షరతులకు లొంగని బెంగాల్ సర్కార్.. కొనసాగుతున్న జూడాల ఆందోళన
x

షరతులకు లొంగని బెంగాల్ సర్కార్.. కొనసాగుతున్న జూడాల ఆందోళన

వైద్య ప్రతినిధుల బృందంతో చర్చల సమావేశానికి సీఎం మమతా బెనర్జీ హాజరుకావాలని, అది కుదరకపోతే ప్రత్యక్ష ప్రసారంలో ఆమె పాల్గొనాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.


కోల్‌కతా ఆర్‌జీ కర్ వైద్యశాలలో మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన జరిగి నెల ముగిసింది. ఈ దుర్ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆర్‌జీ కర్ జూనియర్ డాక్టర్ల ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది. రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విధులకు హాజరుకావాలని సుప్రీంకోర్టు సూచించినా ఫలితం లేకుండా పోయింది. కోల్‌కతాలోని స్వాస్థ్య భవన్ సమీపంలో జూనియర్ డాక్టర్లు రెండో రోజు కూడా తమ నిరసనను తెలిపారు.

నిరసన వెనుక రాజకీయం లేదు: వైద్యులు

జూనియర్ డాక్టర్ల నిరసన 33వ రోజుకు చేరుకుంది. బుధవారం స్వాస్థ్య భవన్ వెలుపల నిరసన తెలుపుతున్న జూడాలనుద్దేశించి ఆరోగ్య శాఖ సహాయ మంత్రి చంద్రిమా భట్టాచార్య మాట్లాడారు. ‘ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని, అయితే రాజకీయ శక్తుల ప్రభావానికి లోనుకావద్దని పరోక్షంగా ఆమె అన్నారు. వెంటనే వైద్యులు భట్టాచార్య వ్యాఖ్యలను ఖండించారు. ఆమె ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు. మా ఆందోళన వెనుక ఎలాంటి రాజకీయం లేదని మీడియాతో అన్నారు.

జుడాలు ‘జాతి వ్యతిరేకులు..’

సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించి విధుల్లో చేరాలని భట్టాచార్య వైద్యులను కోరారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుంటుందా? అనే దానిపై నేరుగా సమాధానం ఇవ్వలేదు. అయితే TMC నాయకులు, ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లను "జాతి వ్యతిరేకులు"గా అభివర్ణిస్తున్నారు. డాక్టర్ల ఆందోళన కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, తాము కూడా వైద్యులకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తామని టిఎంసి ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ పేర్కొన్నారు. ‘‘ఒక మహిళా డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేశారు. నేరస్తులకు శిక్ష పడాలని కోరుతున్నాం. నిరసనల పేరుతో వైద్యులు విధులకు దూరంగా ఉండడం ఆమోదయోగ్యం కాదు.’’ అని అన్నారు. మరో TMC నాయకుడు, చందన్ ముఖోపాధ్యాయ.. సుప్రీం ఆదేశాలను ధిక్కరించి ఆందోళన చేస్తున్న వైద్యులను "దేశ వ్యతిరేకులు"గా ముద్రవేశారు.

చర్చలకు ప్రభుత్వ ఆహ్వానం..

12 నుంచి 15 మంది సభ్యులతో కూడిన వైద్య ప్రతినిధుల బృందం రాష్ట్ర సచివాలయంలో బుధవారం సాయంత్రం 6 గంటలకు జరిగే సమావేశానికి హాజరు కావాలని చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ వైద్యులను ఆహ్వానించారు. అయితే సీఎం హాజరవుతారా? లేదా? అనేది స్పష్టంగా చెప్పలేదు. ఈ సమావేశానికి హాజరుకావడానికి ముందు జూనియర్ డాక్టర్లు కొన్ని కండీషన్లు పెట్టారు. “సీఎం సమక్షంలో చర్చ జరగాలి. ప్రత్యక్ష ప్రసారంలో ఆమె మాట్లాడాలి. ఈ ఉద్యమం వివిధ వైద్య కళాశాలలు, ఆసుపత్రులతో ముడిపడి ఉన్నందున కనీసం 30 మంది ప్రతినిధులు హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలి.” అని జూనియర్ డాక్టర్ల ఫోరమ్ సభ్యుడు విలేకరులతో అన్నారు. అయితే ముందస్తు షరతులతో కూడిన సమావేశానికి ప్రభుత్వం నిరాకరించింది.

మళ్లీ అభ్యర్థిస్తాం: మంత్రి

చాలా రోజుల పాటు నిర్వహిస్తున్న ఆందోళన కారణంగా వైద్య సేవలకు అంతరాయం కలుగుతుందని, వెంటనే విధులకు హాజరుకావాలని భట్టాచార్య, పంత్, డిజిపి రాజీవ్ కుమార్‌ వైద్యులను కోరారు. "సమావేశానికి డాక్టర్ల ప్రతినిధుల బృందం హాజరవుతుందని భావిస్తున్నాం. కానీ వారు వెళ్లలేదు. షరతులతో ఏ సమావేశం జరగదు. చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయి. ప్రత్యక్ష ప్రసారం లేదా చర్చలకు సిఎం తప్పనిసరిగా హాజరు కావాలనే డిమాండ్ ను ప్రభుత్వం అంగీకరించదని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి చంద్రిమా భట్టాచార్య స్పష్టం చేశారు.

ఆగస్టు 9న ఆర్‌జి కర్ హాస్పిటల్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య తర్వాత నిరసనలు వెల్లువెత్తాయి. మరుసటి రోజు ఒక పౌర వాలంటీర్‌ను అరెస్టు చేశారు. కలకత్తా హైకోర్టు ఆదేశం తర్వాత కేసు విచారణ సిబిఐ చేపట్టింది.

వైద్యుల డిమాండ్లివి..

భాధితురాలి కేసు విచారణ పారదర్శకతంగా జరగాలి. మహిళా వైద్యులు, సిబ్బందికి భద్రతను పెంచాలి. కేసును తప్పుదోవ పట్టించిన కోల్‌కతా పోలీస్ కమిషనర్‌, రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శితో సహా పలువురు అధికారులను సస్పెండ్ చేయాలని జూనియర్ డాక్టర్లు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు.

Read More
Next Story