బెంగళూరు అంతరిక్ష ఆర్థిక రాజధాని అవుతుందా?
కర్ణాటక రాష్ట్ర ఆదాయంలో ప్రధాన వాటా ఎక్కడి నుంచి వస్తుంది? వారికి దొరికిన మరో కొత్త ఆదాయ వనరు ఏమిటి?
బెంగళూరు. ఈ పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఇస్రో. (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్). చంద్రయాన్ -3 విజయం తర్వాత అంతరిక్ష రంగం శరవేరంగా అభివృద్ధి చెందుతోంది.
ఆదాయానికి కొత్తమార్గం..
ఇప్పటిదాకా ఎన్నో ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో కొత్త ఆదాయమార్గాన్ని అన్వేషించింది. కర్ణాటక డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బయోటెక్నాలజీ (ఐటీబీటీ) అంతరిక్ష పరిశ్రమ ద్వారా ఆదాయం రాబట్టాలనుకుంటోంది. దీని కోసం కసరత్తు కూడా మొదలుపెట్టింది.
దేశంలోని 70 శాతం అంతరిక్ష పరిశోధనలు ఇస్రోలోనే జరుగుతాయి. ఇక్కడి నుంచి ప్రయోగించే ఉపగ్రహాలకు అవసరమైన చాలా భాగాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో తయారవుతాయి. ఇకపై వాటిని తమ రాష్ట్రంలోనే తయారు చేసేలా కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోందని ఐటీబీటీ వర్గాలు ఫెడరల్‌కి తెలిపాయి.
‘‘మరీ ముఖ్యంగా ఉపగ్రహాలను ప్రయోగించాక వాటి నుంచి వచ్చే సమాచారాన్ని (డౌన్‌లింక్) పవన-విద్యుత్ ఉత్పత్తి కంపెనీల తరహాలో వివిధ పరిశ్రమలకు ఉపయోగించడం ముఖ్యం. ఇతర పరిశ్రమలు కూడా ఉపయోగించుకునేలా ప్రత్యేక పాలసీని రూపొందించాలని నిర్ణయించారు. అంతరిక్ష రంగంలోని కొన్ని స్టార్టప్ కంపెనీలు కూడా ఈ విధానాన్ని రూపొందించడానికి సిద్ధంగా ఉన్నాయని’’ వర్గాలు తెలిపాయి.
బెంగళూరును అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు రాజధానిగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీబీటీ విభాగం అధికారి ఒకరు తెలిపారు. ‘‘ఓ చక్కటి విధానాన్ని రూపొందించడానికి చర్చలు జరుగుతున్నాయి. త్వరలో కీలక సమావేశం జరగనుంది. ఆ తర్వాత, పాలసీ మేకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కొత్త విధానాన్ని రాబోయే బడ్జెట్‌లో ప్రకటించాలని భావిస్తున్నారు.’’ అని పేర్కొన్నారు.
తెలంగాణ కూడా..
ఏ రాష్ట్రానికీ ప్రత్యేక అంతరిక్ష విధానం లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. మాజీ సీఎం కె చంద్రశేఖర్ రావు రూపొందించిన ముసాయిదా.. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కొత్త కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక రూపాన్ని సంతరించుకుని అవకాశం ఉంది. అంతకంటే ముందుగా కర్నాటక ప్రభుత్వం ఈ విధానాన్ని వీలైనంత త్వరగా ప్రకటించాలని యోచిస్తోంది.
44 బిలియన్ డాలర్లకు చేరువలో..
దేశంలో అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 8.4 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 2033 నాటికి 44 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఇందులో 40 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేలా చూస్తున్నారు. ఇస్రో, ఇతర అంతరిక్ష సంబంధిత పరిశోధనా సంస్థలు బెంగళూరులో ఉన్నందున.. ఈ రంగం నుంచి ప్రధాన వాటా సాధించడం సులువేనని ఓ అధికారి తెలిపారు.
సాప్ట్‌వేర్ రంగం నుంచే ప్రధాన వాటా..
ప్రస్తుతం రాష్ట్ర ఆదాయంలో ప్రధాన వాటా సాఫ్ట్‌వేర్ రంగం నుంచి వస్తుంది. ఆదాయాన్ని కొత్త మార్గాల ద్వారా సమకూర్చుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ‘బియాండ్ సాఫ్ట్‌వేర్’ విధానాన్ని ప్లాన్ చేస్తోంది. ఆ ప్రయత్నంలో భాగమే స్పేస్ పాలసీ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐటీబీటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తూ కొత్త విధానాలను అమలు చేయడంపై చర్చలు జరిగాయన్నారు. త్వరలో వివిధ కంపెనీలతో సమావేశం కానున్నామని, బెంగళూరును అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు రాజధానిగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు.