కన్నబిడ్డనే కడతేర్చిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సీఇవో
x

కన్నబిడ్డనే కడతేర్చిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సీఇవో

అభంశుభం తెలియని నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసిందో తల్లి. ఆపై బ్యాగ్‌లో బాలుడి మృతదేహాన్ని కుక్కింది. గోవా నుంచి కర్ణాటక వెళ్తూ... పోలీసులకు పట్టుబడింది.


ఆమె ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవో. ఉన్నత విద్యావంతురాలు. ప్రపంచంలోని టాప్‌ యూనివర్సిటీలో చదువుకున్నారు. అంతటి చరిత్ర కలిగిన ఆమె.. కన్న కొడుకును పొట్టనపెట్టుకుంది. ఆ హత్యను దాచిపెట్టేందుకు ప్రయత్నించి.. పోలీసులకు అడ్డంగా బుక్కైంది. ఇంతకీ కన్న కొడుకును హత్య చేసేంత కసాయిగా ఆమె ఎందుకు మారింది. ఎలా దొరికింది?

అసలేం జరిగిందంటే...


గోవాలో దారుణం జరిగింది. అభంశుభం తెలియని నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసిందో తల్లి. ఆపై బ్యాగ్‌లో బాలుడి మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నించింది. గోవా నుంచి కర్ణాటక వెళ్తూ... పోలీసులకు పట్టుబడింది. గోవాలో వెకేషన్‌ కోసం వెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టింది. అయితే హత్య చేసిన తల్లి సాధారణ మహిళ కాదు.. ఓ ప్రముఖ స్టార్టప్‌ కంపెనీకి సీఈవో. అంతటి విద్యావంతురాలు అసలేందుకు తన కుమారుడిని చంపిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆమెకు ఆరు రోజుల పోలీస్ కస్టడీ విధించింది కోర్టు.

ఓ ల్యాబ్‌ కంపెనీ సీఇవో ఈమె...

39 ఏళ్ల సుచ‌నా సేథ్ బెంగుళూరులోని మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్ కంపెనీ సీఈవోగా పని చేస్తున్నారు. లింకిడిన్ పేజీ ప్రకారం వంద బ్రిలియంట్ వుమెన్ ఇన్ ఏఐ ఎథిక్స్ ఫ‌ర్ 2021లో సుచ‌నా టాప్ ప్లేస్‌లో ఉన్నారు. హార్వర్డ్ యూనివ‌ర్సిటీలో చ‌దువుకున్నట్లు ఆమె లింకిడిన్‌లో ఉంది. డేటా సైన్స్ టీమ్‌ల‌కు శిక్షణ ఇవ్వడంలో ఆమెకు 12 ఏళ్ల అనుభ‌వం ఉంది. ఇంత ఉన్నతచదువు చదివిన మహిళ.. అంత క్రూరంగా తన కుమారుడిని ఎందుకు చంపాల్సి వచ్చింది..? దానికి అసలు కారణాలేంటన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

గోవాకు వెకేషన్‌కి వెళ్లి...


గోవాకు వెకేషన్‌ కోసం వెళ్లిన సుచనా సేథ్‌.. కాండ‌లిమ్‌లోని బ‌నియ‌న్ గ్రాండ్ హోట‌ల్‌లోకి త‌న కుమారుడితో క‌లిసి చెక్ ఇన్‌ అయ్యింది. సోమవారం మాత్రం ఆమె ఒంట‌రిగా చెక్ ఔట్ అయ్యింది. బెంగుళూరుకు ట్యాక్సీ బుక్ చేయాల‌ని హోట‌ల్ స్టాఫ్‌ను కోరింది. ఫ్లైయిట్‌లో వెళ్లాల‌ని కోరినా సుచనా సేథ్‌ ట్యాక్సీలోనే వెళ్లేందుకు మొగ్గు చూపింది. అయితే ఆమె కుమారుడు మిస్ అయిన‌ట్లు హోట‌ల్ సిబ్బంది గుర్తించింది. ఆమె రూమ్ వీడిన త‌ర్వాత ఆ రూమ్‌లో ర‌క్తపు మ‌ర‌క‌లు ఉన్నట్లు హౌజ్ కీపింగ్ స్టాఫ్ గుర్తించారు. హోట‌ల్ సిబ్బంది వెంట‌నే గోవా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... వాళ్లు ట్యాక్సీ డ్రైవ‌ర్‌ను కాంటాక్ట్ అయ్యారు. కుమారుడి గురించి చెప్పాల‌ని సీఈవో సుచ‌నాను పోలీసులు ఫోన్‌లోనే అడిగారు. అయితే ఆమె త‌న ఫ్రెండ్ అడ్రస్ ఇచ్చి... అక్కడ త‌న కుమారుడు ఉన్నట్లు చెప్పింది. కానీ ఆ అడ్రస్ ఫేక్ అని తెలుసుకున్న పోలీసులు... మరోసారి ఆమె వెళ్తున్న క్యాబ్‌ డ్రైవర్‌కు ఫోన్‌ చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలని ఆదేశించారు. దీంతో డ్రైవర్‌ నేరుగా కారును స‌మీపంలోని చిత్రదుర్గ పోలీసు స్టేష‌న్‌కు తీసుకెళ్లాడు. ఆ కారులోని బ్యాగ్‌లో కుమారుడి శవం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

కేసును విచారిస్తున్న పోలీసులు..


నాలుగేళ్ల కుమారుడిని ఎందుకు హ‌త్య చేయాల్సి వ‌చ్చింది. దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా.. ఇంకేవరిదైనా హస్తం ఉందా అనే విషయాలు ఇంకా తెలియ‌రాలేదు. అయితే కొంతకాలంగా భార్యభర్తల విభేదాలున్నాయని... అదే కారణం కావచ్చని బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Read More
Next Story