పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న బంద్
x

పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న బంద్

కోల్‌కతాలో విద్యార్థి సంఘం చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారడంతో బీజేపీ బుధవారం బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే బంద్‌కు అనుమతి లేదని మమతా సర్కార్ చెబుతోంది.


పశ్చిమ బెంగాల్ అట్టుడుకుతోంది. కోల్‌కతా ఆర్‌జీ కర్ వైద్యశాలలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ‘నబన్న అభిజన్‌’ పేరుతో ‘పశ్చిమ్‌ బంగా ఛాత్ర సమాజ్‌’ విద్యార్థి సంఘం మంగళవారం చేపట్టిన సచివాలయ ముట్టడి హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో బుధవారం బీజేపీ 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది.

బీజేపీ ఆధ్వర్యంలో రోడ్ల దిగ్బంధాలు..

భబానీపూర్‌లో బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ చేతులు కట్టుకుని తమ వాహనాలను బయటకు తీయవద్దని ప్రజలను కోరారు. నార్త్ 24 పరగణాల్లోని బొంగావ్ స్టేషన్, సౌత్ 24 పరగణాల్లోని గోచరణ్ స్టేషన్, ముర్షిదాబాద్ స్టేషన్‌లో బీజేపీ కార్యకర్తలు బంద్‌కు మద్దతుగా ప్రదర్శన నిర్వహించారు. నార్త్ 24 పరగణాస్‌లోని బరాక్‌పూర్ స్టేషన్‌లో బీజేపీ మద్దతుదారులు, టీఎంసీ కార్యకర్తలు ఎదురెదురు పడడంతో ఉద్రిక్తత నెలకొంది. హుగ్లీ స్టేషన్‌లో బీజేపీ కార్యకర్తలు లోకల్ రైలును అడ్డుకున్నారు. పుర్బా మేదినీపూర్ జిల్లాలోని నందిగ్రామ్ వద్ద బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. మాల్దాలో రోడ్డు దిగ్బంధనంపై టీఎంసీ, బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఘర్షణ పడిన వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. బంకురా టౌన్ బస్టాండ్ వద్ద బీజేపీ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు.

‘బంద్‌కు స్పందించొద్దు’

బిజెపి చేపట్టిన సార్వత్రిక సమ్మెపై స్పందించవద్దని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రజలను కోరింది. “బుధవారం బంద్‌కు ప్రభుత్వం అనుమతి లేదు. ఇందులో పాల్గొనవద్దని ప్రజలను కోరుతున్నాం. సాధారణ జీవితం ప్రభావితం కాకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటాం’’ అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్య సలహాదారు అలపన్ బందోపాధ్యాయ పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తెరిచి ఉంటాయని చెప్పారు. సెలవులో ఉన్న వారు మినహా మిగతా ఉద్యోగులంతా విధులకు హాజరుకావాలని లేదంటే షో-కాజ్‌ ఇవ్వాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిచ్చింది. రాజకీయ పార్టీలు చేపట్టే బంద్‌లు "చట్టవిరుద్ధం"అని గతంలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను బెంగాల్ పోలీసులు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

ర్యాలీ ఎందుకు హింసాత్మకంగా మారింది?

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ‘నబన్న అభిజన్‌’ ర్యాలీ పేరుతో పశ్చిమ్‌ బంగా ఛాత్ర సమాజ్‌ అనే విద్యార్థి సంఘం చేపట్టిన సచివాలయ ముట్టడి కార్యక్రమం హింసాత్మకంగా మారింది. దాదాపు నాలుగు గంటలపాటు కొనసాగిన ఈ హింసాకాండలో సీనియర్ పోలీసు అధికారులు, మహిళా నిరసనకారులు గాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 200 మందికి పైగా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులపై నిరసనకారులు రాళ్లు, గాజు సీసాలతో దాడి చేశారు. ఈ ఘర్షణల్లో కోల్‌కతా పోలీసులకు చెందిన 15 మంది సిబ్బంది, రాష్ట్ర పోలీసు బలగాలకు చెందిన 14 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

ఆందోళనకారులపై పోలీసుల చర్యలు

నబన్న వద్ద నిరసనకారుల గుంపును చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. పోలీసుల చర్యలో 17 మంది మహిళలు సహా 160 మంది నిరసనకారులు గాయపడ్డారని బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు.

Read More
Next Story