
‘జనం దృష్టి మరల్చడానికే..’
‘రాయ్‌గఢ్ జిల్లాలో అదానీ గ్రూప్ బొగ్గు గని ప్రాజెక్టు కోసం ప్రభుత్వ పర్యవేక్షణలో కొన్ని వేల చెట్లు నరికేశారు.’ - ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బాఘేల్
లిక్కర్ స్కామ్‌లో ప్రమేయం ఉందని ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ (Bhupesh Baghel) కొడుకు చైతన్య బాఘేల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిన్న (జూలై 18) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై మరుసటి రోజు (జూలై 19) భూపేశ్ బాఘేల్ స్పందించారు. ‘‘రాయ్‌గఢ్ జిల్లాలో అదానీ గ్రూప్ బొగ్గు గని ప్రాజెక్టు కోసం ప్రభుత్వ పర్యవేక్షణలో తమ్నార్‌లో కొన్ని వేల చెట్లను నరికేశారు. గ్రామస్తులను బందీ చేశారు. ఈ ఘటనలకు అసెంబ్లీలో లేవనెత్తుతున్న సమయంలో జనం దృష్టి మరల్చేందుకు ఈడీ నా కొడుకును అరెస్టు చేసింది. " అని బాఘేల్ పేర్కొన్నారు. తన ఇంటిపై ఈడీ, ఆదాయపు పన్ను శాఖ దాడి చేసిన సమయంలో తనను అసెంబ్లీకి వెళ్లేందుకు కూడా అనుమతించలేదని చెప్పారు.
వాస్తవానికి ఈ గనిని మహారాష్ట్ర స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్ (MAHAGENCO)కి కేటాయించారు. అది అదానీ గ్రూప్‌నకు కాంట్రాక్ట్‌కు ఇచ్చింది.
"మేం అసెంబ్లీలో ఉన్నప్పుడు నా కొడుకును ED అరెస్టు చేసిందని మాకు తెలిసింది. మార్చి 10న జరిగిన రైడ్ నుంచి నుంచి నిన్న జరిగిన మా కొడుకు అరెస్టు వరకు మాకు ఎలాంటి నోటీసు అందలేదు. ఏ విచారణ కూడా జరగలేదు" అని బాఘేల్ పేర్కొన్నారు.