా పెట్టిన పోలీసులు
మహారాష్ట్ర(Maharashtra)లోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లా ఖుల్తాబాద్‌లో ఉన్న ఔరంగజేబు(Aurangzeb) సమాధిని తొలగించాలన్న డిమాండ్ల నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సమాధి ఉన్న ప్రాంతాన్ని ‘నో డ్రోన్ జోన్’గా ప్రకటించారు.
జిల్లా కేంద్రానికి 25 కి.మీ. దూరంలో ఉన్న ఖుల్తాబాద్ పట్టణంలో ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. రాజకీయ నాయకులు కూడా అందుకు మద్దతు తెలుపుతున్నారు. సోమవారం ఒక మత గ్రంథాన్ని కూడా తగులబెట్టారని వార్తలు రావడంతో నాగ్‌పూర్‌లో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. దీంతో ఉద్రిక్త ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బలగాలను మొహరించారు. అల్లర్లకు పాల్పడ్డ కొంతమందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు.
భారత పురావస్తు శాఖ పరిరక్షణలో ఉన్న జౌరంగజేబు సమాధిని మంగళవారం కలెక్టర్ దిలీప్ స్వామి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వదంతులను నమ్మవద్దని కోరారు. పుకార్లపై పోలీసులకు లేదా పరిపాలనా అధికారులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
“‘#ఆలమ్‌గీర్’ ‘#ఔరంగజేబ్’ హ్యాష్‌ట్యాగ్‌తో కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వాటిని పరిశీలించి తొలగిస్తున్నాం’’ అని సైబర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ శివచరణ్ పాంఢరే తెలిపారు. ఇప్పటివరకు 506 పోస్టులు తొలగించామని, 80 మందికి హెచ్చరికలు జారీ చేశామని చెప్పారు. “ఇకపై, అభ్యంతరకర పోస్టులు పెట్టినవారిపై కేసులు నమోదు చేస్తాం” అని హెచ్చరించారు.